March 31, 2013

కాకరకాయకి చేయూత వంకాయ !


కవిత రచన : సాత్విక

వచన కవిత్వమా వంకాయా ?
అని అవహేళన ఎందుకులే ?

కవిత్వమా కాకరకాయ ?
అన్న ప్రశ్నకి సమాధానముగా,

పద్య, గేయ పద సంపుటి అంతరించి,
'తెలుగు' కనీసం వాడుక భాషగా సంచరించ
కూడా 'అనాధ' ఆగుతున్న ఈ తరుణములో,

నేనున్నాను,
నేనున్నాను,
ఆదుకొంటాను అణగారిపోనివ్వనని,

భాషాభిమానం చాచిన అభయ హస్తమే వచన కవిత్వ ఆకారము,
పుట్టించెను తెలుగు మీద సామాన్య మానవుడికీ మమకారము,
పాత తర భావావేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఒరవడికి శ్రీకారం,
'ఇది ఉద్భవించినది' -- తగ్గించడానికి తెలుగు తల్లి చేసే హాహాకారం,

నియమ నిభందనలు తెలియదని... అసలు లేనే లేవని అవహేళన ఆపవోయి,
అలంకార బంధాలు వదిలించుకొన్న 'స్వేచ్చే' దీని ఆయువుపట్టని గ్రహించవోయి,    
ఈ తరహా కవిత్వానికి నవ సమాజమున ఓటుబ్యాంకు ఎక్కువోయి,
కవిత్వానికి, 'వచన రూపం' అందించిన శక్తి నీవు గ్రహించవోయి,
మారుతున్న కాలానికి అనుగుణముగా రూపాంతరం చెందెనోయి,
మనసున్న ప్రతి మనిషి మదిలోకి అలవోకగా చేరిపోయే శైలే దీనికున్నదోయి,
'అంతరార్ధ వివరణా..' వ్యయా-ప్రయాసలు అవసరం లేని సులువు దీని సోంతమొయి, 

సరళమయిన పదాల అల్లిక తో కూడిన 'ప్రాసే' దీని అసలు బలం,
లోతయిన భావాలని ఇమిడ్చుకోగలిగినందుకు నీవు చేయి సలాం, 
కవిత్వం మీద మనసున్న మనిషి ఆకలి తీర్చే అచ్చతెలుగు గళం,
చండ ప్రచండ చక్రవర్తులయిన ఉండి వుంటే అయ్యేవారు దీనికి గులాం,

వచన కవిత్వమా నీకివే నా వందనాలు,
తెలుగుని పది మందికీ చేర్చు,
అన్ని రూపాల విస్తరించ ప్రయత్నించు,
నిన్ను ప్రశ్నించిన వారికి తెలుగు'వాడి'ని చూపించి ప్రతిఘటించు...

March 29, 2013

వేసవి ప్రేమలు !!


కవిత రచన : సాత్విక
పొద్దున్నే పనిగట్టుకు వస్తావు,
నాచేతే పాటలెన్నో పాడిస్తావు,
హుషారుగా ఉరకలు వేయిస్తావు,
విషయ వివరణలతో వేయించేస్తావు,

నన్ను ఎవ్వరిని చూడోద్దంటావు,

నేను నిన్ను మాత్రమే చూడాలంటావు,
ఎవ్వరితో నన్ను మాట్లాడద్దంటావు,
నీవు మటుకు అందరినీ పలకరిస్తావు,

సమాధానం చెప్పలేని ప్రశ్నలేస్తావు ,
నన్నే నువ్వు ఎక్కువగా వేధిస్తావు,
నా గురించే ఎక్కువగా ఆలోచిస్తావు,
అందరిలోన నిలబెట్టి ఇబ్బంది పెడతావు,

ఒక్కరోజు కలవకపోతే నా పద్ధతేమి బాలేదంటావు,
నా నుంచి ఎన్నెన్నో సంజాయిషులు కావాలంటావు,
నా మంచీ, చెడ్డల సమాచారం మొత్తము సేకరిస్తావు,
కనిపించిన ప్రతివారికి చూపించి మరీ వివరించేస్తావు,
అల్లరి చేష్టలు భరించి ఓర్పుతో ముందుకు నడిపిస్తావు,

పైన వివరించిన నా భావనే,
మాలో ప్రతి ఒక్కరికి నీతో నిజమే,
మేము రెండో క్లాసు అల్లరి పిల్లలమే,
'మీరు' నుంచి 'నువ్వు' అనేంతగా కలసిపోయావ్,
మమ్మల్ని నీ నుండి దూరం చేసేస్తున్నదీ సమ్మర్,
అందుకే  వీ మిస్ యు టీచర్” & "వీ లవ్ యు టీచర్".

March 28, 2013

ఈ ప్రక్కకి చూడొద్దు ...


కవిత రచన : సాత్విక

అసలే శాస్త్రమూ చదువలేదు
నేనేవ్వరితో వాదించుట లేదు,
వారినెవ్వరినీ కాదనుటలేదు 
అయిననూ,  నాకు అనిపించేను ఇలా
'సన్యాసమంటే స్పందన లేకుండుటే ' కదా !

కాషాయం ఏరి కోరి కట్టుకొనుట,
రంగు మీద వారి మనస్సు లగ్నమగుటే,

నియమాలన్నీ వల్లించుట పాటించుట,
తెలిపెనులే శ్రద్ధ, భక్తిలకి వారు వశమగుటే,

నియమ నిబంధనలలో ఇరికించుకోనుట,
సన్యాసిగా మార్పునాసించిన ప్రక్రియలోని బాగము మాత్రమే,

ధర్మ-అధర్మ ప్రభోదాల వారియొక్క ఆధ్యాత్మిక చింతన,
ఖచ్చితముగా నిలుపును కొంతమేర 'సాధువు'ల చెంతన,

సన్యాసము అనునది కేవలం ఒక మానసిక భావజాలము,
కావాలనుకున్నంత మాత్రాన అందరమూ పొందజాలము,

పౌడరు,క్రీములు అందముగా అద్దుకునే గురువులు ఒక పక్క,
కోపగించుకొని కన్నెర్ర చేసే సాములోరులు అందరికెరుక,
మైమరచి తరచి తరచి ఆనక ఊసులడిగేను తస్స చెక్క,
ఆణువణువూ పరీక్షించు అగుపించేను అసలు చందము ఎంచక్కా,

అందుకే, కాషాయ వస్త్రదారులందరూ సన్యాసులు కారులే,
అందులోన అధిక శాతం సంసారులేకొంతమేర సాదువులే !

కాషాయం అనినచొ వెలవెల పోవుటకు సూచనగా నీవు పరిగణించు,
మేనిన అలంకరించ కాదది, నిర్లిప్తత నిండిన మనస్సును అది ఆవహించు !

సమాజములోని అవినీతి, అన్యాయం, దోపిడీతనం ఒకింత,
ప్రభుత్వాల పనితీరువేటిమీదా స్పందనే లేకున్నారు ప్రజలంతా,
సమాజశ్రేయస్సు పట్టని సమూహ సన్యాసులయ్యరా వీరంతా ?

అందుకే అస్సలు ఈ ప్రక్కకి చూడొద్దు,
కనిపిస్తారు సమాజములోని ఆధునిక సన్నాసులు,
మఱియూ కాషాయం ధరించని సన్యాసులే అధిక మొత్తముగా,
కాషాయాన్ని విషకషాయముగా ఉపయోగించువారే ఏకముగా !!

March 27, 2013

కోకు


కవిత రచన : సాత్విక


భాష లేని భావమెందు'కో',
భావం లేక భాష నిలువలేనందు'కు'..

ఆశ తోటి ఆరాటమెందు'కో',
ఆరాటం లేక ఆశ గెలవలేనందు'కు'..

గమ్యం తెలియని గమనమెందు'కో',
గమనం తోనే గమ్యం చేరుకునేటందు'కు'..

కల్పితాలకి వర్ణనలెందు'కో',
వర్ణనతోనే కల్పితాల అందం విడమరచేటందు'కు'..

స్పందన కరువయిన చోట సాహిత్యమెందు'కో',
సాహిత్యమున్నదే స్పందన కలిగించేటందు'కు'..


March 25, 2013

ష్.. ష్.. ఎవ్వరికీ చెప్పను/ద్దు

కవిత రచన : సాత్విక
కాలము రహస్యముతో --

నీ ఇంటి పేరే అపహాస్యమా !
అయ్యో !  పాపం ఓ రహస్యమా !
ఆకారం అన్నది అసలు లేనేలేదులే,
ఆయుర్దాయం అంతంత మాత్రమేలే,
నువ్వు బంధువే కదా అందరికి,
అయినా చులకనే ప్రతి ఒక్కరికీ ...

ఎవ్వరికీ చెప్పద్దంటూనే ఎవరెవరికో చెప్పేస్తారు,
ఎవరికివారే తమకు మాత్రమే తెలుసనుకుంటారు,
'ఎవ్వరికీ చెప్పొద్దూ' అన్న మాటే 'నీ' ప్రసార సాధనమయ్యేనే,
ఇదే అసలు సిసలు ఆధునిక రహస్య ప్రచార మంత్రములే,
నువ్వందరికీ ఎరుకేనన్న అసలు రహస్యము వారెరుగరులే,
డంగవుతారు, వారి విషయమే చేరినచో వారిని రహస్యముగా,
ఓ నా రహస్యమా!  సమజవ్వవు ఎప్పటికీ  'నీ' భాదలు సంపూర్ణముగా

అదే కాలము మనిషితో --

రహస్యమున్నదే అవ్వడానికి లీకు,
అది చేస్తుంది అందరి నిగ్రహాన్ని వీకు,
నువ్వు దాచి పెట్ట ప్రయత్నించమాకు,
దాని జోలికి నువ్వస్సలు పోమాకు ...

రహస్యానికి కుదురు తక్కువోయి,
దాన్ని జయించునది కుతూహలమేనోయి,
మూగవానిని మంచిగా మాట్లాడించగలదు,
చెవిటివానికి చక్కగా వినిపించగలదు,
గ్రుడ్డివానికి సైతము దర్సనమిచ్చును,
మాములోడిని మాత్రము మభ్యపెట్టును ...

ఒరేయి బావా , ఎవ్వరికీ చెప్పొద్దురో,
ఎవండోయి పిన్నిగారు, ఎవ్వరికీ చెప్పొద్దూ,
నీకు మాత్రమే చెప్తున్నా, నీవెవరికీ చెప్పొద్దూ, 
ఎవ్వరికీ చెప్పనని ఒట్టు పెట్టి మరీ అడిగేవాళ్ళు కొందరు,
ఒట్టు పెడితే చాలు చెబుతానని వెంటపడేవాళ్ళు మరికొందరు,
రహస్యం రగిల్చిన 'కుతూహల'  క్రీడలోని సభ్యులే పై వారందరూ,
రహస్యానికి నిదానము లేదులే, విష(య)దానము తప్పక చేయించునులే ... 

కొందరి రహస్యం మరికొందరు చెప్పును తమ జోస్యముగా, 
అదే జోస్యము ఇంకొందరికి తోచును యమ హాస్యముగా,
మది లోతుల్లో వారిని గూర్చి వారే వినలేని నిజాలెన్నెన్నో,
అంతరాలలో మనస్ఠాపితమయిన ఎనలేని రహస్యాలెన్నెన్నో,
ఎవ్వరికీ తెలియకూడదని నీవు భావించిన, అది రహస్యముగా నిలవదోయి,
నీ మది లోతుల్లో ఖననమయిన నిజాలు మాత్రమే రహస్యముగా నిలుచునోయి,
నీ పెదవి దాటిన పిమ్మట అది విష(య)మే గాని రహస్యమెంతమాత్రము కాదోయి,
అందరికీ విషయము తప్పక చేరును కానీ అది చేరు మార్గము నీకు రహస్యమేనొయి ...

నేను మీతో -- 
బై ద వే మీ దగ్గరేమయిన రహస్యం వుంటే చెబుదురు , ఎవ్వరితో చెప్పను .... ఓ.కే  నా....  

March 24, 2013

భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా !!


కవిత రచన : సాత్విక
(.. రెండవ భాగము ..)

నేనూ బాల్కనీలో నుంచొని ఉన్నప్పుడూ....
ఎదురింటి మేడ మీదకి వచ్చిందో మిస్సు,  ఆమె చేసింది అమెరికాలో  యెమ్.ఎస్సు,
చెయ్యి ఊపాను  గుర్తొచ్చి నా హ్యాపీ డేసు,  ఆ బుల్లి నా మీద ఆడింది కస్సు బుస్సు,   
ఇంట్లో అందరిచేత ఇప్పించేసింది డోసు,  నాకు తప్పలేదు కదా హెయిర్ లాసు,
విరక్తితో,  అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా ,  ఆరవసారి. 

నేనూ జ్వరంతో వెళుతున్నప్పుడూ....
వీధి చివరున్న దవాఖానా యజమాని,  అన్నాడు 'నీకు నేను లేనా' అని,
నన్ను లోపలికి పిలచాడు చెయ్యి ఊపి,  పరీక్షించాడు నా గుండెను ఆపి,
తినిపించేసాడు వాడి దగ్గరున్న గోలీలు,  కొట్టిన్చేసాడు అన్ని రకాల పల్టీలు,
జ్వరానికి వణుకు తోడై, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఏడవసారి.

నేనూ ట్రాఫిక్ లో సిగ్నల్ కోసం వేచి వున్నప్పుడూ....
టెలి కాలర్ చేసింది నా మొబైల్ కి ఫోను,  నాకోద్దోద్దు అంటున్న అప్పనంగా ఇస్తానంది లోను,
మా ఆవిడ కావాలంది ఏ.సి కూలర్ ఫ్యాను,  పెంచేసింది మా ఇంటి ఖర్చులు పోను పోను,
ఇలా అయితే కరెంటు బిల్ పరిస్థితేమి గాను,  అప్పుడు వచ్చేసింది సమ్మర్ పవర్ కట్ ప్లాను,
ఆనందంతో,  అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఎనిమిదోసారి.

నేనూ సినిమాకి వెళ్దామని ....
బయలుదేరి వెళ్ళిపోయాను అమీర్ పేట్,  లైన్లో నుంచొని మరీ పట్టాను కపుల్ సీట్,
హడావుడి లో పోగేట్టేసాను మా ఆవిడ లాకెట్,  మిస్టేక్ కి అయ్యాను బోలెడంత  రిగ్రేట్,
ధియేటర్ ముందు పరిచేసింది బ్లాంకెట్,  చేయ్యమంది నన్ను కొత్తలాకెట్ కి మనీ కలెక్ట్.
నిస్తేజంతో , అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , తోమ్మిదోసారి. 

నేనూ బైక్ మీద వెళుతున్నప్పుడూ....
ఎదురోచ్చాడొక పోలీస్ కానిస్టేబుల్,  చూడగానే బండికి కలిగెను ట్రాబుల్,
చూపించాను పొల్యూషన్తో సహా నిల్,  కానీ నా అదృష్ట దేవత ఎక్కేసింది హిల్,
అందుకే సరిగ్గా లేదన్నాడు బండికి లేబుల్,  నా చేతిలో పెట్టాడు అయిదొందలు బిల్,
చికాకుతో , అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , పదోసారి.



March 22, 2013

రహస్య ఒప్పందం !!


  కవిత రచన : సాత్విక
ప్రకృతిలో అందంగా ఒదిగిపోయావు,
ప్రతి చోటా నీవే ఇమిడి పోయావు,
నాలోనే నీవు కొలువై యున్నావు,
నిన్ను ఇంకొకరిలో వెతికేస్తున్నాను,
నగ్నత్వమా, ప్రతి చోటా నీవే కదుమా !!

అందరూ నీకెరుకేలే,
నువ్వెవరో నీకే తెలియదులే,
నిజానికి  నువ్వు బలమేలే,
నిన్నెవ్వరు భరింపజాలరులే,
నగ్నత్వమా, ఇదే అసలు నిజము సుమా !!

       
నాలోని నువ్వంటే నాకెంతో ఇష్టం,
ఇంకొకరిలో ఐతే మరీ మరీ ఇష్టం,
కొంటె సరదా చేష్టలకి నువ్వే బెస్టు,
తుంటరి ఆగడాలకి నీవే లాస్టు,
నగ్నత్వమా, నా జోలికి నువ్వు రాకుమా!!

పరులు చూడ అయ్యెను నా మనస్సుకి గాయం,
ఇది మటుకు ఖచ్చితముగా ఖాయం,
'చాటు మాటు' నీకు అందించినచో సాయం,
అయిపోతావు నీకు నీవే మటు మాయం,
నగ్నత్వమా, ఈ ఆగడాలు చాలించుమా !!

నిను మొదటిసారి వీక్షించ తహ తహ,
కానీ పలుమార్లు పరికించ అహ అహ,
వరించకు నన్ను నలుగురిలోన,
నిలబెట్టకు తలవంపుల బరిలోన,
నగ్నత్వమా, నవ్వులపాలు  కానీకుమా !!

నీతో నా ఈ సాన్నిహిత్యం, 
గోప్యము అనునిత్యము,
ఉండిపో అందంగా ఎప్పటికీ,
తెలుపనులే  నేనేవ్వరికి,
నగ్నత్వమా, ఇదే మన రహస్య ఒప్పందం !!






March 19, 2013

టిక్కెట్ లేని మ్యూజియం ....


కవిత రచన : సాత్విక 
అంద చందాలు ఆ అమ్మాయి ఇంటిపేరు కాగా,
'నేను ఈ ముద్దుగుమ్మను పొందకుండు'నా అని అతను,

చదువు సంధ్యలు ఆతని వినయ విధేయతలవ్వగా,
'జాప్యమేల జతగాడా జంటగా చేరు నా చెంత' అని ఆ అమ్మాయి,

వారిరువురి ఎదురుచూపులకి  చిన్నబోయె కదా,
తొలకరి వానకై వేచియున్న పచ్చిక బయలు సైతము,

'వివాహము నిశ్చయంబ'న్న శుభ ఘడియల ముంగిట వారిరువురూ,
'చిత్రము చూసోద్దాము రా రాకుమారా' అన్న తన ప్రేయసి కోర్కెను,

కాదనలేని 'బలహీన మనస్సు పైన బలీయమయిన విధి' కోరలు చాచేను,
ముచ్చటగున్న జంట పై కన్ను పడె ఆ రాహు కేతు గణాల,

చిత్రము సమాప్తి అనుకున్నదా జంట కాని పరిసమాప్తమని తెలియదు వారికి,
గూటికి చేరేందుకు అనువయిన మార్గము కానరాలేదు వారిరువురికి,

చేరువలో నడిరేయి సమీపించ, నలుగురూ కనుమరుగవుతుండగా,
నగర శివారు కాబోలు, ఆ జంట ఉరకలేసే వడి వడిగా - ఆ పై వేగముగా,

'మనువాడే-చెలికాడే' చెంతనుండ తనకేమిటన్న చిన్న తెగువ,
తేలియాడెను ఆ క్షణం ఆ బాల కళ్ళలోన తెరచాటు భరోసా,

'దానవలోకం టు యమలోకం వయా భూలోకం' అన్న అక్షరాలు కానరాక,
'చెయ్యెత్తు, బస్సెక్కు' అన్న నినాదాన్ని గ్రహపాటుగా అనుసరించాక,  

ఆ క్షణం ఆ జంట చూడాల్సి వచ్చింది,
మానవత్వం మాటున దాగిన దానవ రూపం,
కలి ఆవహించిన నిర్దాక్షణ్యపు నర రూపం,

బస్సు లోన బేల, తనని విడువమని వేడుకొన్నది,
వేడుక లోన గొర్రె, నన్ను కనికరించమన్నది,
వేడుక పూర్తాయనే గొర్రె  కానరాకపోయేనే, 

ప్రేమించిన ప్రియురాలు కబంధ హస్తాల పాలు, 
నిస్సహాయ ప్రియుడి ఆవేదన నిరాశా నిస్పృహలపాలు,
వెరసి కడకు ఆతని ప్రార్ధనా విన్నపాలు, ఇలా..

నిర్దాక్షణ్యపు  భావమా నువ్వయినా నీరు గారిపో,
సహయనిరాకరణమా నువ్వయినా సమ్మె విరమించుకో,
కదులుతున్న కాలమానమా నువ్వయినా స్తంభించిపో,
నా కంఠములొని  ప్రాణమా నీవయినా నన్ను వదలిపో,

ఏ ఒక్క ప్రార్ధన ఫలించని ఆ క్షణం,
ఆ బాల అయ్యెను కదా అబల,
జరిగిపోయెను కదా ఘోర దారుణం,
రహదారి పైకి విసిరి వేయబడ్డ ఆ ప్రాణ మానం,

విల విల లాడెను ఆ ప్రియుడి మనస్సు,
గుండెలు మండగా, గుండెలవిసేలా రోదించే,    
ప్రశ్నించేను కనిపించిన ప్రతివారినీ ఇలా……
"ఎందుకు అంతరించలేదు ఈ జగతి, 
ఏమి మిగిలి వుంది ఇంకా సాధించాల్సిన ప్రగతి "



యావత్ దేశము గర్జించినా ఏమున్నది ప్రయోజనం,
రోజూ ఈ ఘోరం జరుగుతున్నది ప్రతి నూరు యోజనం,
అయిపొయిందీ భువి,  కలి అవశేషాలు మోసే మ్యూజియం...(నో టిక్కెట్ -- ఫ్రీ ఎంట్రీ )

March 18, 2013

మా పిచ్చ కానే కాదు ...

కవిత రచన : సాత్విక

ఓ రోదసీ యాత్రికుడా,
అంతరిక్షమున ఏమున్నది పరిశోధించడానికి ?
ఆలి అంతరంగమును పరిశీలించ వీలు వెతకవోయి..
అనంత విశ్వాన్ని నింపుకునే వైశాల్యం కనిపించునోయి...

ఓ యోధుడా,
కదనరంగమున కదం తొక్కనేలా ?
బాల కోరిక కాదని, ఆమె ఎదుట నిలువగలవా ..
నిలచిన తెలిసిపోవునులే నీ అసలు దమ్మెంతో ఓ సిపాయి ...

ఓ నావికుడా,
సాగరగర్భమున శోధించి నీవు వెలికి తీసిన నిధులెన్నో ? కానీ
నీ తరమగునా, త్రవ్వి చూచుట ఆమె మది లోతుల్లోన !!
నిక్షిప్థముగున్న నిగూఢమైన అనంత సంపదలెన్నెన్నో ...

ఓ పర్వత అధిరోహకుడా,
పర్వత శిఖరము చేర మార్గమన్వేషించి మధన చెందనేలా ?
ఆమెలోని దూరాలోచనా శిఖరము చేర పధము వెతకవోయి ..
జీవితపు అసలు అంచు ఏమిటో నీకే అవగతమవునోయి ...

ఆమె మోసే కుటుంబ భారం ముందు భూమాత మోసే భూభారం తక్కువేనోయి..
పెను తుఫాను సైతం,  ప్రశాంతముగా యోచించును కదా ఒక్క క్షణం ఆమెని తలచినంతనే..
భగవంతుడే మారు రూపముగా అవతరించి, చేసుకొనెను కదా అమ్మ ఒడినే తన సన్నిధిగా ..
నీకు అతిశయోక్తి అనిపించేనా? ఆమెతో నీ సాన్నిహిత్యం పెంచుకొని మరల చూడ రావోయి ...

ఆమెను ...
నీవేరుగవులే, నేనెరుగనులే, అసలేవ్వరకి తెలియదులే,
ఆమెనెరుగ, కవి పండితులు కలం పట్టి చేస్తున్న కాలయగ్నమిది (కవిత్వం),
ఆమెనెరుగ, తరతరాలుగా సాగిపోతున్న నిరంతర పట్టుపటాంగమిది (దీక్ష),
ఆమెను ప్రకృతి తో పోల్చుట తప్పు(ప్పదు)లేదులే ఓ చిరంజీవి సోదరా ... 

ఇట్లు
వేడి వేడి సమోసాల బండితో,
బండి యజమాని సాత్విక..

(ఏదో మా పిచ్చ కాకపోతే , అమ్మాయికి ప్రకృతికి పోలికేంటి ?   అన్న ప్రవల్లికకి సంక్షిప్త సమాధానంగా ఇలా ...)

March 15, 2013

స్వయం ప్రకాశితం ...


కవిత రచన : సాత్విక 
మీకు తెలియదా దానకర్ణుడి దీనగాధ,
అంతకన్నా తీసిపోదు మా ఒక్కో వ్యధ,
ఆదరణకి నోచుకోకుండా నా ఈ భాద,
అవ్వకూడదు సమాజ దృష్టిలో అనాధ,
అందుకే వినిపిస్తున్న నా మనస్సు కధ,

కక్కుర్తికి కన్నారు,
ప్రకృతికే నీవన్నారు,

'అమ్మా నాన్న' అనే పదాలు విన్నాను,
వారే నన్ను కనుంటారేమోననుకున్నాను,

నేనెవర్ని ప్రశ్నించలేదు ఇరుకునబెట్టి,
హునాకు వారెవరో తెలియదు కాబట్టి,

కొద్దిసేపటి ఒంటరి భావం కావచ్చు కవిత్వానికి ప్రేరణము,
కానీ అదే భావం అయిపొయింది నా జీవితకాల గ్రహణము,

బస్సురైల్వే ప్లాట్ఫారాలే నాలాంటి  సహచరులకి స్థావరం,
ఎంతోమంది తీర్చుకుంటున్నారు మాతో/పై వారి కండకావరం,

దరి చేర్చుకున్నారు ఎంతోమంది మేమున్నామని అక్కున,
కొత్త మమ్మీ డాడీలంటూ అమ్మేశారు విదేశాలకి చటుక్కున,

మనస్సే శీతాకాలమాయేనేస్పందన కరువై బిగిసిపోయేనే,
కన్నులే ఎండాకాలమాయెనేజలపాతాలు లేక ఎండిపోయేనే,

అందరి ఎదటే నిరాదరణకు లోనయిన పాంచాలి వ్యవహారము,
అద్దం పట్టును కదా అనాదిగా వస్తున్న అనాదరణ పారంపర్యము,

పిల్లలచే వెలివేయబడ్డ తల్లి తండ్రుల విషయమేమిటి?
వంటిం(టి)కే పరిమితమయిన అతివల పరిస్థితేంటి?
పార్టీల మోజులోపబ్బుల క్రేజులోసెలబ్రిటీ అన్న రివాజులో,
హై క్లాసు సొసైటీలో నిరాదరణకు లోనయిన మానసాల మాటేమిటి?

కళ్ళు మూసి, మనస్సు తెరిచి సమాజాన్ని లోతుగా పరికించవోయి,
అగుపిస్తారు ఎక్కువగా 'అవసరాలు తీర్చబడ్డ అనాధ'లే కదోయి,

అనాధ అని సంబోధించినప్పుడు అమితంగా బాద పడ్డాను,
నిజానికి తల్లి తండ్రులచే వెలివేయబడ్డవారే కాదు అనాధలంటే,
నిరాదరణకు గురి అయిన ప్రతివారూ ఆనాధలే,
పసివయస్సులోనే వెలివేయబడ్డ ప్రతి జీవులు స్వయం ప్రకాశితాలే..

చీకటిలోని వెలుగే నన్ను నడిపించింది,
మౌనములోని మాటే నన్ను పలకరించింది,
మంచులోని వెచ్చదనమే నాకు సేద తీర్చింది,
నిశ్శబ్దభీతి తోడుగ నిలచి నాకు ధైర్యం చెప్పింది,

ఎవ్వరూ తోడే కాకున్ననాదంటూ ఎదీ లేకున్నా,
వెలుగురేఖల జాడే రాకున్ననిశీధిలో నే పయనిస్తున్నా,
అందుకే అనాధని కాను ' స్వయం ప్రకాశితాన్ని' ఈ భువిలోన...



March 14, 2013

లవ్ అట్ ఫస్ట్ సైట్



కవిత రచన : సాత్విక
మా ఇంట్లో...
మా అమ్మ తాయారు,
పెళ్లి చూపులు నాకొద్దన్నా తయారు...

అమ్మాయి ఇంట్లో......
చాలా హడావుడి చేసేసారు,
పిల్లని తల ఎత్తించి చూపించారు,
తలదించుతూ  ఆమె విసిరిన చూపు,
నింపెను నాలో ఏదో చిన్న హోపు,
నాకు పోయింది నచ్చుతుందా అన్న శంక,
నేనే నచ్చకపోతే చెప్పాలి కదా ఏదో ఒక వంక,

ఆ తొలి చూపులోనే నేనామేను ప్రేమించేసాను,
'పెళ్లి చూపులలో ప్రెమేంట'ని తెగ ఆలోచించాను,
"లవ్ అట్ ఫస్ట్ సైట్" నిజమని నమ్మేసాను,
ఆ మాటకు "కాపీ రైట్" పెళ్లి చూపులవే అనేసాను,


అమ్మాయికి అన్నయ్యని అన్నాడొకడు,
నీ బయో డేటా చెప్పు వినాలన్నాడు...
కట్నమెంతని అన్నది పక్కింటి పిన్నిగారు,
జాతకాలు చూపించండన్నది కాబోయే అత్తగారు..

అందరి వాలకం చూస్తే నాకొచ్చింది డౌటు,
చేయనే చేయదల్చుకోలేదు ఏ మాత్రం లేటు..
ఆ అమ్మాయిని పక్కకు పిలిపించాను,
నా మనసు లోని విషయం బయట పెట్టేసాను,
ఒకరికొకరం నచ్చామని డిక్లేర్ చేసేసాము,
పెళ్లి మంత్రాలు అందరికి వినిపించేసాము...

అసలు 'పెళ్లిచూపల జంట'లే గ్రేట్ అంటానుమేమే ధైర్యవంతుల చిట్టాలో బెస్ట్ అంటాను...
పెద్దోళ్ళ ఎదురుగానే 'సైట్' కోడతాము, 'విత్ యువర్ పర్మిషన్' అంటూ  బాతాఖాని లెడతాము,
'ఓ బామ్మరిది మీ అక్కకి ఫోన్ ఇవ్వు' అంటాము, మా దమ్ము చూడరో అని రొమ్ము విరుస్తాము,
'ఎంగేజ్మెంట్' చేయండని అర్జిలేడతాముఏమి లేదులే అంటూనే షికార్లుకి వెడతాము,

పెళ్ళికి దారి తీసిన ప్రతి పెళ్లిచూపులూ  
'లవ్ అట్ ఫస్ట్ సైట్' అన్న మర్మం,
అయింది నాకు అవగతం,  
మిగిల్చేను ఎంతో ఆనందం!!!

March 13, 2013

వాస్తవ కల్పనా? కల్పిత వాస్తవమా?

కవిత రచన : సాత్విక


వాస్తవం అన్నదిలా...

ఓ కల్పితమా !!
నీ ఉనికికి రూపు లేదు,
నీ తాకిడికి బలం లేదు,
నీ తపనకి శక్తి లేదు,
నీ తలపునకి నాంది లేదు,
పోల్చుకొనుటే సాధ్యం కాదు,
నువ్వు నిజం కానే కాదు,
నేనే నిజం నిజం !! అని.

కల్పితం చెప్పిందిలా ...

ఓ వాస్తవమా !!
ఊహే నా శక్తి,
భ్రమే నా ఉనికి,
వర్ణనే నా ఆకారం,
భావుకతే నా ఆధారం,
నీది ఏక రూపం,
నావి భిన్న కోణాలు, 
అందరూ నీ అంగిట్లో అలసి,
నా ముంగిట్లో సేద తీరతారు …
ఈ నాటి మేధస్సు ఓ నాటి కల్పితమే కదా,
నీవు నాతో మాట్లాడుతున్నది నా సాయంతోనే మిత్రమా ...
నా అవసరం నీక్కూడా అవసరమే ఎంతైనా... హ హ హ !!!

March 12, 2013

నిరీక్షిస్తా ! మీ పై ఒట్టు !!

కవిత రచన : సాత్విక 
ఆత్మ విడువని ఈ దేహాన్ని కాటిలో వదిలేద్దామనుకున్నారు,
పుత్రధర్మము మరచి బ్రతికి ఉండగానే కాటేయదలచారు,
కాలచక్ర దిగ్బంధములో ఈ ఋతువులు మారకుండునా ?
జీవితచక్ర పరిణామంలో నే అసువులు బాయకుండునా ?

స్వీయ ఆత్మ త్యాగం పాపమని వేదాలు వల్లిస్తున్నాయి,
ఇంకెంత కాలమీ అగ్నిపరీక్షా అని నా ఆత్మా ఘోషిస్తున్నది,
కాల ధర్మానికి తలొగ్గి నిల్చున్న సైనికుడిని నేను కాదంటారా?
కాలం చేసిన జాప్యం లోన నేనొక చిత్రయోధినేనంటారా?

నేనూ పయనించాను నవ మాసాలే నా తల్లి గర్భమున,
అందరిలాగే ఉపక్రమించాను జీవనయానం ఈ కాలగర్భమున,
అడగకనే అందించారు ఆప్యాయతని తొలి జీవిత భాగమున,
అడుగకనే అంతమొందిస్తున్నారు ఈ ఆఖరి అంకములొన...

మీ బాల్యదశలో నే కొసరికొసరి గోరుముద్దలు తినిపించాను,
నా ఈ  అవసానదశలో కసిరివిసిరి వేరుముద్దలు విదిలించారు,
నేనెన్నడు కోరలేదు అరిటాకులలో విందు భోజనాలు,
సరిపోవును కదా ఆప్యాయత విడిదిలోన కొద్దిపాటి పలకరింపులు,
నా బాల్యం గడిచింది ఎన్నెన్నో ఆట పాటలతో చక చకా,
ఈ సమయం గడుస్తున్నది విషపు ఆట విడుపులతో హర హరా...

యవ్వన ప్రాయమున నేను  కట్టలేని వస్త్రమున్నదా? ఈ భువినందు,
అస లే వస్త్రమూ నిలువకున్నది ఇప్పుడు దిసి మొలయందు,
వృద్దాప్యమున ఈ నా కరములు అదుపు తప్పి పట్టు సడలెనే,
నవ్విపోదురు గాక నాకేంటన్న మాటే, నా సిగ్గుని జయించెలే...

ఏ ఆసరా లేకుండానే జీవిత కడలిలో ఒంటరిగా పరిగెట్టానంటే,
కట కటా నీవన్నీ తుంటరి ప్రగల్భాలని మీరంటుంటే,
మీ మొహం చఱచి నే నిలువ ప్రయత్నించకుందునా ?
నిలువలేక అహం దెబ్బ తిన్న ఆ క్షణం నే మరువగలనా ?
శిధిలమయినది నా దేహం అని మీకు లేదు కనీసం ఆ యింగితం,
మలినమయినది మీ మనస్సు అని నా మటుకు నాకు అయింది అవగతం...

నా వయస్సుకి నేనే భారంఅదే వయోభారమోయి,
మీ వయస్సుకీ నేను భారమా? ఇదే విపరీత భావమోయి ,
చరమాంకంలోన నన్ను విడిచి వెళ్ళిపోయింది నా జీవిత శోభ,
పరమావధిలొన మీరు నాకు మిగిల్చారు మానసిక క్షోభ,
మీ అవసరాలన్నీ నేను పసిగట్టి పట్టుబట్టి మరీ తీర్చాను,
నేనే అనవసరం అని మీరు  తూట్టుపెట్టి మట్టు పెట్టదలచారు...

సత్యమేవ జయతే అని కావలి కాసిన హరిశ్చంద్రుడు నా జట్టు,
మరణం సమీపించువరకు నేనిచటనే నిరీక్షిస్తాను మీ పై ఒట్టు,
అంపశయ్య మీద భీష్ముడికీ తప్పలేదు కదా ఈ నిరీక్షణ మెట్టు,
ఇది కాదా? ప్రతి జీవితో విధి ఆడే యధావిధి కనికట్టు,
ఎకడొకచొట, ఎపుడోకప్పుడు తప్పదీ ఆత్మాభిమాన తాకట్టు ...

March 11, 2013

ఎందుకిలా ? నాకే ఎందుకిలా ?


కవిత రచన : సాత్విక 
(వదలి వెళ్ళిన ప్రియురాలి జ్ఞాపకాలు తనని తాకిన క్షణాలు,
నిండు పున్నమి గడిచినది ఇలా భిన్న భావాలా మిళితముగా...)

నా చెలి నయనం,
నే చూసిన తొలి జ్వలితం,
 చూపే కల్మష రహితం,
ఎప్పటికీ అది నా మది లోతుల్లో నిక్షిప్తం..

నా చెలి అధరం,
నే చవిచూసిన తొలి మధురం,
చేరుకోవాడానికి బహు దూరం,
స్వర్గ సుఖానికి అది ముఖద్వారం..

నా చెలి స్వరం,
నే ఆస్వాదించిన తొలి మాధుర్యం,
నిలచెను ఆ మధురిమ నా నర నరం,
నర్తించెను లయబద్దముగా నిరంతరం..

వేధించిన ధూళినీ,  స్పర్శించిన గాలినీ  అడిగాను  -- నువ్వెక్కడున్నావని?
గల గల పారుతున్న నీటిని,  జల జల రాలిన పూలనీ అడిగాను -- నువ్వేమయినావని ?
కల్మషం ఎరుగని పిట్టనినిర్మలమయిన మేఘాన్నీ అడిగాను -- నువ్వెలా ఉన్నావని?

వెడలి పోయావు చెలి,
వెల వెల  బోయెను నా లోగిలి,
హు ! చూసావా వెన్నెల జాబిలీ,
లోటు భర్తీకి నువ్వే వచ్చావా కదలి..

నీవు లేని ఈ నిండు పున్నమి వెన్నెల,
మారిపొయెను ప్రచండ అగ్నిజ్వాలలా,
ఒంటరితనం వేదించి దహిస్తున్నది నన్నిలా,
ఎందుకిలా ? నాకే ఎందుకిలా ?