September 29, 2013

ఏమిటో ఈ మాయ ...

గీత రచన : గుంటూరి
నీ కొంటెచూపే ఎదురుగ నిలుచుందిగా  
నన్ను చేరి నిలదీసినట్టుగా
నాకు నేనే కనిపిస్తున్నానే అదో ఇదిగా  
సిగ్గుపడుతున్నట్టుగా
' ఏమిటో ఈ మాయ ' ఇలా తగులుకున్నది 
గుర్తు పట్టలేనట్టుగా
నన్ను నేనే గుర్తు పట్టలేనంతగా

కంటి చూపుదొక ప్రేమ .. 
మూగ మాటదొక ప్రేమ ..
చేతి స్పర్శదొక ప్రేమ ..
ఆశలోని శ్వాసే ప్రేమ ..
నవ్వులోని స్వచ్చతే ప్రేమ ..
ఇంద్రియాల పరవశమే ప్రేమ    

నీ కొంటెచూపే నా కంటికెదురుగా నీవులా నిలుచుందిగా 
' ఏమిటో ఈ మాయ '    ' అసలేమిటో ఈ మాయ '

వానజల్లు లోని చినుకేదో నను పిలచిందిగా 
తనతో నీవు చిందేయగా .
ఆ చినుకు లోనే నేను తడిసి ముద్దయినట్టుగా 
అనిపిస్తోందిగా అలా అలా .
' ఏమిటో ఈ మాయ ' ఇంత తీయగున్నది 
తేనే పూసినట్టుగా .
తేనేతోనే స్నానం చేస్తున్నట్టుగా .

పరవశించే భావమే ప్రేమ .. 
పరిమళించే సువాసనే ప్రేమ ..  
ఊహల సమ్మేళనమే ప్రేమ .. 
ముచ్చటైన ముద్దే ప్రేమ ..
అందమైన ప్రకృతే ప్రేమ .. 
జ్ఞానేంద్రియాల మైమరపే ప్రేమ

వానజల్లు లోని చినుకేదో నిన్ను నన్ను తనతోటి చిందేయమందిగా  
' ఏమిటో ఈ మాయ '    ' అసలేమిటో ఈ మాయ '

September 28, 2013

వేర్ అర్ యు? వేర్ఎవర్ యు అర్?

కవిత రచన : సాత్విక

నిద్రలో నిజమెంత అని నలుగురిని నేను ప్రశ్నిస్తున్నా,
కలలో కనిపించిన నిన్ను నిజమేనని ఇలలో వెతికేస్తున్నా,

అలై పరిణమించాక తీరం చేరుటే లక్ష్యముగా సాగునుగా,
కలై దర్శనమిచ్చాక సాగకుందునా నువ్వే నా ధ్యేయముగా,   

మేఘమైన గుర్తుపట్టదే తన నీటిచుక్కని నడిసంద్రములోన,
నేను మాత్రం నిన్నే చేరుకుంటా ఎక్కడున్నా జనసంద్రములోన,

ఆకలి దప్పులు మరచానే జత కోరుతున్న 'నా ఈ మనస్సే' నీదిగా, 
ఆలోచనే పొలమారుతున్నది తర్కానికి.. 'నీవంటే నేనే' అంటోందిగా,

నిను తలచి.. పాలపుంతలోని 'వేగుచుక్క వెలుగే' విలపించే..  నా చెంత,
అందుకే కొత్తపుంతలు తొక్కుతోంది నా మనస్సు నిన్ను తలచినంత,

'రాత్రీ-పగలు' తేడా లేదే నీకై పరితపిస్తున్న నాలోని ప్రతి ఆలోచనకి,
'జ్ఞాపకమే గతమంటే' 'ఊహలే భవిష్యత్తంటే' 'వాస్తవం నీవే'లే నిజానికీ,

ఎచ్చోట దాగున్నావో ? జతే చేర నీకింక జాగు ఏల ?  అని అడుగుతున్నా ?
ఈ కవ్వింతల దాగుడుమూతలలో ఎప్పటికైనా గెలుపు నాదేనని పయనిస్తున్నా ...  

September 24, 2013

లేటెస్ట్ ఫ్యాషన్...


కవిత రచన : సాత్విక

ప్రకృతి సమకూర్చిన ముగ్ధ మనోహర సింగారం
కావాలి తన మగడిని ఆకట్టుకొనే కొంగుబంగారం  

పరదా దాటిన ఆధునికత అనే క్రొత్త వ్యవహారము
చేసేస్తోంది ప్రతి చూపుకి తన అందాన్ని పందేరము  

ఆ అలంకరణే కోరుతోంది మగడి ఆదరణ ఆద్యంతము
వలదంటోంది మగాడి ప్రాకృతిక స్పందన అనునిత్యము  

కీచకుడే స్వయంభూవై ఆవహించే ప్రతి నరుని నరాన  
భీముడైనా భీష్మించే కలియుగ నర్తనశాలలో వాస్తవాన  

ఆహ్వానించి వధించిన గాధ మన పురాణ కీచక చరిత్ర
కవ్వించి కబళించబడిన వ్యధ ఈ ఆధునిక అతి(వ) చరిత్ర  

'అందానికి బలహీనత'కి  జరుగుతున్న ఆటలోని కుతూహలం
తెలిపెను కోటానుకోట్లలో నిగ్రహం విడువని మగవారి మనోబలం  

'అలంకరణలోని హద్దులు' కావు ఆడవారి స్వాతంత్రానికి అడ్డుగోడలు
అవే 'హద్దులు అవసరం' మగవారి ప్రాకృతిక ప్రేరణకి ప్రతిబంధకాలు  

పోటిపడి అందాలన్నీ ఎరవేసినట్టు ఆరబెట్టే  ఓ'సీ-త్రూ' సంస్కారం   
"ఆడదానికి శత్రువు ఆడదే'నన్న నిజమే చేస్తోంది నీకు నమస్కారం  

వెర్రి తలలతో ఊపిరి పోసుకుంటున్న "ఫ్యాషన్"ని  చేయండి ఖననం
లేక, కోల్పోతుంది ఆధునిక భారతములో భూమాతైనా తన సహనం        

September 22, 2013

పిలుస్తాలే ఆవారా ఇంకోలా !!

గీత రచన : గుంటూరి



' ఆవారా ! ' అని పిలవాలి నువ్వే నన్ను నీ మనసారా
'అరెరే' అని ప్రపంచమే చూడాలి నేనేవర్నని? కనులారా  
వింత కోరికే నాకు కలిగింది ఈ వేళ ఇలా అనుకొన్నారా ?
అయితే మీకు కూడా ప్రేమ కొత్త వింతేనా ? ఔనంటారా ?
కాదులే పొమ్మంటారా ??

పిలిపించుకోవాలంటే ఏదోకటి చేసేయి ముద్దు పుట్టేలా,
'ప్రేమ ముదిరితే పిచ్చే' నన్న నిజం నువ్వే అనిపించేలా,
నువ్వే కోరుతుంటే చిలిపి కోరికే కవ్విస్తోంది నన్నూ ఇలా,
ఆవోనా అంటున్నా అల్లరే చెసేయి నేనే నిన్ను మరచేలా !
నాకు ఒళ్ళు మండేలా !! 

అల్లెయనా కొత్త పాటేదో ఇదే భావన అందముగా,
గిల్లెయనా మనస్సునే తొలకరి చూపుతో చిలిపిగా,
చిందెయ్యనా తికమక పుట్టించే ప్రాయమే సాయంగా,
పిలిచేయ్యవా ఆవారా అదే పిలుపుతొ త్వరత్వరగా !
అదో ఇదిగా, కొత్త కొత్తగా !!

పాటో పల్లవో పాడెసేయి ఒక పని అయిపోతుందిగా,
గిచ్చుడో ఇచ్చుడో సైట్ కొట్టుడో చేసేయి తొందరగా,
చిందులేసే వయసే ఉందిగా మన ఇద్దరికీ వాటముగా,
' బకరా ' అంటూ పిలవాలని అనిపిస్తోంది కొత్త ప్రేమగా!
' ఆవారా 'కి బదులుగా!! 

September 21, 2013

మోక్షము అంటే ? (2)

వ్యాస రచన : హృది


సంపూర్ణత్వము అనే ఒక భావన/స్థితి యొక్క అంతిమ ఘట్టం భావనారహిత్యము (రాగాబంధనకు అతీతమగు స్థితి). మోక్ష మార్గమునకి సూచించిన ఏ మార్గము అయినను పరిపూర్ణత్వము సాదించటానికి సూచించిన ప్రక్రియలు మాత్రమే అని నేను ప్రగాఢముగా నమ్ముతాను. 

అయితే సంపూర్ణత్వము ఏమిటి స్పందనారాహిత్యము కలుగజేయుట ఏమిటి ? అన్న సందేహము మొట్టమొదటగా జనియించు స్పృహ.  (స్పృహ అని ఎందుకు అన్నాను అంటే ? వాస్తవాన మనము మనకు తెలియకుండానే మన మనస్సులో కొన్నిటిని జీర్ణించుకొనియుంటాము అందువల్ల సంపూర్ణత్వము అంటే ఒక 'తారాస్థాయి స్థితి' అని మనం అర్ధం చేసుకొనియుండే అవకాశము మెండు. ఆ భావన మనల్ని తట్టి లేపి ఒక సందేహం రూపంలో మన మదియందు నిలుచొని ఉండి ఉండవచ్చు, అందుకే స్పృహ అని నేను పలక దలచినాను)

సరే అసలు విషయానికి వస్తే సంపూర్ణత్వమునకు  స్పందనారాహిత్యమునకు గల సంబంధం ఏమిటి ? దీనిని అర్ధం చేసుకొనే ముందు " కామిగాని వాడు మోక్షగామి కాలేడు ? " అన్న వాక్యముని పరిశీలిద్దాము ::

ఒక చెట్టుకి ఆకు పూయును. ఆ ఆకు యొక్క జీవిత చక్రము పరిశీలిస్తే, 'అంతము' అనునది రెండు విధములగా కనిపించును. 
1. త్రుంచివేయబడుట
2. రాలిపోవుట

త్రుంచివేయబడుట అను ప్రక్రియ ఆ చెట్టుకి బాధను మిగుల్చును, రాలిపోవుట అను ప్రక్రియలో బాధ  వుండదు. త్రుంచివేయబడుట అనేది ఒక అసంపూర్ణమైన ప్రక్రియ ( ఆకు ప్రాకృతిక జీవనచక్రములొ / natural life cycle), రాలిపోవుట అనేది పరిపూర్ణత్వము వనకూర్చుకున్న ప్రక్రియ అని అర్ధం చేసుకోగలము కదా. అయితే ఆకు అనేది చెట్టునుండి వేరు చేయబడటానికి 'అసంపూర్ణత్వము' 'సంపూర్ణత్వము' అనే ఈ రెండూ దోహద పడతాయి. కాకపోతే సంపూర్ణత్వము వలన సంక్రమించినచో స్పందన (బాధ) అనునది జనియించదు. అయితే ఈ ఉదాహరణ అనేది ఎందుకు ప్రస్తావించాను అంటే చెట్టుని మనస్సుగా పరిగణించగలిగితే ఆకు అన్నది మనయొక్క కోరిక అని ఊహించుకుంటే, మనలోని కోరిక అనేదానికి పరిపూర్ణత్వము ప్రసాదించిన యెడల అది తిరిగి మన మనస్సుని బాధించక తొలగిపోవును అన్న ఒక ప్రాధమిక సూత్రాన్ని గ్రహించాలి. అంటే సంగ్రాహకముగా నాకు అర్ధం అయిన విధానము ఏమిటంటే "నీవు అనబడే మనస్సుకి ఉన్న ఇష్టాలకి సంపూర్ణత్వముని ఆపాదించు, అదే నిన్ను ఆ యొక్క కోరిక నుండి విముక్తి కలిగిస్తుంది" అంటే "కామిగానివాడు మోక్షగామి కాలేడు" అని ఉవాచ.

ఆకు త్రుంపి వేయబడుటని (అసంపూర్ణత్వము) మనం విధి అని అంటుంటాము. నాకేమనిపిస్తుందంటే ఇదొక చిత్రమైన స్థితి దాని మూలార్ధము పోయి పెడ అర్ధము మన మనసులలో తాండవం చేస్తున్నదేమో అనుకొంటూ వుంటాను (మరియొక మారు తప్పక పంచుకుంటాను నా భావనల్ని).

అయితే పై చర్చలో "సంపూర్ణత్వమునకు  స్పందనారాహిత్యమునకు గల సంబంధం" అన్నదానికి "కామిగాని వాడు మోక్షగామి కాలేడు" అనేటువంటి వాటికి విశ్లేషించ ప్రయత్నిస్తూ ఇక్కడ ఇంకొక సందేహం నిద్ర లేపుకున్నాము. అంటే "మనస్సులో నిలచి ఉన్న అన్ని కోరికలకి సంపూర్ణత్వము పొందితేగాని వాటి నుండి విముక్తి లబించదా ?" అని. దీనిని మనము పరిశీలించేముందు త్యజించుట/విసర్జించుట , విముక్తి/విమోచనము అనే వాటి గురించి మాట్లాడుకోవాలి.

విముక్తి/విమోచనం అనునవి సంపూర్ణత్వము వలన సంక్రమించేటువంటి విడుదల. మనకు తేలికగా అర్ధం అవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇలా: నా మనస్సులోని కోరికను సంతృప్తి పరచటానికి నేనే  చేసే ప్రయత్నమే ఒక పరీక్ష అయితే సంపూర్ణత్వము అనగా ఆ కోరిక 100 మార్కులతో అది పాస్ అవ్వడం. (100 మార్కులు అన్నది ఒక్కొక్కరి ప్రామాణికం ఒక్కోలా వుంటాయి, దీనిని వేరోకమారు చర్చించుకోవచ్చు). అదే కోరికని ఆ పరీక్ష రాయవలసిన పని లేకుండా చేయడమే త్యజించుట/విసర్జించుటగా చెప్పుకోవచ్చు. అంటే మన మనస్సులోని కోరికలని రెండు విధములగా మనం పారద్రోలవచ్చు. పరిపూర్ణత్వం వనకూర్చుట లేక కోరికని విసర్జించుట అనే విదానములలో (అణుచుకొనుట అనునది బూస్తాపితము చేయునటువంటి విధానము, దీనివల్ల లాభము/నష్టము సమానముగా యున్నవి in simple terms postponing the exam, may be you can get a chance to get 100marks later or you may get exemption from this exam... who knows..).

మరి కోరికలని ఎందుకు పారద్రోలాలి ? అంటే 'కోరిక' స్పందనల్ని కలిగించునటువంటిది కాని మనము కోరుకుంటున్న స్థితి మోక్షము (స్పందనలకి అతీతమగునటువంటి స్థితి) గావున.

అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయము ఏమిటంటే కోరికని పారద్రోలే (పైన అనుకొన్న ఏ విధములోనైనాను) క్రమములో ఇంకొక దాని కోరిక/తపన మీదకి మనస్సుని మళ్ళించే ప్రక్రియ అధికముగా గోచరిమ్చుచున్నది. ఉదాహరణకి పరిపక్వత పొందిన నాస్తికుడు చూచు కోణం ఏమనిన " భక్తి మార్గము నన్ను వశము చేసుకోనును అందువల్ల నేను ఆ మార్గమున ప్రయాణింజాలను అని " బాగుంది,  కాని అదే సమయములో తన మనస్సుని లగ్నం గావించుటకు ఏ అంశం లేకుండా యుండుట లేక "భక్తి" అనే భావన పై ద్వేషం పెంచుకొనుట జరుగుటకు ఆస్కారం మెండు. అదే విధముగా భక్తి తత్పరులు తము నమ్మిన భక్తి మార్గము/లేక తమ నమ్మకము పై (అమితమైన) "ప్రేమ" అనే ఒక స్పందనకి తావిచ్చు విధానము మనము చూస్తూ ఉంటాము.  అయితే వీటికి అతీతముగా నున్న మహానుభావులు (భక్తులలోను/నాస్తికులలోను) మనకు అక్కడక్కడా కనిపించెదరు.

మరి వేదాలు , ఉపనిషత్తులు , సన్యాసం, ఆసనాలు, యోగా ....ఇంతమంది మహనీయులు చెప్పినవన్నీ హాస్యాస్పదమా ? అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే పైన చెప్పినవన్నీ పలు రకములైన మార్గములు "సంపూర్ణత్వము"ని  మనస్సుకి ఆకళింపు చేసుకొవడానికి అని నేను నమ్ముతాను. మార్గములని ప్రేమించువారి మధ్యనే మనమందరమూ కాలం గడుపుచున్నాము. ఎందుకంటే మనము వింటూ ఉంటాము కదా " ఫలానా దేవుడు మహిమ గల దేముడట " అని. అయితే ఈ వాక్యాన్ని అపహాస్యము చేయజాలను ఎందుకంటే కొంతమంది మానసిక పరిపక్వత పొందుటకు అవలంబించిన విధానములో వారు ఎంచుకున్న మార్గములో వచ్చు ఒక చిన్న అభ్యాసము అది అని నేను అర్ధం చేసుకొన్న విధానము.
మోక్ష సాధనకి "సులువుగా కనిపించే మరియొక  క్లిష్టమైన మార్గము" ఏమిటంటే "మోక్షము అంటే ఏమిటో అర్ధం చేసుకొని మనస్సుకి ఆకళింపు చేసుకోనుటే". మార్గములని ప్రేమించుటకన్నా, మార్గముల విశిష్టతలని ఎంచుకొనే కన్ననూ  గమ్యం చేరుటే ప్రధానము అన్నది గ్రహిమ్చుటే మిన్న.

ఎలాగు ఇంత మాట్లాడుకోన్నాము కాబట్టి ఆఖరుగా మరియొక మాట ఏమిటంటే ఆత్మహత్య అనునది ఆకుని త్రుంపి వేయుట వంటిది "జీవశక్తికి వేదన రగుల్చును" మరణం దానంతట అది సంబవించుట అనునది మరణచక్రములోని సంపూర్ణత్వము. కావున ఐహిక బాధలు త్రుంచి వెయదలచి జీవశక్తికి వేదన మిగుల్చువారు ఎందరో, ఒక్క క్షణం ఆలోచిస్తే వారికి వారి కళ్ళ ముందున్నవి బాధలుగా కాక సాధారణమైన అంశముగా గుర్తించగలుగుతారు. అందుకే భక్తి/నాస్తికత ఏ మార్గమైనను మానసిక స్తైర్యముని పెంపొందించుటకు వినియోగించి గమ్యము యొక్క అంతరార్ధము తెలుసుకొనుట ఉత్తమము. మరల కలిసినప్పుడు త్యజించుట/విసర్జించుట సన్యాసము/నన్/బోధకుడు/ వగైరా వగైరా మార్గముల గురించి నా భావములు పంచు కొనుటకు ప్రయత్నిస్తాను.

మరిన్ని భావములు పంచుకోనవలెను అని ఉన్ననూ (Thanks for bearing me until this point) ఈ వ్యాసము సుదీర్ఘతని దృష్టిలోనుంచుకొని  పైన  పలు సందర్భములలో లోతుగా కాక పై పైన మాత్రమే కొన్ని భావాలు వ్యక్తపరచాను (I know some of my friends are happy about it). వీలు కుదిరినప్పుడు వ్యక్తీకరణ చేయుటకు ప్రయత్నిస్తాను (sorry for this). నా భావమును పంచుకొనుటకు నేను చేసిన ప్రయత్నమే ఇది. నాకు అవగాహన లోపము ఉండి ఉండవచ్చు క్షంతవ్యుడను , విజ్ఞులు మన్నించగలరు (Thanks alot for this).

September 20, 2013

మోక్షము అంటే ?

వ్యాస రచన : హృది

"మనస్సు" అనేది విచిత్రాతి విచిత్రమైన ఒక యదార్ధము. యదార్ధము అని ఎందుకన్నాను ? అంటే,  పదార్ధము అనడానికి దానికి రూపం లేదు అని నా అభిప్రాయము.

అయితే ఈ మనస్సుకి మరియొక్క నామధేయము 'చిత్తం' అని కూడా అనెదరు. కాకపోతే చిత్తం అనిన మరియొక అర్ధము 'అంతరంగమున నిమిడీక్రుతమైన ఆలోచన '. ఈ రెండవ అర్ధము 'మనస్సు యొక్క స్థితిని' తెలియజేయు క్రియాపద తాత్పర్యముగా కూడా మనకు అనిపించును. మనిషిగా రూపు దాల్చినంతనే శరీరము కనిపించు ఆకృతిగాను,  మనస్సు అనేది ఈ శరీరముని నడిపించు అశరీర శక్తీగాను,  చెలామణి అవ్వడం ప్రారంబించును.

మనస్సు యొక్క ప్రధానమైన లక్షణం ఆచరణ( ఆచరణ ఎందుకనగా దానికి కాలమే కారణం ). ఆచరణకై తనకి అందుబాటులోనున్న అన్ని వనరులని  ఉపయోగించుకోనుటే దీని యొక్క మరియొక ముఖ్య లక్షణం. మనస్సుకి  అందుబాటులోనున్న వనరులలో మెదడు అనేది అత్యంత ముఖ్యమైనదిగా అనుకోవచ్చు. మెదడులో నిక్షిప్తమైన విషయాలలోని ఒక అంశముని ఎన్నుకొని మనస్సు చేపట్టిన ఆచరణ యొక్క విశేషణమే మనము 'బుద్ధి 'గా గుర్తించెదము. సేకరించిన ఎన్నో విషయాలని నిక్షిప్తము చేసుకొనే స్థానమునే మెదడుగా గుర్తించిన మరో అంశము. మనస్సు కేంద్రీకరించిన ప్రస్తుత అంశము/విషయమునే మనము ఆలోచనగా పిలుస్తాము. ఇవి అన్నియూ  ఒక చక్ర ఆధారభూతమైనటువంటి   విషయాలు (cyclic dependant). 'మనస్సు'  'ఆలోచన'  'బుద్ధి'   'స్థిర చిత్తం' ఇలా కొన్ని ముఖ్యమైన విభాగాములతో ఒక చక్ర సంబంధిత (cyclic) ప్రమాణాల పై పట్టు సాదించుట కొరకే ఏర్పడిన విధానాలు పలు రకములు వాటినే మనము (అ)ధర్మముగా / (అ)నైతికము / ఆచారము / కట్టుబాట్లు వగైరా వగైరా ....

అయితే ఈ మోక్షమునకి మనస్సుకి సంబంధము ఏమిటి ? అంటే "మోక్షము" అనిన  నా మాటలలో ::
మోక్షము అనబడేది ఒక 'స్థితి'గా నేను గుర్తిస్తాను (బహుశా ఆ స్థితిలో ఈ మనస్సు అనే శక్తీ నిర్వీర్యమగును (saturation) అని నా ఊహ / కల్పితము).

అయితే ఈ స్థితిని ప్రతి యొక్క కోణములో వర్ణించుట/వివరించుట చాలా కష్టమని నా అభిప్రాయము. లోతుగా పరిశీలించుట అనునది అంత మంచిది కాదు (should not start analyzing just like that , because it may lead to end in crazy feel). కాకపోతే ఈ 'మోక్షము' వివరించుట ఐహికమైన వాక్యములలో బహు తేలిక అని కూడా అనుకొంటూ ఉంటాను. ఒక్క పదములో వివరించాలంటే మోక్ష స్థితి అనిన 'స్వాంతన' స్థితి (  రాగాతీతముగనున్న\నిశ్చల స్థితియే మోక్షము).

మనస్సుకి ఏమిటి సంబంధము ? అంటే, ఈ నిశ్చల స్థితి సంక్రమించవలసినది నీవు అని గుర్తించబడుతున్న 'నీ' అనుకుంటున్న ఆ 'మనస్సు'కే .  మరి బుద్ధి, మెదడు ....ఇవన్నీ ఏమిటి? అంటే ఇవి అన్నియూ  మనస్సుకి అందుబాటులోనున్న సాధనాలు. 

మరి దేవుడు/పుణ్యము/పాపము/ఇతిహాసములు/ వగైరా వగైరా ... ఏమిటి ?

ఇంతవరకు మనము అనుకున్న ఆ 'స్వాంతన' అనే స్థితి యొక్క మూలాధారము రాగాబద్దత/రాగాతీతము. "స్వాంతన అనేటువంటి స్థితి" చేరుకొనుటకు మనస్సు పయనించిన మార్గమునకి అతీతముగా నుండును. 'ఎందుకు?' అనే ప్రశ్న తల ఎత్తిన యెడల " రాగ బద్ధము కాని స్థితి" అదియే కదా అందును.

కాకపోతే మరి ధర్మ బోధనలు, పుణ్యం ,పాపం, మంచి,చెడు, ధర్మమూ, అధర్మము వగైరా వగైరా అన్నియునూ ఈ 'మనస్సనే' ప(య)దార్ధమునకు వికట భావములు కలిగి ఇతర మనస్సులకి ఆటంకం కలిగించకుండుటకై అసంకల్పితముగా 'స్వీయచింతన/ స్వీయనియంత్రణ'  జరుగుటకు ఏర్పరచిన 'విధానములు/సాధనములు' అనునది నా యొక్క భావము. 

ఆధ్యాత్మికత, ధ్యానం, భజన , ఆరాధన ఇలాంటి ప్రక్రియలు 'స్థిర చిత్తం' అనేటువంటి స్థితిని చేరుటకు ఉపయోగించు సాధనములు. 'స్థిర చిత్తం' తదుపరి ఘట్టమే 'స్వాంతం' అని నా అభిప్రాయము (may discuss later).

రాగాతీతము/స్వాంతం అంటే ఏమిటి ?
సత్త్వరజస్తమో గుణాలనే వికారాల నుంచి విముక్తి చెందిన (మనస్సు) అని నేను అర్ధం చేసుకొన్న విధానము. ఐతే రాగబద్దము/రాగాతీతము అనే స్థితికి నైరాస్యము లేక నిర్వేదము లేక అచేతనము అనేటువంటి వాటితో ఎటువంటి సంబంధము లేదు వాటి ప్రస్తావన వేరొక మారు చేయ ప్రయత్నించెదను.

రాగాతీతము కలిగినటువంటి కొన్ని ఉదాహరణలు నాకు అనిపించినవి ప్రకృతి, దేవునిగా మనం కొలుచుకునే శక్తీ , కాల ప్రవాహం (మరణము అను ఒక క్రియ , పుట్టుక అనే ప్రక్రియ) ....ఇలా అందుకే మనము అనే ఈ మనస్సు కూడా ఆ స్థాయిని చేరుకోనుటే మోక్షమని నా అభిప్రాయము.... నాకు అనిపించునది ఏమనగా మోక్షం సాదించలేము అది కేవలం సిద్దించవలెను ... 

"చేయువాడు ఎవరు? చేయించు వాడు ఎవరు ? నీవు కేవలం నిమిత్తమాత్రుడివి" -- ఈ వాక్యముని అర్ధం చేసుకొని ఆ భావాన్ని మమైకం చేసుకోన్నంతనే మోక్షము సంప్రాప్తించును అని నా strong feel.

అందుకే నాకనిపించును దైవ/నాస్తిక వాదన ప్రతివాదనలు సమస్తమూ రాగయుక్తమని. దైవ సంబంధమైన భావన కొంతవరకు మేలు ఎందుకంటే ఇతరులకి కీడు తలపెట్టే ఆలోచనని స్వీయనియంత్రణ గావించును. నాస్తికత లో పరిపక్వత లోపించినచో ఇతరేతర మనస్సులకి నష్టం వాటిల్లే ప్రమాదము ఎక్కువే. 


మరిన్ని భావములు పంచుకోనవలెను అని ఉన్ననూ (Thanks for bearing me until this point) ఈ వ్యాసము సుదీర్ఘతని దృష్టిలోనుంచుకొని  పైన  పలు సందర్భములలో లోతుగా కాక పై పైన మాత్రమే కొన్ని భావాలు వ్యక్తపరచాను (I know some of my friends are happy about it). వీలు కుదిరినప్పుడు వ్యక్తీకరణ చేయుటకు ప్రయత్నిస్తాను (sorry for this). నా భావమును పంచుకొనుటకు నేను చేసిన ప్రయత్నమే ఇది. నాకు అవగాహన లోపము ఉండి ఉండవచ్చు క్షంతవ్యుడను , విజ్ఞులు మన్నించగలరు (Thanks alot for this).

September 18, 2013

ఓ నిప్పురవ్వ ...

కవిత రచన : సాత్విక


భావమే జీవంగా భాష్యమే వర్ణముగా కుంచెకు చేకూరే అధ్వేషణ,
చిత్రపఠముగా నిలచినంతట మనస్సుకైనా తప్పని అనుసారణ,
ఉద్వేగభరితమైన ఆ మనస్సుకి కలిగెను భావోద్వేగానికి ప్రేరణ,
పెల్లుబిక్కిన భావ సంగ్రామము ప్రారంబించే సంధికై అన్వేషణ  

తన మనసులో నిమిడీకృతమైన భావాల సంఘర్షణ,
భావానికీ భావానికీ నడుమ జరిగిన ప్రతి "సంభాషణ",
సంతసించే పదాలుగా నిలపి తను చేకూర్చిన సంరక్షణ,
'మనిషి'లో ప్రతి భావనకి నిలచె తన మనస్సే ఓ ఆకర్షణ  

భావవ్యక్తీకరణకై ప్రతి "పదం" తన పిలుపుకై చేసేను నిరీక్షణ
పదము పదము అనిపించెను వర్ణమాల అక్షరాల అనుసరణ
సేదతీరే ఆ పదమునే మురిపించే పద పొందికలోని అలంకరణ
'బంధన భాగ్యమే దొరకని ప్రతి పదం' కోరుకొనెను తన ఆదరణ

నేను సైతం ...

కవిత రచన : సాత్విక

వరి పంటకు చీడ పట్టినా నే
చిలుము వదిలించే చెరకుకి
ఇది ఏమి? రామచంద్రాయని
చింత ఎలా మీకు అందరికీ ?

'కలిసుండి మనము సాధించుకున్న పురోగతి'
ఊచల చాటున లెక్కతేలకున్నది అదేసంగతి,
'కలసి వుంటే కలదు సుఖం' కానే కాదు సత్యం
'కలహించుకున్న ఆ మరుక్షణం' అనుక్షణం ...

'విడిపోయి కలిసుందాము' అనే వక్ర భాష్యం,
వినువీధులలో చేసేస్తున్నది మనోభావ లాస్యం
విడిపోయి తెచ్చుకున్న ఒకనాటి స్వాతంత్ర్యం,
వినియోగించే వీధిలోనే చెయ్యడానికి కాపురం ... 

"సమైక్యము"లో నాకగుపించే స్వార్ధంమనే "ఐక్యం"
"విభజన"లో సుస్పష్టము వియ్యాలవారి "భజన"
" నేను సైతం " అంటూ అనుకరిస్తాను ఏదోక వర్గాన్ని,
ఉద్యమిస్తాను "అనర్ధం"లో ఉన్న "అర్ధం" వెతకడానికి ... 

September 17, 2013

'కృతి'వా … 'ప్రకృతి'వా

కవిత రచన : సాత్విక

'కృతి'వా  'ప్రకృతి'వా .... అసంకల్పిత 'ఆకృతి'వా... 
మాటలే కొరవడిన వయ్యారాల మౌన కావ్యరూపానివా,
అన్నీ నీవే అనిపించే కళ(ల)ల సామ్రాజ్య ప్రతినిధివా
విశ్వమునే ఆవహించిన జీవంలో(లే)ని మాయాజాలానివా,
స్పందించని ప్రతి'స్పందన'లో(లే)ని భావుకతకి భాష్యానివా,
'కదలని లోకమునే పాలించిచూ' కదిలే కాలానికి సాక్ష్యానివా,

ఈ జన్మకు అందిన అనురాగపు సంతకాల సారధివా,
మరు జన్మకై నిలచి ఉన్న మధుర జ్ఞాపకాల వారధివా,
గత జన్మలోని అనుభూతుల శిధిల సమీర వరూధినివా,
జన్మ జన్మలకి ఋజువుగా మిగిలున్న 'సంధి' కాలానివా,
'మోక్షమార్గముని చేకూర్చే స్వాంతన'కే మారు రూపానివా.. 
                                               అసంకల్పిత 'ఆకృతి'వా...

September 16, 2013

నా శ్వాస... నా ఆశ...

కవిత రచన : సాత్విక

ఊపిరి ఊహల ఊసులే.. విన్నా 
ఊహల ఊసుల వూపిరి నీవెనా

ఆశల  ఆ కలే  అలలై పొంగెనా ?
వేలుపే నిను పంపెనా?  దీవెనగా..

నాకే  ఏమిటో ? అసలేమిటో ?  ఎందుకో ? ఈ వరాల వెల్లువా 
ఉప్పెనో !  ఊహాతీతమో !  కళ్ళెదురుగా నిలచనే నీవుగా !!

నా శ్వాసలో చెలరేగిన ఈ ఆశల సవ్వడే నీలా రూపు దాల్చెనో ?
నా ఆశలో పెనవేసిన ఆ శ్వాసల నిట్టూర్పులా.. ప్రతి రూపానివో !!

ఏమనుకోను ?  ఏమి మానుకోను ?  నా ఆశనా  లేక  నా శ్వాసనా  
ఆశించి శ్వాసించనా ? శ్వాసించి ఆశించనా ? 
నా ఆశ ... నా శ్వాసా ... రెండూ  నీవే ప్రియతమా 

September 13, 2013

ష్..ష్... బ్రేక్ ది సైలెన్స్

కవిత రచన : సాత్విక

ఎడబాటే అలవాటైనా
ఎదసవ్వడి భారమైనా

అందుబాటులో నీవున్నా
నేనే పలకరించలేకున్నా

పలకరింపే ప్రశ్నిస్తున్నా
పలుకే తట పటాయిస్తున్నా

నువ్వే నాకు ఎదురుగా లేకున్నా
నా ఎదురుచూపులు నీకోసమేనన్నా

మౌనంలో ఈకోణమే ఎంతో కొత్తగున్నా
నీ శబ్దం లేక నిశ్శబ్దం నాపై దాడిచేస్తున్నా

నా మది మౌనరాగం నీకు వినిపించకున్నా
నాపలుకే పెదవి పై నర్తించ తయారుగున్నా

నాదైన నీ మది నర్తనశాలలో నే నిలుచొని ఉన్నా
నీ అనురాగపు మువ్వల సవ్వడికై నే నిరీక్షిస్తున్నా...

September 12, 2013

బ్లా.బ్లా..బ్లా...

కవిత రచన : సాత్విక


మంచులో దాగున్నది  నీరేనన్న నిజాన్ని,
కరిగించిన అదే "క్షణం" నమ్మించేను మనల్ని,
'కాలం' మాటునున్నది 'విలువ' అన్న సత్యాన్ని, 
చూస్తున్నా...  'కాలమే కరిగినా తెలుసుకోని జనాల్ని'
మంచు కరిగితే నీరు -- కాలం కరిగితే చేజారు 

తెర చాటునున్నది సిగ్గని మనసే తెలిపెను,
తెర తీసి పలకరించ సిగ్గే మాయమయ్యెను,
ఈ ఆటలో గెలుపెప్పటికీ నాదేనని 'సిగ్గ'నెను,
నగ్నసత్యమిదేనని నేనే 'సిగ్గు'ల మొగ్గైనాను
తెలవక మాయం--తెలుసుకున్నంతట ఖాయం

మౌనమే మిన్నకున్నా అడిగాను నేను.. ఎందుకని?
మరచాను ఆ మాటే మౌనాన్ని మింగేస్తుందని,
సంబరపడ్డా... 'నా ద్వేషమే జయించే నా శత్రువులందరినీ',
మరచా నాలోనే కొలువైయున్నదని... విడువదు నన్నైనా అని.
మాటకు మౌనమే బలి -- ద్వేషముతొ తప్పదు ఘోరకలి

September 10, 2013

ప్రశ్నలోని సమాధానం ....

కవిత రచన : సాత్విక


చప్పట్లకు కొరతేముంది
జీవితమే నాటకమైనప్పుడు !
నా ప్రాణమే నిలువలేనంది
నేను నీవాడని కాలేకున్నప్పుడు !!

మాటే సరిపోకున్నది
మౌనముతో తూచినప్పుడు !
రణమే (వ్రణమే) మానకున్నది
మనస్సే గాయపడినప్పుడు !!

నిజాలకి కొదవేముంది 
అబద్ధమే నిజమైనప్పుడు !
ప్రశ్నలతో పనేలేకుంది, 
నువ్వే ( బ్రతుకే ) ప్రశ్నార్ధకమైనప్పుడు !!

వేణువుతో పని ఏముంది
మనసే మూగబోయినపుడు !
మాటకి మౌనానికి తేడా ఏముంది
ఇరువురి మనస్సులు విడివడినప్పుడు !!

చినుకు సవ్వడికి విలువేముంది
బ్రతుకే ఎడారిపాలు అయినప్పుడు !
అణాకి అర్ధణాకి పొంతన లేకున్నది
ఒకరితోఓకరు జీవితాన్ని పంచుకోనప్పుడు !!

రణం = వ్రణం = రాచపుండు

September 7, 2013

వై దిస్ కొలవెరి ?

కవిత రచన : సాత్విక

నా ఆయువే లేకుండా ఉన్నట్టుందే తనేదూరమైతే
ప్రాణవాయువుతో పనే లేదంటోంది తనేప్రక్కనుంటే

దూరానున్న ఆ నీరే మేఘముతో  ఘర్షించకుంటే
'వాన చినుకై'  ఆ దివినుండి ఈ భువికే చేరకుంటే
తిరిగి ఆ జలమే  వేడితో రమించి ఆవిరే కాకుంటే

                    ఘర్షణా,గమనం,సంగమం 
             కలబోసిన జీవనచక్రం ఇదేనంటుంటే
తనే దూరమై ఈ ఎడబాటు నన్నే ఆణువణువూ దహించేస్తున్నా
ఘర్షణలోనిదే ఈ భాగమనుకొని ఆనందముగా అనుభవిస్తున్నా

'అమ్మతనం రుచే చూపించింది' తన తలంపుతో నేను కన్న ప్రతి కలా
అదే కలలో అద్భుతమే కనిపించే తనతో నా ఈ జీవితానికి ప్రతీకలా ... 




ఘర్షణ = జీవన పోరాటం, వొడి దొడుకులు, ఆలోచనా-ఆచరణ, అంతరాత్మ...
గమనం = ఉచ్వాస నిచ్వాసం, కాల ప్రవాహములో జీవన గమనం ... 
సంగమం = కంటి చూపు చిత్రముతో, బుద్ధి వాస్తవముతో, ఆలోచన పరిస్థితులతో ...  

September 5, 2013

కవిత్వం కాటేస్తే ?

రచన : సాత్విక

(మొదటి భాగం)



(వాడుక భాష)
ప్రొద్దున్న లేట్ గా లేచినాను ఫ్రెష్-అప్ అయ్యాను…
కుళాయి లో నీళ్ళు కూడా రావడం లేదు స్నానం చెయ్యాలా ?
ఆఫీసుకొస్తుంటే వానలో తడవాల్సి వచ్చింది...
సిటి బస్సులో ఎక్కినా ప్రశాంతత లేదు 'చిల్లర','టికెట్' పాస్ చేయలేక చచ్చా...
 మేనేజర్ గాడికి పనిలేదురా బాబోయి... చంపేస్తున్నాడురో ....

(కామెడీ కాటేయబడిన వాడుక భాష)
స్వప్నలోకానున్న నన్ను ఉషోదయకిరణాలు ఆహ్వానించే భువిలోకి,
ప్రకృతే పలకరించే గుమ్మంలో - కాదనలేక అలరించా నాకున్నంతలో
అలలే దరి చేరని సాగర తీరం నిజమనిపిస్తున్నా,
కలలే మిగిల్చిన తన జ్ఞాపకాలు చెరపలేకున్నా
ప్రకృతే పలకరించింది నన్ను ముద్దు ముద్దుగా ,
మైమరచిపోయ ఆ ప్రేమలో తడిసి ముద్ద ముద్దగా
పరిస్థితే ప్రక్కన నిలచే చిల్లర చిల్లరగా 
ఆనక, చెల్లు చీటీ చేతికొచ్చే మెల్ల మెల్లంగా…
అనిపిస్తోంది నాకు,  "కాసేపు ఆగదా ఇప్పటికైనా ఈ కాలం" 
కనిపిస్తోంది కూడా   "విధి నా పై వేసిన తన జాలము (గ్యాలం)"… 

September 3, 2013

లవ్ ప్రోపోజల్ ...

కవిత రచన : సాత్విక

వాస్తవమే కలగానున్నా
కల్పితమే నిజమౌతున్నా
తొలచిన  మనసులలో 
తలవని క్షణమన్నది గెలవని నిజముగ
విరబూసె విశ్వమున జీవనాధారముగా
అవతరించే ఈ జగతిన గగన కుసుమముగ నీ పేరే....
ప్రేమా ! ప్రేమా !!

ప్రేమన్నది నిజమన్నా
మతలబ్బె కాకున్నా
నమ్మాలని లేకున్నా 
నిను చూసాకే నేనౌనన్నా .

మనసులో దాగున్నా
నమ్మించ లేకున్నా 
నటించ రాకున్నా 
నిజమేంటంటే  నన్ను నేనే కాదనుకున్నా ....
అందుకే నోరు తెరిచి అడిగేస్తున్నా ... " కలిసి శ్వాసిద్దామా "?



September 2, 2013

ఎందుకో ఏమో? అందుకేనేమో!!

కవిత రచన : సాత్విక

'నిన్న' అనేదే చేయూత ,
'నేడు' అన్నది  తుళ్ళింత , 
'రేపు' అవ్వాలి కవ్వింత ,
సరైన ఆలోచనతొ ముడిపడినదే ఇదంతా,
'మనకంటి చూపైనా చేరగలిగే దూరం' కూసింత,
అయిననేమి దాని హద్దే అవతరించే 'ఆకాశమంత'  

'రాపిడి' నడవడిలోనే స్వచ్ఛమైన  'అగ్గి' దాగున్నది,
'రాపిడే రాజీబడితే'  అగ్గైనా బట్టబయలు కాకున్నది,
కష్టాల కొలిమిలోనే "ఆలోచన" సెగ రగులుతుంది ,
అందిపుచ్చుకుంటే అవరొధముల గని కరుగుతుంది 

'ఎత్తుకు  పై ఎత్తు',  కానే కాదు ఎవడో కట్టే తాయత్తు,
ఈ తత్త్వం తలకెక్క మనకవసరం "ఆలోచనా" కసరత్తు,
"ఆలోచనాతీరు" మార్చుకుంటే ఏదైనా అవుతుంది నీ సోత్తు,
అదే అర్ధమైతే ఈ జీవితమే నీ అడుగులకు మడుగులొత్తు 

ఓడిన ఆ ఒక్క క్షణం నీది కానేకాదని తెలుసుకో,
ఓటమే ఒప్పుకోక వేగిరముగా ముందుకు సాగిపో,
నువ్వే 'గెలిచే' క్షణాలు ముందున్నాయని మరువకు,
జాప్యం చేయక కాలంతో జతకూడి ఆలోచన మార్చుకో

'భూమి-ఆకాశం' కలిసే చోటే లక్ష్యంగా నిర్దేశించినా, నీకేల చింత, 
అనుకో, ఆ దూరమే నీవు పయనించ దొరికినట్టి అవకాశమంత,
ఆలోచనాసరళే మారితే,
నీ 'కన్నీళ్ళే' నీకే దాసోహమంటూ స్థితినే మార్చుకుంటాయి,
'ఆనందభాష్పాలు'గా గతి తప్పక అదే కంటినుండి ప్రవహిస్తాయి

September 1, 2013

సంధిస్తున్నా! నీవు సమాధిలొనున్నా?

కవిత రచన : సాత్విక


'ఆటుపోటులే ఉనికిగనున్న అల'    ఎదురీతకై యోచించునా?
'నీ తలంపులోని  మైమరపే '   నా మదిని విడువకున్నా ,
'నీతో నే గడిపిన క్షణాలే'     కదలనీక కాలానికి కాపుకాస్తున్నా,
'కలగానైనా రెప్పపాటు కాలమైనా'     కునుకే తీయలేకున్నా,
'కలైనా కాకూడని కాలం'     పీడకలై వీడిపోదాయని యోచిస్తున్నా  

'వెలుగే తన నీడకై వెదకిన'     దరిచేర్చుకోని ఆ నీడదే గెలుపౌనా?
'వేదన రగిల్చిన జ్వాలలోని వెలుగే నేనైతే'       నా నీడగా నువ్వే మారెనా,
'వెలుగు-నీడల వెలయాట్టు'లో         ఎడబాటే రాసుకోని ఒప్పందమా,
'నా అశ్రువులొని ప్రతి బిందువు'లో    ప్రతిబింబిస్తున్నావని తెల్సుకున్నా,
'ఆ ప్రతిబింబమే వెలుగుకు నీడగా చూపి'    అనుక్షణం నిన్నే గెలిపిస్తున్నా   

'సమాధానం లేని ప్రశ్నకి జవాబే'      ప్రశ్నే లేని సమాధానమా ?
'నన్ను విడచి నీవెందుకు వెడలిపోయావని'        ఆవేదనతో నేనడిగితే ,
 ప్రశ్నతో 'నిన్ను-నన్ను'       వేరు చేయద్దని మౌనంగా నీవంటుంటే,
'ప్రశ్నించలేని నా  పరీస్థితికి'      ఏడ్వలేక వెక్కి వెక్కి నవ్వేస్తున్నా ,
'సమాధానం లేని ప్రశ్నవి నీవైతే'      ప్రశ్నించలేని నేనే  సమాధానమౌతున్నా