March 25, 2013

ష్.. ష్.. ఎవ్వరికీ చెప్పను/ద్దు

కవిత రచన : సాత్విక
కాలము రహస్యముతో --

నీ ఇంటి పేరే అపహాస్యమా !
అయ్యో !  పాపం ఓ రహస్యమా !
ఆకారం అన్నది అసలు లేనేలేదులే,
ఆయుర్దాయం అంతంత మాత్రమేలే,
నువ్వు బంధువే కదా అందరికి,
అయినా చులకనే ప్రతి ఒక్కరికీ ...

ఎవ్వరికీ చెప్పద్దంటూనే ఎవరెవరికో చెప్పేస్తారు,
ఎవరికివారే తమకు మాత్రమే తెలుసనుకుంటారు,
'ఎవ్వరికీ చెప్పొద్దూ' అన్న మాటే 'నీ' ప్రసార సాధనమయ్యేనే,
ఇదే అసలు సిసలు ఆధునిక రహస్య ప్రచార మంత్రములే,
నువ్వందరికీ ఎరుకేనన్న అసలు రహస్యము వారెరుగరులే,
డంగవుతారు, వారి విషయమే చేరినచో వారిని రహస్యముగా,
ఓ నా రహస్యమా!  సమజవ్వవు ఎప్పటికీ  'నీ' భాదలు సంపూర్ణముగా

అదే కాలము మనిషితో --

రహస్యమున్నదే అవ్వడానికి లీకు,
అది చేస్తుంది అందరి నిగ్రహాన్ని వీకు,
నువ్వు దాచి పెట్ట ప్రయత్నించమాకు,
దాని జోలికి నువ్వస్సలు పోమాకు ...

రహస్యానికి కుదురు తక్కువోయి,
దాన్ని జయించునది కుతూహలమేనోయి,
మూగవానిని మంచిగా మాట్లాడించగలదు,
చెవిటివానికి చక్కగా వినిపించగలదు,
గ్రుడ్డివానికి సైతము దర్సనమిచ్చును,
మాములోడిని మాత్రము మభ్యపెట్టును ...

ఒరేయి బావా , ఎవ్వరికీ చెప్పొద్దురో,
ఎవండోయి పిన్నిగారు, ఎవ్వరికీ చెప్పొద్దూ,
నీకు మాత్రమే చెప్తున్నా, నీవెవరికీ చెప్పొద్దూ, 
ఎవ్వరికీ చెప్పనని ఒట్టు పెట్టి మరీ అడిగేవాళ్ళు కొందరు,
ఒట్టు పెడితే చాలు చెబుతానని వెంటపడేవాళ్ళు మరికొందరు,
రహస్యం రగిల్చిన 'కుతూహల'  క్రీడలోని సభ్యులే పై వారందరూ,
రహస్యానికి నిదానము లేదులే, విష(య)దానము తప్పక చేయించునులే ... 

కొందరి రహస్యం మరికొందరు చెప్పును తమ జోస్యముగా, 
అదే జోస్యము ఇంకొందరికి తోచును యమ హాస్యముగా,
మది లోతుల్లో వారిని గూర్చి వారే వినలేని నిజాలెన్నెన్నో,
అంతరాలలో మనస్ఠాపితమయిన ఎనలేని రహస్యాలెన్నెన్నో,
ఎవ్వరికీ తెలియకూడదని నీవు భావించిన, అది రహస్యముగా నిలవదోయి,
నీ మది లోతుల్లో ఖననమయిన నిజాలు మాత్రమే రహస్యముగా నిలుచునోయి,
నీ పెదవి దాటిన పిమ్మట అది విష(య)మే గాని రహస్యమెంతమాత్రము కాదోయి,
అందరికీ విషయము తప్పక చేరును కానీ అది చేరు మార్గము నీకు రహస్యమేనొయి ...

నేను మీతో -- 
బై ద వే మీ దగ్గరేమయిన రహస్యం వుంటే చెబుదురు , ఎవ్వరితో చెప్పను .... ఓ.కే  నా....  

March 24, 2013

భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా !!


కవిత రచన : సాత్విక
(.. రెండవ భాగము ..)

నేనూ బాల్కనీలో నుంచొని ఉన్నప్పుడూ....
ఎదురింటి మేడ మీదకి వచ్చిందో మిస్సు,  ఆమె చేసింది అమెరికాలో  యెమ్.ఎస్సు,
చెయ్యి ఊపాను  గుర్తొచ్చి నా హ్యాపీ డేసు,  ఆ బుల్లి నా మీద ఆడింది కస్సు బుస్సు,   
ఇంట్లో అందరిచేత ఇప్పించేసింది డోసు,  నాకు తప్పలేదు కదా హెయిర్ లాసు,
విరక్తితో,  అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా ,  ఆరవసారి. 

నేనూ జ్వరంతో వెళుతున్నప్పుడూ....
వీధి చివరున్న దవాఖానా యజమాని,  అన్నాడు 'నీకు నేను లేనా' అని,
నన్ను లోపలికి పిలచాడు చెయ్యి ఊపి,  పరీక్షించాడు నా గుండెను ఆపి,
తినిపించేసాడు వాడి దగ్గరున్న గోలీలు,  కొట్టిన్చేసాడు అన్ని రకాల పల్టీలు,
జ్వరానికి వణుకు తోడై, అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఏడవసారి.

నేనూ ట్రాఫిక్ లో సిగ్నల్ కోసం వేచి వున్నప్పుడూ....
టెలి కాలర్ చేసింది నా మొబైల్ కి ఫోను,  నాకోద్దోద్దు అంటున్న అప్పనంగా ఇస్తానంది లోను,
మా ఆవిడ కావాలంది ఏ.సి కూలర్ ఫ్యాను,  పెంచేసింది మా ఇంటి ఖర్చులు పోను పోను,
ఇలా అయితే కరెంటు బిల్ పరిస్థితేమి గాను,  అప్పుడు వచ్చేసింది సమ్మర్ పవర్ కట్ ప్లాను,
ఆనందంతో,  అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , ఎనిమిదోసారి.

నేనూ సినిమాకి వెళ్దామని ....
బయలుదేరి వెళ్ళిపోయాను అమీర్ పేట్,  లైన్లో నుంచొని మరీ పట్టాను కపుల్ సీట్,
హడావుడి లో పోగేట్టేసాను మా ఆవిడ లాకెట్,  మిస్టేక్ కి అయ్యాను బోలెడంత  రిగ్రేట్,
ధియేటర్ ముందు పరిచేసింది బ్లాంకెట్,  చేయ్యమంది నన్ను కొత్తలాకెట్ కి మనీ కలెక్ట్.
నిస్తేజంతో , అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , తోమ్మిదోసారి. 

నేనూ బైక్ మీద వెళుతున్నప్పుడూ....
ఎదురోచ్చాడొక పోలీస్ కానిస్టేబుల్,  చూడగానే బండికి కలిగెను ట్రాబుల్,
చూపించాను పొల్యూషన్తో సహా నిల్,  కానీ నా అదృష్ట దేవత ఎక్కేసింది హిల్,
అందుకే సరిగ్గా లేదన్నాడు బండికి లేబుల్,  నా చేతిలో పెట్టాడు అయిదొందలు బిల్,
చికాకుతో , అప్పుడు నేనూ ! భం-చిక్ భం-చిక్ -- బ్లాగాడించా , పదోసారి.



March 22, 2013

రహస్య ఒప్పందం !!


  కవిత రచన : సాత్విక
ప్రకృతిలో అందంగా ఒదిగిపోయావు,
ప్రతి చోటా నీవే ఇమిడి పోయావు,
నాలోనే నీవు కొలువై యున్నావు,
నిన్ను ఇంకొకరిలో వెతికేస్తున్నాను,
నగ్నత్వమా, ప్రతి చోటా నీవే కదుమా !!

అందరూ నీకెరుకేలే,
నువ్వెవరో నీకే తెలియదులే,
నిజానికి  నువ్వు బలమేలే,
నిన్నెవ్వరు భరింపజాలరులే,
నగ్నత్వమా, ఇదే అసలు నిజము సుమా !!

       
నాలోని నువ్వంటే నాకెంతో ఇష్టం,
ఇంకొకరిలో ఐతే మరీ మరీ ఇష్టం,
కొంటె సరదా చేష్టలకి నువ్వే బెస్టు,
తుంటరి ఆగడాలకి నీవే లాస్టు,
నగ్నత్వమా, నా జోలికి నువ్వు రాకుమా!!

పరులు చూడ అయ్యెను నా మనస్సుకి గాయం,
ఇది మటుకు ఖచ్చితముగా ఖాయం,
'చాటు మాటు' నీకు అందించినచో సాయం,
అయిపోతావు నీకు నీవే మటు మాయం,
నగ్నత్వమా, ఈ ఆగడాలు చాలించుమా !!

నిను మొదటిసారి వీక్షించ తహ తహ,
కానీ పలుమార్లు పరికించ అహ అహ,
వరించకు నన్ను నలుగురిలోన,
నిలబెట్టకు తలవంపుల బరిలోన,
నగ్నత్వమా, నవ్వులపాలు  కానీకుమా !!

నీతో నా ఈ సాన్నిహిత్యం, 
గోప్యము అనునిత్యము,
ఉండిపో అందంగా ఎప్పటికీ,
తెలుపనులే  నేనేవ్వరికి,
నగ్నత్వమా, ఇదే మన రహస్య ఒప్పందం !!






March 19, 2013

టిక్కెట్ లేని మ్యూజియం ....


కవిత రచన : సాత్విక 
అంద చందాలు ఆ అమ్మాయి ఇంటిపేరు కాగా,
'నేను ఈ ముద్దుగుమ్మను పొందకుండు'నా అని అతను,

చదువు సంధ్యలు ఆతని వినయ విధేయతలవ్వగా,
'జాప్యమేల జతగాడా జంటగా చేరు నా చెంత' అని ఆ అమ్మాయి,

వారిరువురి ఎదురుచూపులకి  చిన్నబోయె కదా,
తొలకరి వానకై వేచియున్న పచ్చిక బయలు సైతము,

'వివాహము నిశ్చయంబ'న్న శుభ ఘడియల ముంగిట వారిరువురూ,
'చిత్రము చూసోద్దాము రా రాకుమారా' అన్న తన ప్రేయసి కోర్కెను,

కాదనలేని 'బలహీన మనస్సు పైన బలీయమయిన విధి' కోరలు చాచేను,
ముచ్చటగున్న జంట పై కన్ను పడె ఆ రాహు కేతు గణాల,

చిత్రము సమాప్తి అనుకున్నదా జంట కాని పరిసమాప్తమని తెలియదు వారికి,
గూటికి చేరేందుకు అనువయిన మార్గము కానరాలేదు వారిరువురికి,

చేరువలో నడిరేయి సమీపించ, నలుగురూ కనుమరుగవుతుండగా,
నగర శివారు కాబోలు, ఆ జంట ఉరకలేసే వడి వడిగా - ఆ పై వేగముగా,

'మనువాడే-చెలికాడే' చెంతనుండ తనకేమిటన్న చిన్న తెగువ,
తేలియాడెను ఆ క్షణం ఆ బాల కళ్ళలోన తెరచాటు భరోసా,

'దానవలోకం టు యమలోకం వయా భూలోకం' అన్న అక్షరాలు కానరాక,
'చెయ్యెత్తు, బస్సెక్కు' అన్న నినాదాన్ని గ్రహపాటుగా అనుసరించాక,  

ఆ క్షణం ఆ జంట చూడాల్సి వచ్చింది,
మానవత్వం మాటున దాగిన దానవ రూపం,
కలి ఆవహించిన నిర్దాక్షణ్యపు నర రూపం,

బస్సు లోన బేల, తనని విడువమని వేడుకొన్నది,
వేడుక లోన గొర్రె, నన్ను కనికరించమన్నది,
వేడుక పూర్తాయనే గొర్రె  కానరాకపోయేనే, 

ప్రేమించిన ప్రియురాలు కబంధ హస్తాల పాలు, 
నిస్సహాయ ప్రియుడి ఆవేదన నిరాశా నిస్పృహలపాలు,
వెరసి కడకు ఆతని ప్రార్ధనా విన్నపాలు, ఇలా..

నిర్దాక్షణ్యపు  భావమా నువ్వయినా నీరు గారిపో,
సహయనిరాకరణమా నువ్వయినా సమ్మె విరమించుకో,
కదులుతున్న కాలమానమా నువ్వయినా స్తంభించిపో,
నా కంఠములొని  ప్రాణమా నీవయినా నన్ను వదలిపో,

ఏ ఒక్క ప్రార్ధన ఫలించని ఆ క్షణం,
ఆ బాల అయ్యెను కదా అబల,
జరిగిపోయెను కదా ఘోర దారుణం,
రహదారి పైకి విసిరి వేయబడ్డ ఆ ప్రాణ మానం,

విల విల లాడెను ఆ ప్రియుడి మనస్సు,
గుండెలు మండగా, గుండెలవిసేలా రోదించే,    
ప్రశ్నించేను కనిపించిన ప్రతివారినీ ఇలా……
"ఎందుకు అంతరించలేదు ఈ జగతి, 
ఏమి మిగిలి వుంది ఇంకా సాధించాల్సిన ప్రగతి "



యావత్ దేశము గర్జించినా ఏమున్నది ప్రయోజనం,
రోజూ ఈ ఘోరం జరుగుతున్నది ప్రతి నూరు యోజనం,
అయిపొయిందీ భువి,  కలి అవశేషాలు మోసే మ్యూజియం...(నో టిక్కెట్ -- ఫ్రీ ఎంట్రీ )

March 18, 2013

మా పిచ్చ కానే కాదు ...

కవిత రచన : సాత్విక

ఓ రోదసీ యాత్రికుడా,
అంతరిక్షమున ఏమున్నది పరిశోధించడానికి ?
ఆలి అంతరంగమును పరిశీలించ వీలు వెతకవోయి..
అనంత విశ్వాన్ని నింపుకునే వైశాల్యం కనిపించునోయి...

ఓ యోధుడా,
కదనరంగమున కదం తొక్కనేలా ?
బాల కోరిక కాదని, ఆమె ఎదుట నిలువగలవా ..
నిలచిన తెలిసిపోవునులే నీ అసలు దమ్మెంతో ఓ సిపాయి ...

ఓ నావికుడా,
సాగరగర్భమున శోధించి నీవు వెలికి తీసిన నిధులెన్నో ? కానీ
నీ తరమగునా, త్రవ్వి చూచుట ఆమె మది లోతుల్లోన !!
నిక్షిప్థముగున్న నిగూఢమైన అనంత సంపదలెన్నెన్నో ...

ఓ పర్వత అధిరోహకుడా,
పర్వత శిఖరము చేర మార్గమన్వేషించి మధన చెందనేలా ?
ఆమెలోని దూరాలోచనా శిఖరము చేర పధము వెతకవోయి ..
జీవితపు అసలు అంచు ఏమిటో నీకే అవగతమవునోయి ...

ఆమె మోసే కుటుంబ భారం ముందు భూమాత మోసే భూభారం తక్కువేనోయి..
పెను తుఫాను సైతం,  ప్రశాంతముగా యోచించును కదా ఒక్క క్షణం ఆమెని తలచినంతనే..
భగవంతుడే మారు రూపముగా అవతరించి, చేసుకొనెను కదా అమ్మ ఒడినే తన సన్నిధిగా ..
నీకు అతిశయోక్తి అనిపించేనా? ఆమెతో నీ సాన్నిహిత్యం పెంచుకొని మరల చూడ రావోయి ...

ఆమెను ...
నీవేరుగవులే, నేనెరుగనులే, అసలేవ్వరకి తెలియదులే,
ఆమెనెరుగ, కవి పండితులు కలం పట్టి చేస్తున్న కాలయగ్నమిది (కవిత్వం),
ఆమెనెరుగ, తరతరాలుగా సాగిపోతున్న నిరంతర పట్టుపటాంగమిది (దీక్ష),
ఆమెను ప్రకృతి తో పోల్చుట తప్పు(ప్పదు)లేదులే ఓ చిరంజీవి సోదరా ... 

ఇట్లు
వేడి వేడి సమోసాల బండితో,
బండి యజమాని సాత్విక..

(ఏదో మా పిచ్చ కాకపోతే , అమ్మాయికి ప్రకృతికి పోలికేంటి ?   అన్న ప్రవల్లికకి సంక్షిప్త సమాధానంగా ఇలా ...)