April 1, 2013

మ్యాజిక్కు లోని లాజిక్కు !!


కవిత రచన : సాత్విక 
నివేదిక,
చూడకనే చూసుకునే ఆ చూపులలో,
చెప్పకనే చెప్పుకునే ఆ ఊసులలో,
జనియించు క్రొంగొత్త హావభావాలలో,
ఒకరికొకరుగా తపించే సన్నివేశాలలో,
ఇది సాధ్యం అపరిపక్వతా వలయంలో,
ఇదే అందరికీ అందము యవ్వన ప్రాయంలో,

కుర్ర ప్రశ్న,
వాస్తవం అంత అందంగానుండని యెడల,
ప్రేమ పై మీ కల్పనా కవిత్వ హోరు ఏల ?
మా కెందుకీ అనవసర ప్రేరేపిత భావజాల లీల?
ఆకర్షణ చాలా అందముగా అగుపించు అంతే, అననేలా?

సమాధాన వివరణ,
'యువత'ని సులువుగా మభ్యపెట్టు బలమే ఆకర్షణ లోని వలపు,
కళ్యాణము పిమ్మట 'ఆకర్షణ'.. నిన్ను వాస్తవం ముంగిట నిలుపు,
'వర్తమాన వాస్తవిక లోని అలుపు' కలిగించును ప్రేమ పైనే మతిమరపు,
ఆ సమయంలో ఎంతటివారికయినా కావాలోయ్ చిన్న మేలుకొలుపు,

చుట్టూరా..  'ప్రేమ' మరచి పట్టు కోల్పోతున్నాయి ఎన్నెన్నో కాపురాలు,
కవిత్వములోని అభూత కల్పిత వర్ణనా సోయగాలు.............,
కొంతయినా తట్టి లేపును వారి గత ఆకర్షణ జ్ఞాపకాలు,
వెరసి నిలుప చూడ ఎన్నెన్నో వసి వాడిపోతున్న జీవితాలు,
అంతేనోయి ప్రేమ యందు కవిత్వమునకు గల ఈప్సితాలు ...

అపరిపక్వతలో కొంత మేర పరిపక్వత అవసరం 
యవ్వనము సజావుగా, మజాగా గడపటానికి ...
పరిపక్వతలో కొంత మేర అపరిపక్వత అవసరం 
వాస్తవికతలోని  యాంత్రికతను పారద్రోలడానికి ...

మ్యాజిక్కు లోని ఈ లాజిక్కు ,  తెలుసుకోకుంటే చిక్కే మరి  !!




March 31, 2013

కాకరకాయకి చేయూత వంకాయ !


కవిత రచన : సాత్విక

వచన కవిత్వమా వంకాయా ?
అని అవహేళన ఎందుకులే ?

కవిత్వమా కాకరకాయ ?
అన్న ప్రశ్నకి సమాధానముగా,

పద్య, గేయ పద సంపుటి అంతరించి,
'తెలుగు' కనీసం వాడుక భాషగా సంచరించ
కూడా 'అనాధ' ఆగుతున్న ఈ తరుణములో,

నేనున్నాను,
నేనున్నాను,
ఆదుకొంటాను అణగారిపోనివ్వనని,

భాషాభిమానం చాచిన అభయ హస్తమే వచన కవిత్వ ఆకారము,
పుట్టించెను తెలుగు మీద సామాన్య మానవుడికీ మమకారము,
పాత తర భావావేశాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఒరవడికి శ్రీకారం,
'ఇది ఉద్భవించినది' -- తగ్గించడానికి తెలుగు తల్లి చేసే హాహాకారం,

నియమ నిభందనలు తెలియదని... అసలు లేనే లేవని అవహేళన ఆపవోయి,
అలంకార బంధాలు వదిలించుకొన్న 'స్వేచ్చే' దీని ఆయువుపట్టని గ్రహించవోయి,    
ఈ తరహా కవిత్వానికి నవ సమాజమున ఓటుబ్యాంకు ఎక్కువోయి,
కవిత్వానికి, 'వచన రూపం' అందించిన శక్తి నీవు గ్రహించవోయి,
మారుతున్న కాలానికి అనుగుణముగా రూపాంతరం చెందెనోయి,
మనసున్న ప్రతి మనిషి మదిలోకి అలవోకగా చేరిపోయే శైలే దీనికున్నదోయి,
'అంతరార్ధ వివరణా..' వ్యయా-ప్రయాసలు అవసరం లేని సులువు దీని సోంతమొయి, 

సరళమయిన పదాల అల్లిక తో కూడిన 'ప్రాసే' దీని అసలు బలం,
లోతయిన భావాలని ఇమిడ్చుకోగలిగినందుకు నీవు చేయి సలాం, 
కవిత్వం మీద మనసున్న మనిషి ఆకలి తీర్చే అచ్చతెలుగు గళం,
చండ ప్రచండ చక్రవర్తులయిన ఉండి వుంటే అయ్యేవారు దీనికి గులాం,

వచన కవిత్వమా నీకివే నా వందనాలు,
తెలుగుని పది మందికీ చేర్చు,
అన్ని రూపాల విస్తరించ ప్రయత్నించు,
నిన్ను ప్రశ్నించిన వారికి తెలుగు'వాడి'ని చూపించి ప్రతిఘటించు...

March 29, 2013

వేసవి ప్రేమలు !!


కవిత రచన : సాత్విక
పొద్దున్నే పనిగట్టుకు వస్తావు,
నాచేతే పాటలెన్నో పాడిస్తావు,
హుషారుగా ఉరకలు వేయిస్తావు,
విషయ వివరణలతో వేయించేస్తావు,

నన్ను ఎవ్వరిని చూడోద్దంటావు,

నేను నిన్ను మాత్రమే చూడాలంటావు,
ఎవ్వరితో నన్ను మాట్లాడద్దంటావు,
నీవు మటుకు అందరినీ పలకరిస్తావు,

సమాధానం చెప్పలేని ప్రశ్నలేస్తావు ,
నన్నే నువ్వు ఎక్కువగా వేధిస్తావు,
నా గురించే ఎక్కువగా ఆలోచిస్తావు,
అందరిలోన నిలబెట్టి ఇబ్బంది పెడతావు,

ఒక్కరోజు కలవకపోతే నా పద్ధతేమి బాలేదంటావు,
నా నుంచి ఎన్నెన్నో సంజాయిషులు కావాలంటావు,
నా మంచీ, చెడ్డల సమాచారం మొత్తము సేకరిస్తావు,
కనిపించిన ప్రతివారికి చూపించి మరీ వివరించేస్తావు,
అల్లరి చేష్టలు భరించి ఓర్పుతో ముందుకు నడిపిస్తావు,

పైన వివరించిన నా భావనే,
మాలో ప్రతి ఒక్కరికి నీతో నిజమే,
మేము రెండో క్లాసు అల్లరి పిల్లలమే,
'మీరు' నుంచి 'నువ్వు' అనేంతగా కలసిపోయావ్,
మమ్మల్ని నీ నుండి దూరం చేసేస్తున్నదీ సమ్మర్,
అందుకే  వీ మిస్ యు టీచర్” & "వీ లవ్ యు టీచర్".

March 28, 2013

ఈ ప్రక్కకి చూడొద్దు ...


కవిత రచన : సాత్విక

అసలే శాస్త్రమూ చదువలేదు
నేనేవ్వరితో వాదించుట లేదు,
వారినెవ్వరినీ కాదనుటలేదు 
అయిననూ,  నాకు అనిపించేను ఇలా
'సన్యాసమంటే స్పందన లేకుండుటే ' కదా !

కాషాయం ఏరి కోరి కట్టుకొనుట,
రంగు మీద వారి మనస్సు లగ్నమగుటే,

నియమాలన్నీ వల్లించుట పాటించుట,
తెలిపెనులే శ్రద్ధ, భక్తిలకి వారు వశమగుటే,

నియమ నిబంధనలలో ఇరికించుకోనుట,
సన్యాసిగా మార్పునాసించిన ప్రక్రియలోని బాగము మాత్రమే,

ధర్మ-అధర్మ ప్రభోదాల వారియొక్క ఆధ్యాత్మిక చింతన,
ఖచ్చితముగా నిలుపును కొంతమేర 'సాధువు'ల చెంతన,

సన్యాసము అనునది కేవలం ఒక మానసిక భావజాలము,
కావాలనుకున్నంత మాత్రాన అందరమూ పొందజాలము,

పౌడరు,క్రీములు అందముగా అద్దుకునే గురువులు ఒక పక్క,
కోపగించుకొని కన్నెర్ర చేసే సాములోరులు అందరికెరుక,
మైమరచి తరచి తరచి ఆనక ఊసులడిగేను తస్స చెక్క,
ఆణువణువూ పరీక్షించు అగుపించేను అసలు చందము ఎంచక్కా,

అందుకే, కాషాయ వస్త్రదారులందరూ సన్యాసులు కారులే,
అందులోన అధిక శాతం సంసారులేకొంతమేర సాదువులే !

కాషాయం అనినచొ వెలవెల పోవుటకు సూచనగా నీవు పరిగణించు,
మేనిన అలంకరించ కాదది, నిర్లిప్తత నిండిన మనస్సును అది ఆవహించు !

సమాజములోని అవినీతి, అన్యాయం, దోపిడీతనం ఒకింత,
ప్రభుత్వాల పనితీరువేటిమీదా స్పందనే లేకున్నారు ప్రజలంతా,
సమాజశ్రేయస్సు పట్టని సమూహ సన్యాసులయ్యరా వీరంతా ?

అందుకే అస్సలు ఈ ప్రక్కకి చూడొద్దు,
కనిపిస్తారు సమాజములోని ఆధునిక సన్నాసులు,
మఱియూ కాషాయం ధరించని సన్యాసులే అధిక మొత్తముగా,
కాషాయాన్ని విషకషాయముగా ఉపయోగించువారే ఏకముగా !!

March 27, 2013

కోకు


కవిత రచన : సాత్విక


భాష లేని భావమెందు'కో',
భావం లేక భాష నిలువలేనందు'కు'..

ఆశ తోటి ఆరాటమెందు'కో',
ఆరాటం లేక ఆశ గెలవలేనందు'కు'..

గమ్యం తెలియని గమనమెందు'కో',
గమనం తోనే గమ్యం చేరుకునేటందు'కు'..

కల్పితాలకి వర్ణనలెందు'కో',
వర్ణనతోనే కల్పితాల అందం విడమరచేటందు'కు'..

స్పందన కరువయిన చోట సాహిత్యమెందు'కో',
సాహిత్యమున్నదే స్పందన కలిగించేటందు'కు'..