September 29, 2013

ఏమిటో ఈ మాయ ...

గీత రచన : గుంటూరి
నీ కొంటెచూపే ఎదురుగ నిలుచుందిగా …  
నన్ను చేరి నిలదీసినట్టుగా …. 
నాకు నేనే కనిపిస్తున్నానే అదో ఇదిగా…  
సిగ్గుపడుతున్నట్టుగా…. 
' ఏమిటో ఈ మాయ ' ఇలా తగులుకున్నది… 
గుర్తు పట్టలేనట్టుగా …. 
నన్ను నేనే గుర్తు పట్టలేనంతగా …. 

కంటి చూపుదొక ప్రేమ .. 
మూగ మాటదొక ప్రేమ ..
చేతి స్పర్శదొక ప్రేమ ..
ఆశలోని శ్వాసే ప్రేమ ..
నవ్వులోని స్వచ్చతే ప్రేమ ..
ఇంద్రియాల పరవశమే ప్రేమ …    

నీ కొంటెచూపే నా కంటికెదురుగా నీవులా నిలుచుందిగా… 
' ఏమిటో ఈ మాయ '    ' అసలేమిటో ఈ మాయ ' …. 

వానజల్లు లోని చినుకేదో నను పిలచిందిగా …
తనతో నీవు చిందేయగా ….
ఆ చినుకు లోనే నేను తడిసి ముద్దయినట్టుగా …
అనిపిస్తోందిగా అలా అలా ….
' ఏమిటో ఈ మాయ ' ఇంత తీయగున్నది …
తేనే పూసినట్టుగా ….
తేనేతోనే స్నానం చేస్తున్నట్టుగా ….

పరవశించే భావమే ప్రేమ .. 
పరిమళించే సువాసనే ప్రేమ ..  
ఊహల సమ్మేళనమే ప్రేమ .. 
ముచ్చటైన ముద్దే ప్రేమ ..
అందమైన ప్రకృతే ప్రేమ .. 
జ్ఞానేంద్రియాల మైమరపే ప్రేమ

వానజల్లు లోని చినుకేదో నిన్ను నన్ను తనతోటి చిందేయమందిగా … 
' ఏమిటో ఈ మాయ '    ' అసలేమిటో ఈ మాయ ' …. 

September 28, 2013

వేర్ అర్ యు? వేర్ఎవర్ యు అర్?

కవిత రచన : సాత్విక

నిద్రలో నిజమెంత అని నలుగురిని నేను ప్రశ్నిస్తున్నా,
కలలో కనిపించిన నిన్ను నిజమేనని ఇలలో వెతికేస్తున్నా,

అలై పరిణమించాక తీరం చేరుటే లక్ష్యముగా సాగునుగా,
కలై దర్శనమిచ్చాక సాగకుందునా నువ్వే నా ధ్యేయముగా,   

మేఘమైన గుర్తుపట్టదే తన నీటిచుక్కని నడిసంద్రములోన,
నేను మాత్రం నిన్నే చేరుకుంటా ఎక్కడున్నా జనసంద్రములోన,

ఆకలి దప్పులు మరచానే జత కోరుతున్న 'నా ఈ మనస్సే' నీదిగా, 
ఆలోచనే పొలమారుతున్నది తర్కానికి.. 'నీవంటే నేనే' అంటోందిగా,

నిను తలచి.. పాలపుంతలోని 'వేగుచుక్క వెలుగే' విలపించే..  నా చెంత,
అందుకే కొత్తపుంతలు తొక్కుతోంది నా మనస్సు నిన్ను తలచినంత,

'రాత్రీ-పగలు' తేడా లేదే నీకై పరితపిస్తున్న నాలోని ప్రతి ఆలోచనకి,
'జ్ఞాపకమే గతమంటే' 'ఊహలే భవిష్యత్తంటే' 'వాస్తవం నీవే'లే నిజానికీ,

ఎచ్చోట దాగున్నావో ? జతే చేర నీకింక జాగు ఏల ?  అని అడుగుతున్నా ?
ఈ కవ్వింతల దాగుడుమూతలలో ఎప్పటికైనా గెలుపు నాదేనని పయనిస్తున్నా ...  

September 24, 2013

లేటెస్ట్ ఫ్యాషన్...


కవిత రచన : సాత్విక

ప్రకృతి సమకూర్చిన ముగ్ధ మనోహర సింగారం
కావాలి తన మగడిని ఆకట్టుకొనే కొంగుబంగారం … 

పరదా దాటిన ఆధునికత అనే క్రొత్త వ్యవహారము
చేసేస్తోంది ప్రతి చూపుకి తన అందాన్ని పందేరము … 

ఆ అలంకరణే కోరుతోంది మగడి ఆదరణ ఆద్యంతము
వలదంటోంది మగాడి ప్రాకృతిక స్పందన అనునిత్యము … 

కీచకుడే స్వయంభూవై ఆవహించే ప్రతి నరుని నరాన  
భీముడైనా భీష్మించే కలియుగ నర్తనశాలలో వాస్తవాన … 

ఆహ్వానించి వధించిన గాధ మన పురాణ కీచక చరిత్ర
కవ్వించి కబళించబడిన వ్యధ ఈ ఆధునిక అతి(వ) చరిత్ర … 

'అందానికి బలహీనత'కి  జరుగుతున్న ఆటలోని కుతూహలం
తెలిపెను కోటానుకోట్లలో నిగ్రహం విడువని మగవారి మనోబలం … 

'అలంకరణలోని హద్దులు' కావు ఆడవారి స్వాతంత్రానికి అడ్డుగోడలు
అవే 'హద్దులు అవసరం' మగవారి ప్రాకృతిక ప్రేరణకి ప్రతిబంధకాలు … 

పోటిపడి అందాలన్నీ ఎరవేసినట్టు ఆరబెట్టే  ఓ'సీ-త్రూ' సంస్కారం   
"ఆడదానికి శత్రువు ఆడదే'నన్న నిజమే చేస్తోంది నీకు నమస్కారం … 

వెర్రి తలలతో ఊపిరి పోసుకుంటున్న "ఫ్యాషన్"ని  చేయండి ఖననం
లేక, కోల్పోతుంది ఆధునిక భారతములో భూమాతైనా తన సహనం …        

September 22, 2013

పిలుస్తాలే ఆవారా ఇంకోలా !!

గీత రచన : గుంటూరి



' ఆవారా ! ' అని పిలవాలి నువ్వే నన్ను నీ మనసారా
'అరెరే' అని ప్రపంచమే చూడాలి నేనేవర్నని? కనులారా  
వింత కోరికే నాకు కలిగింది ఈ వేళ ఇలా అనుకొన్నారా ?
అయితే మీకు కూడా ప్రేమ కొత్త వింతేనా ? ఔనంటారా ?
కాదులే పొమ్మంటారా ??

పిలిపించుకోవాలంటే ఏదోకటి చేసేయి ముద్దు పుట్టేలా,
'ప్రేమ ముదిరితే పిచ్చే' నన్న నిజం నువ్వే అనిపించేలా,
నువ్వే కోరుతుంటే చిలిపి కోరికే కవ్విస్తోంది నన్నూ ఇలా,
ఆవోనా అంటున్నా అల్లరే చెసేయి నేనే నిన్ను మరచేలా !
నాకు ఒళ్ళు మండేలా !! 

అల్లెయనా కొత్త పాటేదో ఇదే భావన అందముగా,
గిల్లెయనా మనస్సునే తొలకరి చూపుతో చిలిపిగా,
చిందెయ్యనా తికమక పుట్టించే ప్రాయమే సాయంగా,
పిలిచేయ్యవా ఆవారా అదే పిలుపుతొ త్వరత్వరగా !
అదో ఇదిగా, కొత్త కొత్తగా !!

పాటో పల్లవో పాడెసేయి ఒక పని అయిపోతుందిగా,
గిచ్చుడో ఇచ్చుడో సైట్ కొట్టుడో చేసేయి తొందరగా,
చిందులేసే వయసే ఉందిగా మన ఇద్దరికీ వాటముగా,
' బకరా ' అంటూ పిలవాలని అనిపిస్తోంది కొత్త ప్రేమగా!
' ఆవారా 'కి బదులుగా!! 

September 21, 2013

మోక్షము అంటే ? (2)

వ్యాస రచన : హృది


సంపూర్ణత్వము అనే ఒక భావన/స్థితి యొక్క అంతిమ ఘట్టం భావనారహిత్యము (రాగాబంధనకు అతీతమగు స్థితి). మోక్ష మార్గమునకి సూచించిన ఏ మార్గము అయినను పరిపూర్ణత్వము సాదించటానికి సూచించిన ప్రక్రియలు మాత్రమే అని నేను ప్రగాఢముగా నమ్ముతాను. 

అయితే సంపూర్ణత్వము ఏమిటి స్పందనారాహిత్యము కలుగజేయుట ఏమిటి ? అన్న సందేహము మొట్టమొదటగా జనియించు స్పృహ.  (స్పృహ అని ఎందుకు అన్నాను అంటే ? వాస్తవాన మనము మనకు తెలియకుండానే మన మనస్సులో కొన్నిటిని జీర్ణించుకొనియుంటాము అందువల్ల సంపూర్ణత్వము అంటే ఒక 'తారాస్థాయి స్థితి' అని మనం అర్ధం చేసుకొనియుండే అవకాశము మెండు. ఆ భావన మనల్ని తట్టి లేపి ఒక సందేహం రూపంలో మన మదియందు నిలుచొని ఉండి ఉండవచ్చు, అందుకే స్పృహ అని నేను పలక దలచినాను)

సరే అసలు విషయానికి వస్తే సంపూర్ణత్వమునకు  స్పందనారాహిత్యమునకు గల సంబంధం ఏమిటి ? దీనిని అర్ధం చేసుకొనే ముందు " కామిగాని వాడు మోక్షగామి కాలేడు ? " అన్న వాక్యముని పరిశీలిద్దాము ::

ఒక చెట్టుకి ఆకు పూయును. ఆ ఆకు యొక్క జీవిత చక్రము పరిశీలిస్తే, 'అంతము' అనునది రెండు విధములగా కనిపించును. 
1. త్రుంచివేయబడుట
2. రాలిపోవుట

త్రుంచివేయబడుట అను ప్రక్రియ ఆ చెట్టుకి బాధను మిగుల్చును, రాలిపోవుట అను ప్రక్రియలో బాధ  వుండదు. త్రుంచివేయబడుట అనేది ఒక అసంపూర్ణమైన ప్రక్రియ ( ఆకు ప్రాకృతిక జీవనచక్రములొ / natural life cycle), రాలిపోవుట అనేది పరిపూర్ణత్వము వనకూర్చుకున్న ప్రక్రియ అని అర్ధం చేసుకోగలము కదా. అయితే ఆకు అనేది చెట్టునుండి వేరు చేయబడటానికి 'అసంపూర్ణత్వము' 'సంపూర్ణత్వము' అనే ఈ రెండూ దోహద పడతాయి. కాకపోతే సంపూర్ణత్వము వలన సంక్రమించినచో స్పందన (బాధ) అనునది జనియించదు. అయితే ఈ ఉదాహరణ అనేది ఎందుకు ప్రస్తావించాను అంటే చెట్టుని మనస్సుగా పరిగణించగలిగితే ఆకు అన్నది మనయొక్క కోరిక అని ఊహించుకుంటే, మనలోని కోరిక అనేదానికి పరిపూర్ణత్వము ప్రసాదించిన యెడల అది తిరిగి మన మనస్సుని బాధించక తొలగిపోవును అన్న ఒక ప్రాధమిక సూత్రాన్ని గ్రహించాలి. అంటే సంగ్రాహకముగా నాకు అర్ధం అయిన విధానము ఏమిటంటే "నీవు అనబడే మనస్సుకి ఉన్న ఇష్టాలకి సంపూర్ణత్వముని ఆపాదించు, అదే నిన్ను ఆ యొక్క కోరిక నుండి విముక్తి కలిగిస్తుంది" అంటే "కామిగానివాడు మోక్షగామి కాలేడు" అని ఉవాచ.

ఆకు త్రుంపి వేయబడుటని (అసంపూర్ణత్వము) మనం విధి అని అంటుంటాము. నాకేమనిపిస్తుందంటే ఇదొక చిత్రమైన స్థితి దాని మూలార్ధము పోయి పెడ అర్ధము మన మనసులలో తాండవం చేస్తున్నదేమో అనుకొంటూ వుంటాను (మరియొక మారు తప్పక పంచుకుంటాను నా భావనల్ని).

అయితే పై చర్చలో "సంపూర్ణత్వమునకు  స్పందనారాహిత్యమునకు గల సంబంధం" అన్నదానికి "కామిగాని వాడు మోక్షగామి కాలేడు" అనేటువంటి వాటికి విశ్లేషించ ప్రయత్నిస్తూ ఇక్కడ ఇంకొక సందేహం నిద్ర లేపుకున్నాము. అంటే "మనస్సులో నిలచి ఉన్న అన్ని కోరికలకి సంపూర్ణత్వము పొందితేగాని వాటి నుండి విముక్తి లబించదా ?" అని. దీనిని మనము పరిశీలించేముందు త్యజించుట/విసర్జించుట , విముక్తి/విమోచనము అనే వాటి గురించి మాట్లాడుకోవాలి.

విముక్తి/విమోచనం అనునవి సంపూర్ణత్వము వలన సంక్రమించేటువంటి విడుదల. మనకు తేలికగా అర్ధం అవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇలా: నా మనస్సులోని కోరికను సంతృప్తి పరచటానికి నేనే  చేసే ప్రయత్నమే ఒక పరీక్ష అయితే సంపూర్ణత్వము అనగా ఆ కోరిక 100 మార్కులతో అది పాస్ అవ్వడం. (100 మార్కులు అన్నది ఒక్కొక్కరి ప్రామాణికం ఒక్కోలా వుంటాయి, దీనిని వేరోకమారు చర్చించుకోవచ్చు). అదే కోరికని ఆ పరీక్ష రాయవలసిన పని లేకుండా చేయడమే త్యజించుట/విసర్జించుటగా చెప్పుకోవచ్చు. అంటే మన మనస్సులోని కోరికలని రెండు విధములగా మనం పారద్రోలవచ్చు. పరిపూర్ణత్వం వనకూర్చుట లేక కోరికని విసర్జించుట అనే విదానములలో (అణుచుకొనుట అనునది బూస్తాపితము చేయునటువంటి విధానము, దీనివల్ల లాభము/నష్టము సమానముగా యున్నవి in simple terms postponing the exam, may be you can get a chance to get 100marks later or you may get exemption from this exam... who knows..).

మరి కోరికలని ఎందుకు పారద్రోలాలి ? అంటే 'కోరిక' స్పందనల్ని కలిగించునటువంటిది కాని మనము కోరుకుంటున్న స్థితి మోక్షము (స్పందనలకి అతీతమగునటువంటి స్థితి) గావున.

అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయము ఏమిటంటే కోరికని పారద్రోలే (పైన అనుకొన్న ఏ విధములోనైనాను) క్రమములో ఇంకొక దాని కోరిక/తపన మీదకి మనస్సుని మళ్ళించే ప్రక్రియ అధికముగా గోచరిమ్చుచున్నది. ఉదాహరణకి పరిపక్వత పొందిన నాస్తికుడు చూచు కోణం ఏమనిన " భక్తి మార్గము నన్ను వశము చేసుకోనును అందువల్ల నేను ఆ మార్గమున ప్రయాణింజాలను అని " బాగుంది,  కాని అదే సమయములో తన మనస్సుని లగ్నం గావించుటకు ఏ అంశం లేకుండా యుండుట లేక "భక్తి" అనే భావన పై ద్వేషం పెంచుకొనుట జరుగుటకు ఆస్కారం మెండు. అదే విధముగా భక్తి తత్పరులు తము నమ్మిన భక్తి మార్గము/లేక తమ నమ్మకము పై (అమితమైన) "ప్రేమ" అనే ఒక స్పందనకి తావిచ్చు విధానము మనము చూస్తూ ఉంటాము.  అయితే వీటికి అతీతముగా నున్న మహానుభావులు (భక్తులలోను/నాస్తికులలోను) మనకు అక్కడక్కడా కనిపించెదరు.

మరి వేదాలు , ఉపనిషత్తులు , సన్యాసం, ఆసనాలు, యోగా ....ఇంతమంది మహనీయులు చెప్పినవన్నీ హాస్యాస్పదమా ? అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే పైన చెప్పినవన్నీ పలు రకములైన మార్గములు "సంపూర్ణత్వము"ని  మనస్సుకి ఆకళింపు చేసుకొవడానికి అని నేను నమ్ముతాను. మార్గములని ప్రేమించువారి మధ్యనే మనమందరమూ కాలం గడుపుచున్నాము. ఎందుకంటే మనము వింటూ ఉంటాము కదా " ఫలానా దేవుడు మహిమ గల దేముడట " అని. అయితే ఈ వాక్యాన్ని అపహాస్యము చేయజాలను ఎందుకంటే కొంతమంది మానసిక పరిపక్వత పొందుటకు అవలంబించిన విధానములో వారు ఎంచుకున్న మార్గములో వచ్చు ఒక చిన్న అభ్యాసము అది అని నేను అర్ధం చేసుకొన్న విధానము.
మోక్ష సాధనకి "సులువుగా కనిపించే మరియొక  క్లిష్టమైన మార్గము" ఏమిటంటే "మోక్షము అంటే ఏమిటో అర్ధం చేసుకొని మనస్సుకి ఆకళింపు చేసుకోనుటే". మార్గములని ప్రేమించుటకన్నా, మార్గముల విశిష్టతలని ఎంచుకొనే కన్ననూ  గమ్యం చేరుటే ప్రధానము అన్నది గ్రహిమ్చుటే మిన్న.

ఎలాగు ఇంత మాట్లాడుకోన్నాము కాబట్టి ఆఖరుగా మరియొక మాట ఏమిటంటే ఆత్మహత్య అనునది ఆకుని త్రుంపి వేయుట వంటిది "జీవశక్తికి వేదన రగుల్చును" మరణం దానంతట అది సంబవించుట అనునది మరణచక్రములోని సంపూర్ణత్వము. కావున ఐహిక బాధలు త్రుంచి వెయదలచి జీవశక్తికి వేదన మిగుల్చువారు ఎందరో, ఒక్క క్షణం ఆలోచిస్తే వారికి వారి కళ్ళ ముందున్నవి బాధలుగా కాక సాధారణమైన అంశముగా గుర్తించగలుగుతారు. అందుకే భక్తి/నాస్తికత ఏ మార్గమైనను మానసిక స్తైర్యముని పెంపొందించుటకు వినియోగించి గమ్యము యొక్క అంతరార్ధము తెలుసుకొనుట ఉత్తమము. మరల కలిసినప్పుడు త్యజించుట/విసర్జించుట సన్యాసము/నన్/బోధకుడు/ వగైరా వగైరా మార్గముల గురించి నా భావములు పంచు కొనుటకు ప్రయత్నిస్తాను.

మరిన్ని భావములు పంచుకోనవలెను అని ఉన్ననూ (Thanks for bearing me until this point) ఈ వ్యాసము సుదీర్ఘతని దృష్టిలోనుంచుకొని  పైన  పలు సందర్భములలో లోతుగా కాక పై పైన మాత్రమే కొన్ని భావాలు వ్యక్తపరచాను (I know some of my friends are happy about it). వీలు కుదిరినప్పుడు వ్యక్తీకరణ చేయుటకు ప్రయత్నిస్తాను (sorry for this). నా భావమును పంచుకొనుటకు నేను చేసిన ప్రయత్నమే ఇది. నాకు అవగాహన లోపము ఉండి ఉండవచ్చు క్షంతవ్యుడను , విజ్ఞులు మన్నించగలరు (Thanks alot for this).