October 6, 2013

ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే...

కవిత రచన : సాత్విక


మంచు పల్లకి కావాలని 'నేను కోరుకుంటున్నా' 
కరిగి కనుమరుగవుతుంది అని నీవంటున్నా
మనస్సెరిగి మనం వాదులాడుకుంటున్నా!
'మన అనురాగమే మంచైతే' , కరగదంటున్నా!!

స్వయంవరమునకు నేను వువ్విళ్ళురుతున్నా
మనోభారమేల అని నీవు కాలయాపన చేస్తున్నా
మనస్సు దోచి, 'నీవు రేపిన ఆశలే'  మిన్నకుండునా !
ఆ ఆశలే హరివిల్లుగ చేసి నీవే -- ' నా రాముడివంటున్నా '!!

మత్స్య యంత్రము నీ ముందు పెట్టి నే సరదా పడుతున్నా
ఇది ఏమి కుతంత్రము? అని నువ్వు దిగాలుగా కూర్చొన్నా
'పారదర్సకత లోపించని మనస్సు'లు మనవే కదా అంటున్నా!
ఆ మనస్సునే దర్పణముగా మత్స్యము నే చూపకుందునా ??

అనుక్షణం ' నీ సాంగత్యమునకై ' నా మనస్సు తపిస్తోందని నేనంటే
ఏకాంతం కూడా ఆస్వాదించుట నేర్చుకోమని నీవు నాతో అంటుంటే
రెండు ఒకటైన మనం విడివడితే ' ఏకాంతమే అగును ఒంటరితనం '!
ఏలా చెప్పను ? నీ సగం మనస్సుని -- ' నేను ఒంటరి చేయలేనని '!!

October 3, 2013

నాలుగు ముక్కలు ....

కవిత రచన : సాత్విక

' నేను అహంభావాన్ని విడిచిపెట్టాను ' అన్న మాటల్లో,
'మిగిలున్న అహంభావం' బయటపడేను కొత్త కోణంలో,
'వీగిపోవును ఏది ఏమైనా' అహం విడచిన పలకరింపుల్లో,
మరువక అప్పుడప్పుడైనా సన్నిహితులని పెడదాం మాటల్లో 

'పొరపొచ్చాలు'  సూచించును కావాల్సిన మార్పులు, 
గ్రహించి సరిచేసుకోనుటే వాటికి అసలైన తీర్పులు,
కపోతం అయినా బంధించబడి కోల్పోవును తన 'శాంతి' ,
తదుపరి మాత్రమే శాంతి కపోతముగా ఎగురును గెంతి  

మనలోనున్న  'క్రోధము'  కనిపించని శత్రువే స్వగతాన,
బయటపడిన కోపము మిగుల్చును శత్రువునే వాస్తవాన,
'కరవమంటే కప్పకు కోపం' 'విడువమంటే పాముకు కోపం', 
చిత్రమైన ఈ నిజమెరిగి వాటి జోలికి పోతే  'నీదే లోపం'  

జీవితమనే నాటకానికి తొడిగిన తొడుగే ఈ 'శరీరం' ,
కాలమనే ప్రవాహంలో కొట్టుకుపోయే  వెధవ కళేబరం,
అసలే తాపత్రయం లేకుండుటే అతి గొప్ప వరం,
ఈ నిజాన్ని మరువక మసులుకోవాలి కదా మనందరం …  

October 2, 2013

అవసరం అయితే చంపేద్దాం !!

కవిత రచన : సాత్విక
నీవు,నేను' అనేవి మరచి మనం అనుకున్నా 
నాలోని చెడుని తనకోసం వదులుకుంటున్నా
'నన్ను' నేను గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నా  
సమన్వయంతో సమన్యాయం నే సంధిచేస్తున్నా
ఆటు పోటులు అన్నిటినీ నావని ఆనందించేస్తున్నా

బ్రతుకులోని అన్ని భాధ్యతలని నేనే కూడుకుంటున్నా
'నాకు-నేను' అన్న స్వార్దాన్ని నా నుండి తీసివేస్తున్నా
'తనవారుని నావారు'గా జీవిత బంధాలు హెచ్చవేస్తున్నా
భారమనిపించిన బాధలన్ని సంతృప్తి తో భాగించేస్తున్నా 
జీవనసంగ్రామములో సోంత లెక్కలు మరచిపోయానంటున్నా


****               *****              *****              *****

స్వార్ధం ఏకాంతముగా 'తన'తో కళ్ళగంతల ఆట ఆడేస్తున్నా
తననే గెలిపిస్తూ 'తన సుఖమే' తనకి బహుమతిగా ఎరేస్తున్నా
'పుష్కర సమయం' పుసిక్కున తిరిగోచ్చేసానని నాతో అంటున్నా
'నీవొద్దు నీడబ్బు కావాల'న్న పతాక సన్నివేశం పరిచయం చేస్తున్నా
ఆహా! భళా! విధి విశ్వరూపముగ తననావహించిందా అనుకున్నా

'భవిష్యత్తు' 'పగ - ప్రతీకారం' అనూహ్యముగా నాతో పందెం కాస్తున్నా   
బలహీనమైన క్షణాల ఆసరాగా స్వార్ధమే సరికొత్త ఆటకి ఆహ్వానిస్తున్నా
నిశ్చేష్టుడనై అచేతనమైన స్థితికి చేరువులోకి  నా మనస్సు చేరుకున్నా
'పిల్లలు' అన్న బంధమే వివేకముగా నాలో మమైకమై బుజ్జగిస్తున్నా
స్వార్ధపు ఆహ్వానాన్ని కాలదన్ని 'విడాకుల'తో పనిలేదని సర్దుకుపోతున్నా
విడివడిన మనస్సులతోనున్న నా సొంతమైన మనస్సుని చంపేస్తున్నా


ఆధునిక తరానికి విన్నపము : 
వీలుంటే సర్దుకు పోండి లేకుంటే 'మీ మనస్సుని చంపేసుకోండి ' ... పిల్లలు అనే భవిష్యత్తు మరచి విడాకుల జోలికి పోకండి. 'ఆధునికత'  అనేది మన ఆలోచనలో వుండాలి,  అంతే కానీ అనాగరికులలాగ  ఎవరిదోవ వారు చూసుకొని పిల్లలకి న్యాయముగా అందాల్సిన 'పితృ మాత్రు' ప్రేమలలో ఒకదానికి మాత్రమే పరిమితం చేయవద్దు... వారి మానసాలతో ఆడుకోవలదు..

September 29, 2013

ఏమిటో ఈ మాయ ...

గీత రచన : గుంటూరి
నీ కొంటెచూపే ఎదురుగ నిలుచుందిగా  
నన్ను చేరి నిలదీసినట్టుగా
నాకు నేనే కనిపిస్తున్నానే అదో ఇదిగా  
సిగ్గుపడుతున్నట్టుగా
' ఏమిటో ఈ మాయ ' ఇలా తగులుకున్నది 
గుర్తు పట్టలేనట్టుగా
నన్ను నేనే గుర్తు పట్టలేనంతగా

కంటి చూపుదొక ప్రేమ .. 
మూగ మాటదొక ప్రేమ ..
చేతి స్పర్శదొక ప్రేమ ..
ఆశలోని శ్వాసే ప్రేమ ..
నవ్వులోని స్వచ్చతే ప్రేమ ..
ఇంద్రియాల పరవశమే ప్రేమ    

నీ కొంటెచూపే నా కంటికెదురుగా నీవులా నిలుచుందిగా 
' ఏమిటో ఈ మాయ '    ' అసలేమిటో ఈ మాయ '

వానజల్లు లోని చినుకేదో నను పిలచిందిగా 
తనతో నీవు చిందేయగా .
ఆ చినుకు లోనే నేను తడిసి ముద్దయినట్టుగా 
అనిపిస్తోందిగా అలా అలా .
' ఏమిటో ఈ మాయ ' ఇంత తీయగున్నది 
తేనే పూసినట్టుగా .
తేనేతోనే స్నానం చేస్తున్నట్టుగా .

పరవశించే భావమే ప్రేమ .. 
పరిమళించే సువాసనే ప్రేమ ..  
ఊహల సమ్మేళనమే ప్రేమ .. 
ముచ్చటైన ముద్దే ప్రేమ ..
అందమైన ప్రకృతే ప్రేమ .. 
జ్ఞానేంద్రియాల మైమరపే ప్రేమ

వానజల్లు లోని చినుకేదో నిన్ను నన్ను తనతోటి చిందేయమందిగా  
' ఏమిటో ఈ మాయ '    ' అసలేమిటో ఈ మాయ '

September 28, 2013

వేర్ అర్ యు? వేర్ఎవర్ యు అర్?

కవిత రచన : సాత్విక

నిద్రలో నిజమెంత అని నలుగురిని నేను ప్రశ్నిస్తున్నా,
కలలో కనిపించిన నిన్ను నిజమేనని ఇలలో వెతికేస్తున్నా,

అలై పరిణమించాక తీరం చేరుటే లక్ష్యముగా సాగునుగా,
కలై దర్శనమిచ్చాక సాగకుందునా నువ్వే నా ధ్యేయముగా,   

మేఘమైన గుర్తుపట్టదే తన నీటిచుక్కని నడిసంద్రములోన,
నేను మాత్రం నిన్నే చేరుకుంటా ఎక్కడున్నా జనసంద్రములోన,

ఆకలి దప్పులు మరచానే జత కోరుతున్న 'నా ఈ మనస్సే' నీదిగా, 
ఆలోచనే పొలమారుతున్నది తర్కానికి.. 'నీవంటే నేనే' అంటోందిగా,

నిను తలచి.. పాలపుంతలోని 'వేగుచుక్క వెలుగే' విలపించే..  నా చెంత,
అందుకే కొత్తపుంతలు తొక్కుతోంది నా మనస్సు నిన్ను తలచినంత,

'రాత్రీ-పగలు' తేడా లేదే నీకై పరితపిస్తున్న నాలోని ప్రతి ఆలోచనకి,
'జ్ఞాపకమే గతమంటే' 'ఊహలే భవిష్యత్తంటే' 'వాస్తవం నీవే'లే నిజానికీ,

ఎచ్చోట దాగున్నావో ? జతే చేర నీకింక జాగు ఏల ?  అని అడుగుతున్నా ?
ఈ కవ్వింతల దాగుడుమూతలలో ఎప్పటికైనా గెలుపు నాదేనని పయనిస్తున్నా ...