April 7, 2013

ఫేసు బుక్కు ఫాంటసీ ...


 గీత రచన : సాత్విక

(నా మొదటి గీతం ..... భరించండి ...... హ హ హ )

ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో, 

హు హు హు ....హూ హూ హూ..... 

మామపిల్ల తల్లో కాస్త , మల్లెలుంచరొ,
కన్నెపిల్ల కన్ను గీట, జాగు యేలరో..  హూ హూ.
డే అండ్ నైట్ దమ్ము కొట్ట, ఫ్రెండ్స్ పిలవరో,
ఫాస్ట్ బీట్ పబ్బు లోన, పండగ ఎట్టరో . హు హు హు

హు హు హు .... హూ హూ హూ .

మొదటి సెమ్ము అప్పనంగా, గాలి కొదలరో
రెండో సెమ్ము మొత్తముగా, దుమ్ము దులపరో ..  హూ హూ.
ప్రేమ ల్యాబ్ లోన నువ్వు ప్రాక్టికల్స్ ……    చేసేసెయ్.య్ ,
టీన్ రాకెట్ లోన లవ్వు కెమికల్స్ …….    తగలెట్టేయ్ .య్

ఓ ఓ ఓ ...... ఓ ఓ ఓ ........

ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో, 

హు హు హు ....హూ హూ హూ ..

నేనే నువ్వు , నువ్వే నేను ....హో... హో... హో... 
ఈ ఓల్డ్ స్టైల్ ప్రేమాయణం పక్కనెట్టరో,
పార్కులోనే పందిరి వేసి తగల బెట్టరో ,

వై నాట్ టు డేట్, సై అంటూ ఫైట్.. హ.. హ.. హ...
ఆ సాఫ్ట్ వేర్ షార్ట్ కట్లో డౌన్లోడ్ చేసుకో, 
ప్రతి సెకను నీకు నువ్వే అప్ డేట్స్ ఇచ్చుకో....

హ హ హ హ హ ..... హ హ హ హ హ .....

ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో రో రో .... హు హు హు 

April 4, 2013

ఇంతేలే నీ యవ్వారం...


కవిత రచన : సాత్విక


లేతప్రాయంలొ నీ కోసం నే పరితపించిన వైనాలు,
అమితమైనవి నాకు ఈ ప్రాయమునా అవే పోకడలు,
'ఋతువుల పొడవు'గ సాగేను నా ఈ ఎదురు చూపులు,
తామరాకు పై నీటిచుక్క చందమాయే నీ పలకరింపులు,

నీ దరిచేరు క్షణం కలిగించును అందమైన అనుభూతి,
ఆసాంతము ఆస్వాదించాలన్నది ఎప్పటికీ తీరని నా అత్తి,
ఎన్నిమార్లు చవి చూచినా తగ్గట్లేదు కదా నీ పై నా ఆసక్తి,
ఇప్పటిదా? అప్పటిదా? మరెప్పటిదోలే మన ఈ అనురక్తి, 

ఆహ్వానించకనే వచ్చి, అలక తీర్చి సేద తీరమంటావు,
నా అనుమతి లేకున్నా నడిరేయి చల్లంగా జారుకుంటావు,
వేకువనే నీ చాటుతో ఒంటరియైన నన్ను అదను చూసి, 
నీ మొదటి తోటికోడలు నిదురలేపును కదా మాటు వేసి,

ప్రతిసారీ నువ్వు వీడిపోయే ఆ ఉత్కంఠ క్షణాలు,
వెల్లువై పారెను మదిలో నీవు మిగల్చిన జ్ఞాపకాలు,
వీడకుండెను తనువంతా నిండిన బద్దకపు సరాగాలు,
మళ్లీ మొదలు నీకై 'ఋతువుల పొడవు'గా నా ఎదురుచూపులు,
ఆది నుంచి ఇంతేలే నీ యవ్వారం, అందుకే ఐనావు -- "ఆదివారం" !!

ఋతువుల పొడవు = ఆరు (అనగా ఆరు రోజులు అని చెప్పాలని నా బాధ ...) 

April 3, 2013

ఎవ్వరు ఏమనుకున్నా...


కవిత రచన : సాత్విక


ఎవ్వరు ఏమనుకున్నా ...
నేను నువ్వై జీవిస్తున్నా !

సరిగా తయారే కాలేకున్నా,
అద్దములోనా నిన్నే చూస్తున్నా,
అందరినీ చూసి నవ్వేస్తున్నా,
వారిలోనా నిన్నే గుర్తిస్తున్నా!

గమ్యానికి చేరుకోలేకున్నా,
రహదారి పొడవునా నిన్నే కన్నా,
నువ్వే నా ప్రకనున్నావనుకున్నా,
చిన్నపిల్లలా చిందులువేసేస్తున్నా!

వానచుక్కని వారించలేకున్నా,  
నువ్వేననుకొని పొరబడుతున్నా,
చందమామని చూడలేకున్నా,
నీలాగున్నాడని సిగ్గుతో తల తిప్పుకున్నా!

ఎందుకో ? 
నా గుండె సవ్వడి నేనే వినేస్తున్నా,
అది నీ పేరే జపిస్తుంటే మురిసిపోతున్నా, 
నా మనస్సు నాతోనే మారాం చేస్తున్నా,
అంతలోనే అది నీదని గుర్తొచ్చి మెదలకున్నా! 

ఎవ్వరు ఏమనుకున్నా,
నేను నువ్వై జీవిస్తున్నా!

April 2, 2013

మది హృల్లాసము !!

కవిత రచన : సాత్విక



సౌధంలా కనిపించానా ? స్థాణువై నిలచావు ,
స్వప్నంలా అనిపించానా ? జ్ఞాపకంగా మిగిలావు ,
వేణువై కనిపించానా ? గాలి తెమ్మరలా సాగిపోయావు ,
వెలుగై ప్రతిబింబించానా ?  నీడలాగ నిజం కాకున్నావు ,
నీ దానిగా కాకున్నానా ? నడిసంద్రములో విడిచేసావు ,

సంధ్యలా అనిపించానా ?  అస్తమయం గావించావు  ,
నాటకమనిపించానా ?  ప్రేక్షక పాత్ర పోషిస్తున్నావు ,
ఇంద్రధనస్సులా ఉన్నానా  ఛాయ మారుతున్నావా..
నిప్పుగుళిక ననిపించానా ?  అందులో ఖననమైపోతావా.. ,
పారే నదిననిపించానా ?  కడకు సాగరంలో కలిసిపోతావా ...

(హృల్లాసము = శోకము)

April 1, 2013

మ్యాజిక్కు లోని లాజిక్కు !!


కవిత రచన : సాత్విక 
నివేదిక,
చూడకనే చూసుకునే ఆ చూపులలో,
చెప్పకనే చెప్పుకునే ఆ ఊసులలో,
జనియించు క్రొంగొత్త హావభావాలలో,
ఒకరికొకరుగా తపించే సన్నివేశాలలో,
ఇది సాధ్యం అపరిపక్వతా వలయంలో,
ఇదే అందరికీ అందము యవ్వన ప్రాయంలో,

కుర్ర ప్రశ్న,
వాస్తవం అంత అందంగానుండని యెడల,
ప్రేమ పై మీ కల్పనా కవిత్వ హోరు ఏల ?
మా కెందుకీ అనవసర ప్రేరేపిత భావజాల లీల?
ఆకర్షణ చాలా అందముగా అగుపించు అంతే, అననేలా?

సమాధాన వివరణ,
'యువత'ని సులువుగా మభ్యపెట్టు బలమే ఆకర్షణ లోని వలపు,
కళ్యాణము పిమ్మట 'ఆకర్షణ'.. నిన్ను వాస్తవం ముంగిట నిలుపు,
'వర్తమాన వాస్తవిక లోని అలుపు' కలిగించును ప్రేమ పైనే మతిమరపు,
ఆ సమయంలో ఎంతటివారికయినా కావాలోయ్ చిన్న మేలుకొలుపు,

చుట్టూరా..  'ప్రేమ' మరచి పట్టు కోల్పోతున్నాయి ఎన్నెన్నో కాపురాలు,
కవిత్వములోని అభూత కల్పిత వర్ణనా సోయగాలు.............,
కొంతయినా తట్టి లేపును వారి గత ఆకర్షణ జ్ఞాపకాలు,
వెరసి నిలుప చూడ ఎన్నెన్నో వసి వాడిపోతున్న జీవితాలు,
అంతేనోయి ప్రేమ యందు కవిత్వమునకు గల ఈప్సితాలు ...

అపరిపక్వతలో కొంత మేర పరిపక్వత అవసరం 
యవ్వనము సజావుగా, మజాగా గడపటానికి ...
పరిపక్వతలో కొంత మేర అపరిపక్వత అవసరం 
వాస్తవికతలోని  యాంత్రికతను పారద్రోలడానికి ...

మ్యాజిక్కు లోని ఈ లాజిక్కు ,  తెలుసుకోకుంటే చిక్కే మరి  !!