October 23, 2013

బల (వంతపు) పరీక్ష ..

కవిత రచన : సాత్విక

'నా'  అనే  'నా ఈ మనస్సుకు' లేనే లేదు ఏ ఆకారము
దాన్ని గుర్తించటానికి నాది కాని ఈ 'శరీరమే' శ్రీకారము ..

'పైకపు' పట్టుబిగించి కావాలన్నారు ఆ శరీరపు  సహకారం 
సరదాల పరదాలో కానిచ్చేస్తునారు మనస్సుని కూడా 'అత్యాచారం '

' వృక్షో రక్షతి రక్షితః ' అన్నది అలనాటి అశోకుడి నానుడి 
అందులోని క్రావడి ఎత్తివేసినదే కాదా నా ఈ 'సోకపు అంగడి'

ఏర వేయడానికి చేసినాను, నా శరీరానికి ఈ  కల్పిత అలంకారము
ఎదురీతలో,  'మనస్సులోనే మూగబోయినది నా అసంకల్పిత ప్రతీకారము '

' గుండెలు పిండేసిన బాధ ' నా మనస్సులో దాగున్న మౌనానిది
' అవిసిన గుండెల గాధ ' మౌనమునే ఆశ్రయించిన ఆ మనస్సుది

దేహముని విడువక, నాకు ప్రాణముండి మాత్రము ఏమి ప్రయోజనము ?
నా మనస్సు నన్నే విడచి పరిగెడుతోంది  ప్రతి రోజు నూరుయోజనము

' మౌనము అర్దంగీకారం ' అన్నదే పెద్దలు చెప్పిన ఉపమానమా ?
అర్దాంగి ఆకారమే మౌనముగా రూపు దాల్చినదే  ' ఈ నా జీవితమా '

' స్వర్గాన్నే కోరుతున్నవారు అందరూ ', చవిచూపిస్తున్నారు నాకు నరకము
అవసరాల ఆత్మీయత సాక్ష్యముగా ప్రతి ఆడపడచు చెల్లిస్తోంది ఇదే సుంకము

' మానసిక వ్యబిచారమే నైతిక విలువల నజరానా ', అని వినవస్తోంది నవసమాజమున
తరచి చూడు, సాగిస్తున్నారు ప్రాణమున్న శవాలతో సంసారము అడుగడుగునా 

చిక్కదు  ఏ ఒక్కరికీ  ' దేహాన్ని విడచిన అనంతరం, ఆత్మ యొక్క చిరునామా '
అందుకే   బ్రతికుండగానే   చేసేస్తున్నా నిరంతరం నా  మనస్సుకీ  ' పంచనామా '

October 21, 2013

బ్లా...బ్లా...బ్లా... 2

కవిత రచన : సాత్విక


చేవ కలిగి త్యజిస్తే సన్యాసి
చేవ లేక వదిలేస్తే సన్నాసి  

కోరి తెచ్చుకుంటే ఏకాంతం 
అదే ఆవహిస్తే ఒంటరితనం  

నచ్చినట్టు చెబితే పెద్దరికం 
తోచినట్టు చెప్పబోతే చాదస్తం  

వలపులో చెమట తీయన
అలుపులో ఆదే చెమట ఉప్పన  

ఒక్కసారి ఓడితే అది ఆలస్యం
ప్రతిసారీ ఓడుతుంటే అది అలసత్వం ... 

అసలు నమ్మక అది అనుమానం 
పూర్తిగా నమ్మితే తప్పదు బహుమానం... 

కుదిరితే ఇద్దరికీ అది కెమిస్ట్రీ
కుదరకపోతే ఎందుకన్నది పెద్ద హిస్టరీ ... 

సంపాదించినది దాచుకొనుట 'ఆస్తి' తత్త్వం 
తన సహజత్వాన్ని నిలుపుకొనుటే అస్తిత్వం ... 

చల్లపోసి నిలువ ఉంచితే చద్ది మూట 
చల్లపెట్టేలో ఎట్టి  వేడి చేసుకోనుటే ఫ్యాషనట  

అన్నిటికీ ఆద్యుడు అయ్యాడు గణపతి 
అందుకు ఆయనా వాడాడు శివుడి దగ్గర తన పరపతి ... 

October 19, 2013

కుడి ఎడమైతే ...

కవిత రచన : సాత్విక

చెడు త్రాసుతో మంచిని తూయకు,
చెడు పంచలోనే చెడుగుడు ఆడకు,
చెడు కాని దానిని మంచి అనుకోకు,
చెడు చేసిన మంచినైనా నమ్ముకోకు,
చెడు నెరుగక మంచినే అమ్ముకోకు 

చెంత లేనిదానిని మంచి అనుకోకు,
చేతకానిదానిని చెడు అని అనకు,
చెరకులో చేదుపాలు లేనే లేదనకు,
కాకరలోని తీపిరుచిని వదిలిపెట్టకు,
'మంచి-చెడు' పోలికతో ఎలుగెత్తకు 

మంచిలో చెడుని కలిపేసి వెతకకు,
మంచి చెడు మార్చి మార్చి పిలవకు,
మంచిని చెడుని వేరుచేసి చూడకు,
మంచి చెడు స్వభావాలకి బలవ్వకు,
మంచి చెడు మనలోనేనని మరువకు 

కంచి కధలన్నీ మంచివిగా నీవు మార్చకు, 
మంచి కధలన్నీ కంచి మార్గమే పట్టించకు,
జల్లెడలో మిగులు కొన్ని నూకలు వంటకు,
కిందకి జారినవి ఉపయోగపడు ఇంకొందుకు, 
మంచి-చెడు సృష్టిధర్మమని కదులు ముందుకు 

October 6, 2013

ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే...

కవిత రచన : సాత్విక


మంచు పల్లకి కావాలని 'నేను కోరుకుంటున్నా' 
కరిగి కనుమరుగవుతుంది అని నీవంటున్నా
మనస్సెరిగి మనం వాదులాడుకుంటున్నా!
'మన అనురాగమే మంచైతే' , కరగదంటున్నా!!

స్వయంవరమునకు నేను వువ్విళ్ళురుతున్నా
మనోభారమేల అని నీవు కాలయాపన చేస్తున్నా
మనస్సు దోచి, 'నీవు రేపిన ఆశలే'  మిన్నకుండునా !
ఆ ఆశలే హరివిల్లుగ చేసి నీవే -- ' నా రాముడివంటున్నా '!!

మత్స్య యంత్రము నీ ముందు పెట్టి నే సరదా పడుతున్నా
ఇది ఏమి కుతంత్రము? అని నువ్వు దిగాలుగా కూర్చొన్నా
'పారదర్సకత లోపించని మనస్సు'లు మనవే కదా అంటున్నా!
ఆ మనస్సునే దర్పణముగా మత్స్యము నే చూపకుందునా ??

అనుక్షణం ' నీ సాంగత్యమునకై ' నా మనస్సు తపిస్తోందని నేనంటే
ఏకాంతం కూడా ఆస్వాదించుట నేర్చుకోమని నీవు నాతో అంటుంటే
రెండు ఒకటైన మనం విడివడితే ' ఏకాంతమే అగును ఒంటరితనం '!
ఏలా చెప్పను ? నీ సగం మనస్సుని -- ' నేను ఒంటరి చేయలేనని '!!

October 3, 2013

నాలుగు ముక్కలు ....

కవిత రచన : సాత్విక

' నేను అహంభావాన్ని విడిచిపెట్టాను ' అన్న మాటల్లో,
'మిగిలున్న అహంభావం' బయటపడేను కొత్త కోణంలో,
'వీగిపోవును ఏది ఏమైనా' అహం విడచిన పలకరింపుల్లో,
మరువక అప్పుడప్పుడైనా సన్నిహితులని పెడదాం మాటల్లో 

'పొరపొచ్చాలు'  సూచించును కావాల్సిన మార్పులు, 
గ్రహించి సరిచేసుకోనుటే వాటికి అసలైన తీర్పులు,
కపోతం అయినా బంధించబడి కోల్పోవును తన 'శాంతి' ,
తదుపరి మాత్రమే శాంతి కపోతముగా ఎగురును గెంతి  

మనలోనున్న  'క్రోధము'  కనిపించని శత్రువే స్వగతాన,
బయటపడిన కోపము మిగుల్చును శత్రువునే వాస్తవాన,
'కరవమంటే కప్పకు కోపం' 'విడువమంటే పాముకు కోపం', 
చిత్రమైన ఈ నిజమెరిగి వాటి జోలికి పోతే  'నీదే లోపం'  

జీవితమనే నాటకానికి తొడిగిన తొడుగే ఈ 'శరీరం' ,
కాలమనే ప్రవాహంలో కొట్టుకుపోయే  వెధవ కళేబరం,
అసలే తాపత్రయం లేకుండుటే అతి గొప్ప వరం,
ఈ నిజాన్ని మరువక మసులుకోవాలి కదా మనందరం …  

October 2, 2013

అవసరం అయితే చంపేద్దాం !!

కవిత రచన : సాత్విక
నీవు,నేను' అనేవి మరచి మనం అనుకున్నా 
నాలోని చెడుని తనకోసం వదులుకుంటున్నా
'నన్ను' నేను గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నా  
సమన్వయంతో సమన్యాయం నే సంధిచేస్తున్నా
ఆటు పోటులు అన్నిటినీ నావని ఆనందించేస్తున్నా

బ్రతుకులోని అన్ని భాధ్యతలని నేనే కూడుకుంటున్నా
'నాకు-నేను' అన్న స్వార్దాన్ని నా నుండి తీసివేస్తున్నా
'తనవారుని నావారు'గా జీవిత బంధాలు హెచ్చవేస్తున్నా
భారమనిపించిన బాధలన్ని సంతృప్తి తో భాగించేస్తున్నా 
జీవనసంగ్రామములో సోంత లెక్కలు మరచిపోయానంటున్నా


****               *****              *****              *****

స్వార్ధం ఏకాంతముగా 'తన'తో కళ్ళగంతల ఆట ఆడేస్తున్నా
తననే గెలిపిస్తూ 'తన సుఖమే' తనకి బహుమతిగా ఎరేస్తున్నా
'పుష్కర సమయం' పుసిక్కున తిరిగోచ్చేసానని నాతో అంటున్నా
'నీవొద్దు నీడబ్బు కావాల'న్న పతాక సన్నివేశం పరిచయం చేస్తున్నా
ఆహా! భళా! విధి విశ్వరూపముగ తననావహించిందా అనుకున్నా

'భవిష్యత్తు' 'పగ - ప్రతీకారం' అనూహ్యముగా నాతో పందెం కాస్తున్నా   
బలహీనమైన క్షణాల ఆసరాగా స్వార్ధమే సరికొత్త ఆటకి ఆహ్వానిస్తున్నా
నిశ్చేష్టుడనై అచేతనమైన స్థితికి చేరువులోకి  నా మనస్సు చేరుకున్నా
'పిల్లలు' అన్న బంధమే వివేకముగా నాలో మమైకమై బుజ్జగిస్తున్నా
స్వార్ధపు ఆహ్వానాన్ని కాలదన్ని 'విడాకుల'తో పనిలేదని సర్దుకుపోతున్నా
విడివడిన మనస్సులతోనున్న నా సొంతమైన మనస్సుని చంపేస్తున్నా


ఆధునిక తరానికి విన్నపము : 
వీలుంటే సర్దుకు పోండి లేకుంటే 'మీ మనస్సుని చంపేసుకోండి ' ... పిల్లలు అనే భవిష్యత్తు మరచి విడాకుల జోలికి పోకండి. 'ఆధునికత'  అనేది మన ఆలోచనలో వుండాలి,  అంతే కానీ అనాగరికులలాగ  ఎవరిదోవ వారు చూసుకొని పిల్లలకి న్యాయముగా అందాల్సిన 'పితృ మాత్రు' ప్రేమలలో ఒకదానికి మాత్రమే పరిమితం చేయవద్దు... వారి మానసాలతో ఆడుకోవలదు..