August 27, 2013

అహం బ్రహ్మాస్మి ...

కవిత రచన : సాత్విక


నా చుట్టూ ఉన్నవి కొన్నే 
నాలో ఉన్నవి ఎన్నో, ఎన్నెన్నో,
నా చుట్టూ ఉన్నవన్నీ నాకే,
పరిచయం చేస్తున్నాయి నన్నే!!  

'నన్నే' నేను తెలుసుకోలేకున్నా,
'నేను కాని నన్ను' నేనేననుకున్నా,
'నేను' అంటే తెలిసిన మరుక్షణం,
'లేని నన్ను చూసి నవ్వుకున్నా'నాకు నేనే!! 

"అహం బ్రహ్మాస్మి"లోని గెలుపే శ్రీ రాముడు,
అందులో దాగున్న అలుపే దుర్యోధనుడు,
"అహం బ్రహ్మాస్మి"లోని ఓరిమి దాన కర్ణుడు,
అందులో దాగున్న ఓటమి రావణాసురుడు  

అన్ని భావాలని ఇముడ్చుకొనుటే కాల కర్తవ్యం,
వీక్షించు అంతరంగపు కోణం నిర్ణయించును భవితవ్యం,
గీత గోవిందుడు మనకు వినిపించిన పవిత్ర కావ్యం, 
'ఇంట గెలిచి రచ్చ గెలువు' అన్నదే తాత్పర్యం

August 26, 2013

తపన-ఆశ బాధ-బాధ్యత

కవిత రచన : సాత్విక


'తపన' లోనే తాకిడి ఉంది,
'తాకిడి' లోనే పురోగమనం ఉంది,
అదే మనల్ని గమ్యానికి చేరుస్తుంది,
అందుకే కుదురుగా ఉండనీయనంది

'ఆశ' లోనే ఇంధనముంది,
అదే మన అందరినీ నడిపిస్తోంది,
అవసరానికి మించితే దహించేస్తుంది,
అందుకే 'ఆశ'కి హద్దే అత్యవసరమైంది

'బాధ' లోనే బంధనముంది,
'బంధన' లో భాద్యత దాగుంది,
బాధ్యతలోనే తృప్తి ఇమిడి ఉంది,
అందుకే సంసారంలో ఒక భాగమైంది

'భాద్యత' లోనే బరువుంది,
'బరువు'మోయ పెద్దరికం అరువంది,
'అరువు తీర్చ'  లేనేలేదు గడువు అన్నది,
అందుకే పెద్దరికానికీ బాధ్యతకీ వయసుతో పనిలేకుంది ... 

August 22, 2013

ఫ్లాష్ ఫ్లాష్ ...

కవిత రచన : సాత్విక

బ్రతకటానికి దవాఖానా, బ్రతకలేక బందీఖానా
బ్రతికుంటే చిరునామా, బ్రతకనంటే  వీలునామా
బ్రతక చాలు బలుసాకు, బ్రతుకుపోక ఏదోక సాకు
బ్రతుకులోన భక్తి భావం, బ్రతుకు ఆనక చేర్చు దైవం

సాధిస్తే నువ్వే హీరో , సాధించక  అవుతావు జీరో
సాదిస్తే వచ్చును నేర్పు,'సాధించక'  పోవును ఓర్పు 
సాధనకై వాడు ఇంధనం, సాధించక వాడకు ఏ ధనం
సాధనతో సుసాధ్యం, సాధన కొరవడితే అసాధ్యం

మనస్సే లేకుంటే మైనస్, మనస్సే మారకుంటే వైరస్
మనసు పడితే అదో అందం, మనసు కలిస్తే అదే బందం
మనసుకి లేదు వెయిట్,మనస్సులోనే వుంది అసలైన హైట్
మనస్సులు కలిస్తే కాపీరైట్, మనస్సే కరిస్తే మనం సెపరైట్

August 19, 2013

భావ సంగమం

కవిత రచన : సాత్విక



'ఆశ' -- 'ఆవేశం' వశమగునటువంటి పతాక సన్నివేశం,

'అర్ధం' -- 'యదార్ధం' నర్మగర్భమునుగ నున్న సందర్భం,

'బలమే' -- 'బలహీనత' వశమైనటువంటి బలీయమగు క్షణం, 

'మౌనం' -- 'మాట' విడివడి ఆ పై రాజీపడి ఆలపించిన రాగమే సాక్ష్యం,

'తృప్తికీ' -- 'అసంతృప్తికీ' వాదోపవాదములు మిన్నంటిన తరుణం

'బలానికి' -- 'బలహీనతకి'  ఓణుకు, చురుకు సమకూరు స్థితికి చేరువగా,

'చెమట ఉరవ'కు -- 'గాలి చొరవ' చల్లంగ చేజారి కనుమరుగవ్వంగా,

'అనాలోచన'కు -- 'యధాలాపం' ఎదురెళ్లి యధావిధిగా సహకరించ,

'సిరీ' -- 'సంపదా' పోటీగా పన్ను చెల్లింపుల ప్రక్రియ సాగించ,

'మనస్సు' హోరు -- 'వయస్సు' జోరు సరి సమతుల్యం సాధించ,

'నీవు' -- 'నేను' కనుమరుగై 'మనం' అనే భావం ఉద్భవించే అందముగా

అనేకానేక భావాల సంగమ మిళితమే 'నువ్వు' -- 'నేను' కలబోసిన మనం

వీడిపో ...

కవిత రచన : సాత్విక


'నా నీ అనుబంధం'  ప్రేమకీ, వంచనకీ నడుమ సంకీర్ణం,
మనోవ్యధ వర్షించిన ధారలో  ' నా ఆర్ధ్రతే ' ధవళ వర్ణం,
కన్నీటిధారలతో తడిసింది ఈ రోజు నా ప్రేమ చితి భస్మం,
మోయలేని భారమై హేళనగా నన్నే ప్రశ్నిస్తోంది ఆ చూర్ణం,
'ప్రేమే ద్వేషమై ఎదుట నిలచిన' కాకున్నది నా మనస్సుకి జీర్ణం,
'నమ్మకానికే' జరిగిన అమ్మకంలో ప్రేమపాళ్ళెంతన్నది అప్రస్తుతం

' హర్షించినా వర్షించినా కన్నీరే ' అన్నది  జీవనయానం,
నయవంచన జ్వాల నడయాడుతూ తెలిపెను నాకీ మర్మం, 
వంచన పంచన మిగిలి ఉన్న మనోవేదనే 'ఈ నా జీవన్మరణం',
ఎడారిలో తడారిన గొంతుకకు నేనేమాత్రం తీసిపోని తార్కాణం,
'పిలచినా అరిచినా ఆగకున్నది ఆక్రందన' అన్నదే అంతర్లీనం, 
మది అంచు దాటని వేదన దాల్చిన రూపమే ఈ అంతర్మధనం…

(జీవిత భాగస్వామి చే వంచించబడ్డ హృదయ .. మౌన రాగం)

August 15, 2013

పరుగు...

కవిత రచన : సాత్విక

పరుగు పరుగు జత కలిపి పరిగెడుతున్నా
పదుగురితో పరుగు కలప ప్రయత్నిస్తున్నా
పరుగులోని ప్రతి అడుగు ప్రతిఘటిస్తున్నా
పరుగే నా ప్రాణమై నాతోనే పందెం కాస్తున్నా

పరుగాపి నే పరుగుని గెలవ ప్రయత్నించినా
పరుగే మరుగవ్వునా ? కాలమే పరుగాపునా?
పందెంలో గెలిచినా ఓడినా తప్పనిది ప్రాణహరణమా
పరుగులు తీసే కాలానికి నా ప్రాణమే బహుమానమా

August 10, 2013

August 8, 2013

ఆలోచన నలుపు -- జీవితమే తెలుపు !!

కవిత రచన : సాత్విక



ఆనందానికి అవధి మైమరపు,
ఆలోచనకి ఆచరణ ఆటవిడుపు,
భ్రమకి  బ్రాంతి అన్నది కొసమెరుపు,
వ్యధ పంచన నిలుచున్నదే నిట్టూర్పు,
నిర్లిప్తతకే బలం చేకూర్చును ఆ ఓదార్పు,
తర్కానికి లొంగనిదే జీవితపు ప్రతి మలుపు,
శ్రద్ధ కొరవైన సమర్ధనకి మరపన్నదే మారురూపు,
అసహనం అనంతరం ఆవహించేదే అసలైన ఓర్పు,
భయానికి లొంగిపొక భరించడమే ధైర్యంతో జతకలుపు,
అవసరమే ఆయుధమైతే తప్పక తలవంచును '' గెలుపు,
విశ్వంలో ఏ స్థితికైనా ఎటువంటి పరిస్థితికైనా తప్పదు ముగింపు,
మౌనమే భాషగా 'మాట్లాడ' గలగడమే ప్రకృతిలోని  అసలైన సోంపు, 
కాలచక్ర దిగ్భందంలో 'సూర్య' 'చంద్రు'లకైనా దొరకలేదు  మినహాయింపు,
'ప్రతి పధం'లో పదును పెట్టి కలగలిపి అనుక్షణం 'ఆలోచనలన్నీ నలుపు',
అనుభవమే భాష్యంగా కాలగమనమే సాక్షిగా ఈ నిజాలన్నీ జీవితమే తెలుపు  

August 3, 2013

టేక్ దిస్ ఎగ్జిట్

కవిత రచన : సాత్విక