April 27, 2013

నా చెలి అలక,విరుపు ఆ పై వాలుచూపు ..

కవిత రచన : సాత్విక 


'అలుకఎరుగని ఆ కాలానికి అంతు చిక్కనిది అలుక సోగసు,
'చినదాని అలుకలోని అందం' కేవలం మగాడికి మాత్రమే తెలుసు,
అది ఒకింత తక్కువైతే, ఆమె తప్పక అవుతుంది అతడికి అలుసు,
మరీ ఎక్కువైతే, అది అయిపోతుంది వారిద్దరికీ కంట్లో నలుసు ...
'అలక లేని ఆడది ట్విస్ట్ లేని సినిమా' అన్నది మగడి మనస్సు

అరుపు తప్ప ఆలోచనే లేని ఆవేశానికి అర్ధం కానిదే విరుపు,
మూతి ముడుపులోనుంచే ఎక్కిస్తుంది 'చినదాని బుగ్గ ఎరుపు',
చినదాని మనసైనవాడిని, ఆ ఎరుపు ఖచ్చితముగా కుదుపు,
యాంత్రికమైన వారి పయనాన్ని ఇది సరదాలబాటలో నిలుపు,
ఇదే జంటల జీవన సాంగత్యంలోని అందమైన ప్రకృతి కూర్పు ...

జాలు వారే ముంగురులకి తెలియదు వెనుక దాగివున్న ఆమె వాలుచూపు,
ఇలాంటి చూపులలో వయస్సు చిలిపితనానికి లేకుండును అడ్డూ అదుపు,
దానిలోని కవ్వింతకు లొంగిన మగమనస్సులు కోటానుకోట్లకు పైచిలుకు,
ఈ అనుభూతిని చవిచూసిన అవి లేకుండా పడి వున్నాయి ఉలుకు పలుకు ..
ఇటువంటి గారడీ విద్య  'కానరాని ఆ వాలు చూపుకి'... ఆహా! ఎవ్వరు నేర్పు ?

April 21, 2013

నవసమాజం చిరునామా ...

కవిత రచన : సాత్విక(వీలుంటే ఆలోచిద్దాము కుదిరితే మార్పుకు ప్రయత్నిద్దాము)

పొంచి ఉన్న ప్రమాదం కాపురముంది పొరుగింట్లోనేనా ?
'పొరుగింటి పుల్లకూర రుచి' అన్నది యిక్కడ కూడానా ! 
అది అయిదేళ్ళ చిన్నారైనా, అరవై ఏళ్ళ అవ్వైనా,
ఇవే అసలైన నిజాలుఅవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..

సగటు మనిషి సంపాదన చిటికెడు, కట్టాల్సిన పన్ను గరిటెడు,
'ఆయన సంపాదన బీబీ కుట్టిపోగులకే సరి' అని సణుగుడు,
సత్కార, సరదాల, కారాగార సర్కారీ ఖర్చులు బండెడు,
ఇవే అసలైన నిజాలుఅవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..

నవ్వరో యువ నాయకుడా, ఎప్పటికీ నీ నవ్వాగదులే
'నవ్వు నాలుగు విధాల చేటు' అన్నది నీకు నిజం కాదులే,
'సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారంయిది నీకు వర్తించునులే,
ఇవే అసలైన నిజాలుఅవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..

హరిశ్చంద్రుడు పోటి చేస్తే ఒక్క ఓటయినా రాలదు యిది ఖాయం,
'హాస్యగానికి తేలుకుట్టిన చందమే' ఈ సామాజిక న్యాయం,
కుట్టినా, కుట్టకున్నా హాస్యగాని మాటలకు నవ్వడమే వారి ధ్యేయం,
ఇవే అసలైన నిజాలుఅవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..

నడిచొచ్చే నాయకుడొకడు, అడక్కుండానే  ఓదార్చేవాడొకడు,
అరిచి-గీ పెట్టినా 'నిమ్మకు నీరెత్తినట్టుండే అసలోడింకొకడు,
'నువ్వే నచ్చలేదంటే నాట్యం చేసి చూపిస్తా'నంటాడు మరొకడు,   
ఇవే అసలైన నిజాలుఅవే నేనున్న నవసమాజమపు ఆనవాళ్ళు..

April 19, 2013

అయ్యో ఇది కనికట్టా !!

కవిత రచన : సాత్విక


సముద్రములోని 'అల ఎగిసేను' వొయ్యారాలు వోలికేట్టా !
ఇంతకీ ఎగిసిన 'అల అంచున చేపపిల్ల' ఉన్నట్టా - లేనట్టా!
అల అంచున ఊగుతున్న చేపపిల్లదే అదృష్టమని బోగట్టా, 
చెట్టా పట్టా లేసుకొని చెట్టెక్కెను కదా ఒక లకుముకి పిట్టా, 
చిటారు కొమ్మనుండి తీక్షణంగా చూస్తున్నది ఎందుకట్టా ?
దాని చూపు ఎగిసి పడే అల అంచులనే కాదా? ఎట్టెట్టా ?
ముక్కున వోడిసిపట్టి తీసెను 'చేపపిల్ల జీవితం నట్టేట',
విధి, చిత్రాతి విచిత్రంగుండును కదా! ఇది ఒకరికి చెప్పెట్టా?
ఇది ఎవ్వరికీ - ఎప్పటికీ అంతు పట్టని కాలం కనికట్టా !!


April 18, 2013

ఎమీ లేదండి! అంతా నిల్ !!

కవిత రచన : సాత్విక

శూన్యమా ఓ శూన్యమా,
నీవు విశ్వంలో అనంతమా,
నీ విశాల రూపమే ఆకాశమా,
అనంతకోటి వింతల సంగమమా,
కనిపించని కాలంతో నీకు సావాసమా,
ఉండీ లేదనిపించుకునే మాయాజాలమా,
కలలో సైతం నీ ఎల్లలు ఊహించ తరమా,
సుసంపన్నమైన తారాకోటికి నీవే ఆవాసమా,
ఆది - అంతం అన్నీ నీవే అన్నది అప్రస్తుతమా,
ప్రకృతి సంధించే ప్రతి ప్రశ్నకి నీవే ఇక సమాధానమా,
నా ప్రియురాలు అంటే నీకు కూడా అంతటి అభిమానమా,
ఎల్లప్పుడూ తన చెంత చేరక ఒకింత తనంటేనే నీకంత కనికరమా, 
గ్రహపాటుగా తన మనస్సుని నేను నొప్పిస్తే నువ్వే నాకు బహుమానమా, 
నిన్ను ప్రసాదించుటే 'తనూ  నన్ను ప్రేమించింది' అనుటకు ప్రత్యక్ష సాక్ష్యమా, 
నిన్నే బహుమానంగా పొందుటే, 'నేనూ  ప్రేమించాను' అనటానికి నిదర్శనమా !
నీవు తలవంచేది కేవలం మా ఇద్దరిలోని అనురాగ ఆప్యాయతలకి మాత్రమా !!
శూన్యమా ఓ శూన్యమా --- శూన్యమా ఓ శూన్యమా --- శూన్యమా ఓ శూన్యమా  * * * 

April 17, 2013

మనసేమో ఒక మొబైలు ...

గీత రచన : గుంటూరి
నా మనసేమో ఒక మొబైలు ,  దాని వరసేమో కలిగించేను గుండె గుబేలు,
సెల్లు ఫోనులోని రింగు టోనులు,  నా మనస్సే చేసే కలవరింతలు,
అందులోని సిమ్ము కార్డులు,  నా  మదిలో రేగు లవ్వు యార్డులు
కాదంటే  కన్ఫ్యూజన్, అవునంటే ఇల్యుజన్,  నేనిస్తా దీనికి సోల్యుషన్.

న్యూ జేనరేషన్లోని వైర్లెస్ వైబ్రెషన్స్,
మనస్సుల సంభాషణే  కదా వాటికి ఇన్స్ పిరేషన్, 
నీ మనస్సుకి పెంచేయి ఈ విషయాల మీద కాన్సంట్రేషన్,
ఇక అనునిత్యం ప్రతి విషయం నీకు అనిపిస్తుంది కొత్త సెన్సేషన్....

ప్రియురాలి నోటి మాటే కంటి చూపుగా మారిపొయేను,
నా చెవులకి వినపడని ఆ మాటే నా మనసుకు మాత్రమే అర్ధమయ్యేను,
ఆలోచిస్తే అతి గొప్ప వైర్లెస్ కమ్యూనికేషన్ ఇదే కదా అనిపించేను..

*** *** ***

నా మనసేమో ఒక మొబైలు ,  దాని వరసేమో కలిగించేను గుండె గుబేలు,
కాదంటే  కన్ఫ్యూజన్, అవునంటే ఇల్యుజన్,  నేనిస్తా దీనికి సోల్యుషన్.

*** *** ***

సెల్లుఫోను కుండును అమితమయిన రేడియేషన్,
మనస్సుకేమో తప్పదు కదా ఎపుడోకపుడు కొంత డిప్రెషన్,
ఎప్పటికప్పుడు సెల్లు లోని సిం-కార్డు రీ-ఛార్జ్ చేసుకో,
ప్రియురాలితో మాటాడుకో నీ మనస్సులోనే మళ్ళి మళ్ళి రీవైండ్ చేసుకో,

ప్రతి జంటకి తప్పవు కదా చిన్నపాటి  సైక్లోన్స్,
మనస్సుని అపోహ ఆక్రమించినప్పుడు అందవులే దానికి రైట్ సిగ్నల్స్,
కవరేజి ఏరియాలో లేదని అపుడు నీవు భావించేస్తే వుండవు కదా ఎ ట్రబుల్స్,

నా మనసేమో ఒక మొబైలు ,  దాని వరసేమో కలిగించేను గుండె గుబేలు,
సెల్లు ఫోనులోని రింగు టోనులు,  నా మనస్సే చేసే కలవరింతలు,
అందులోని సిమ్ము కార్డులు,  నా  మదిలో రేగు లవ్వు యార్డులు
కాదంటే  కన్ఫ్యూజన్, అవునంటే ఇల్యుజన్,  నేనిస్తా దీనికి సోల్యుషన్.

***************


April 15, 2013

అనిపిస్తోందే చెలీ! ఇలా అనిపిస్తోందే మరి !!


కవిత రచన : సాత్విక

చల్లగాలికి ఊగే చెట్లన్నీ ,
నా ప్రేమ సందేశానికి నీ సంకేతం ' ఓకే ' అని,
తెలియచేస్తున్నట్టు అనిపిస్తోందే ...

ఎగిరిపోతున్న పక్షులన్నీ,
నే రాసిన ప్రేమలేఖలని నీకు చేరవేయ,
ప్రయాస పడుతున్నట్టుగా అనిపిస్తోందే ...

కదులుతున్న మేఘాలన్నీ,
మన ఇద్దరి పెళ్ళికి పందిరిలా మార,
సంసిద్దమవుతున్నట్టుగా అనిపిస్తోందే ...

ఎగిసి పడే సాగర కెరటాలే,
తొలిరేయి మన ఇరువురికి టాటా బై-బై చెప్ప,
ఉవ్విళ్ళూరుతున్నట్టుగా అనిపిస్తోందే ...

నీకూ ఇలానే అనిపిస్తే,
' తొండ ముదిరితే ఊసరవెల్లి ' - ' ప్రేమ ముదిరితే పిచ్చి' అని 
నాకు గొంతు చించుకొని అరిచి చెప్పాలని,
అనిపిస్తోందే చెలీ! ఇలా అనిపిస్తోందే మరి !!

April 13, 2013

ఎటో వెళ్లిపోయింది మనస్సు !!

గీత రచన : గుంటూరి


సాయం సమయం విహరించొద్దంటే ……   కస్సు బస్సు, 
జత కోరి ఆపై విచారించొద్దంటే ……   వినదు కదా ఈ మనస్సు,

ఓ మనసా,
అటు చూడకు  ఇటు చూడకు,
అసలేటూ చూడకు ……… 
అందాన్ని అసలే పట్టించుకోకు,
కుర్ర మాటలు నువ్వస్సలు వినిపించుకోకు,
విడమరచి జాగ్రత్తలు చెబుతుంటే వింతనుకోకు,

ఓ మనసా,
ఈడు సునామి హోరుకి నువ్వంటే చాలా అలుసు,
యవ్వన వారధి దాటాల్సిన పరిస్థితి నీకేం తెలుసు,
నీది ఇప్పుడిప్పుడే మొగ్గలు తొడుగుతున్న పసి వయస్సు,
పాపం పసి మనస్సు  …… అయ్యో! పాపం పసి మనస్సు 

సాయం సమయం విహరించొద్దంటే ……   కస్సు బస్సు, 
జత కోరి ఆపై విచారించొద్దంటే ……   వినదు కదా ఈ మనస్సు,

ఎటు వెళ్ళునో ఈ మనస్సు,
ఎవరి జత చేరునో నాకేం తెలుసు,

ఓ మనసా,
పార్కులలో కొన్ని,  
బస్టాపులలో కొన్ని
కాలేజీలలో అన్నీ, 
ఆ పై చెప్పిన వేవీ లేని విల్లెజ్లలో మరిన్ని,
జరిగుతున్న మనస్సు యాక్సిడేంట్లు ఎన్నో
ICU లో ఉంచి చికిత్స చేయాల్సిన గాయాలు ఎన్నెన్నో

ఓ మనసా,
శారిరిక బలాత్కారాల న్యాయానికే అధోగతి,
మానసిక బలాత్కారాల మాటే లేని సామాజిక స్థితి,
పెక్కు ధుఖ్కమ్ లో ఫక్కున నవ్వాల్సిందే నీ పరిస్థితి,
ఇప్పటికైనా అర్ధం చేసుకొని, మార్చుకో నీ మానసిక స్థితి,

సాయం సమయం విహరించొద్దంటే ……   కస్సు బస్సు, 
జత కోరి ఆపై విచారించొద్దంటే ……   వినదు కదా ఈ మనస్సు 

గోవిందా గోవిందా !!


కవిత రచన : సాత్విక 


ఆలోచనకి నేనే ఆద్యం,
మీ మేధస్సే నాకు భోజ్యం,
నాతోటి, మీకు శ్రేయస్సు అసాధ్యం,
నన్ను ' ఏరకున్న' ఎడారే మీకిక తధ్యం,

అందరి అనాలోచిత చర్యకి నేనే ప్రేరణ,
'మారుతి'కి కుదురు కాలక్షేపం నేను కానా?
'గోటితోపోయే'దని చిన్నచూపులా నా పైనా, 
ఇంకా-ఇంకా కావాలా నా గురించి వివరణ ?

కొందరికి బోడిగుండు నేత్రానందమాయెలే,
మరి కొందరికి అరగుండు బ్రహ్మానందమాయేలే,
ఏడుకొండలవాడా, నాకు నివాసమే కరువాయేలే,
వడ్డీ కాసులవాడా, నీ ఆవాసమే నాకు అరువాయేలే!

ఇలాగయితే పోను-పోను,
కనుమరుగవుతాను నేను,
నేనెవరంటే తల్లో పేను .... 
ఇంతదాకా నేను ఆరిందా,
అయిందే నా పని గోవిందా! గోవిందా !!

April 11, 2013

లేని 'మా' జీవితమా !!

కవిత రచన : సాత్విక 
స్వేచ్చే లేని స్వాతంత్రమా,
మోసం లేని కుతంత్రమా,
ప్రత్యర్దే లేని సమరమా,
సమర్ధించ లేని నిజమా,
అర్ధం లేని సూత్రమా,
నటించ లేని నాటకమా,
ప్రేరణ లేని పయనమా,
ఉండీ లేని ఆంతర్యమా,
ఊహించ లేని కారణమా,
ఆదాయమే లేని వ్యాపారమా,
గమ్యమే లేని ప్రయాణమా,
గతంలోకిపో లేని వాస్తవమా,
భవిష్యత్తెరుగ లేని స్వగతమా,
నియంత్రించ లేని ప్రారబ్ధమా ,
వితవ్యమే లేని సమాప్తమా,
ఇన్ని లేకున్నా నువ్వే  అసమానమా !

రూపం లేని ఓ జీవితమా !
నేనునూ నీ భ్యర్ధినే సుమా !!

సైకో లవ్...

గీత రచన : గుంటూరి

ఇదొక కొత్త రకం లవ్ ,
నాదేలే ఇది,  అదేలే సైకో లవ్,

ప్రేమ ఎందుకని ఎవ్వరయిన అంటే,
నీకెందుకు అని గొంతు చించుకుంటా,
కౌగిలి ఎందుకని ప్రియురాలు అడిగితే,
నేనే, తనని గిచ్చి గిచ్చి గిల్లి పెడతా,
ముద్దు నీకు నేను పెట్టనంటే,
ముక్కే పిండి వసూలు చేసేస్తా,
కస్సు బస్సు లాడిందంటే,
జస్ట్ !! కారం చల్లేస్తా,


సరికొత్త  ట్రెండ్ అని వాదిస్తా
ప్పకుంటే నేను వారి బెండు తీస్తా,
కాదంటే కరుస్తా... ఔనన్నా నేను అరుస్తా ...
కంటపడ్డవారిని ఇష్టం లేకున్నా ప్రేమించేస్తా....

ఇదేలే సరి కొత్త లవ్ఇదేలే సైకో లవ్,
నాదేలే ఈ లవ్వు నర నరాలలోకి ఎక్కిందిలే ఈ కొవ్వు ..

భూతలమే ఉయ్యాలగా కట్నమడుగుతా,
ఆకసమే పందిరిమంచంగా పక్క సిద్దం చేయమంటా,
సాగరమే స్విమ్మింగ్ పూల్ గా రాసిమ్మంటా,
హిమపర్వతమే నా కాంపౌండ్ గేటుగా కావాలంటా,

ఇవన్నీ ఇస్తే నేను ప్రేమించటం మానేస్తా,
ఇవ్వకుంటే మరీ ఎక్కువగా ప్రేమించేస్తా,
ఎవ్వరయినా అంటే నువ్వే  సైకో రా,
అరిచేస్తా నేను కైకో..రే ....

సైకో రా ... సైకో రా .......
కైకో..రే ..... కైకో..రే...   హ హ హ హ .....
నాదేలే ఇదిఅదేలే  సైకో లవ్...

నా సరదాయే పైన చెప్పినదంతా,
అసలు నాకు  దురదే పుడితే ....
ఎలా ప్రేమిస్తాననేది...  నీ ఊహకే వదిలేస్తా,
అలా ఊహించుకో అని ఊరించడమే మహా సరదా...
ఊహు ఊహు అంటే ఉప్పు పాతరేస్తా ............

కొత్తరకపు కౌ బాయినిఅసలు సిసలు ప్లే బాయిని,
లౌ గురువులందరికీ  నేనే బాబాయిని ....

ఇదేలే సరి కొత్త లవ్ఇదేలే సైకో లవ్,
నాదేలే ఈ లవ్వు నర నరాలలోకి ఎక్కిందిలే ఈ కొవ్వు..

April 10, 2013

ఎందుకో? అసలెందుకో ? ఇలా కాకున్నదెందుకో? ....


గీత రచన : గుంటూరి

ఎందుకో? ఇది ఎందుకో ?
ఆమని లోని ఆనందం ..... నే ఆస్వాదించలెకున్నానెందుకో ?
యామిని లోని చల్లదనం ... నా చెంత చేరలేకున్నదెందుకో ?

ప్రేమిస్తున్నావని నేననుకొన్నాను,
'ప్రేమ'నే మించావని తెలియదా ప్రియతమా,
ప్రేమకు ఆవల వున్నది ద్వేషమేనని తెలియదనుట... నీకు భావ్యమా ?

మనమేసిన  ప్రతి అడుగూ  కాలచక్రం మిగల్చిన జ్ఞాపకాలా ?
పంచుకున్న ప్రతి నిమిషం అవిశ్వాస తీర్మానపు గురుతులా ?    
శ్వాసించిన ప్రతి ఘడియా విధి విదిల్చిన విష జ్వాలలా ?
నడయాడిన ప్రతి చోటు ప్రకృతి నిర్దేశించిన వికృత వలయాలా ?

ఎందుకో? ఇది ఎందుకో ?
ఆమని లోని ఆనందం ..... నే ఆస్వాదించలెకున్నానెందుకో ?
యామిని లోని చల్లదనం ... నా చెంత చేరలేకున్నదెందుకో ?

కాలగమనం చేసేను మందహాసం...
అనుకొన్నాను అది అపార్ధం చేసిన చిరు దరహాసమని,
కానీ తెలుసుకోలేకపోయాను విధి చేసిన వికటాట్టహాసం అని నీకు తెలుసునా ?

'ముల్లుని ముల్లుతోనే జయించాలన్న సత్యం'  ద్వేషం ఎడల నిజం కాదులే...
నే కలత చెందినా, ఈ నిజమెరిగిన  నా మనస్సు నిన్నే దూషించదులే...
ఎడబాటు అన్న పదాన్ని తడబాటుగా కూడా ఉచ్ఛరించజాలనులే ...
వెలుగు తాకిడి ముంగిట ఏ పొగమంచైనా అస్సలు నిలువజాలదులే ... !!

ఎందుకో? ఇది ఎందుకో ?
ఎందుకో? అసలెందుకో ?

అపార్ధాల ఆవల ఉన్న 'అర్ధం' నాతో  చెప్పెను నిరీక్షించమని... 
నేనిచటనే వేచి యున్నా నీకోసం ...
చేరుకో నన్ను త్వరితగతిన ....

ఎందుకో? ఇలా కాకున్నదెందుకో ?
ఆమని లోని ఆనందం ..... ఆస్వాదించాలన్నది నా పంతం ...
యామిని లోని చల్లదనం ... ఆనందించాలి మనమిద్దరమూ  ఆసాంతం ....

ఎందుకో? అసలెందుకో  ? ఇలా కాకున్నదెందుకో ?....

April 9, 2013

ఎడబాటే ఎదురుగ ... తడబాటే తోడుగా..

గీత రచన : గుంటూరి

ఎడబాటే ఎదురుగ……….నే నిలచేను, ఈ క్షణం  
తడబాటే తోడుగా………..నువ్వై పిలచేను నన్ను, ఆ క్షణం,
మరుక్షణం .... నా నిరీక్షణం,
చేస్తున్నది నీ ఊహల చుట్టూ ప్రదక్షిణం
క్షణ క్షణం.... అనుక్షణం,
నువ్వే నేనుగా జీవించేస్తున్నా నీ క్షణం ... !!

నీడల్లే వెంటపడ్డ మౌనాన్ని ..
నిన్ను గుర్తే చేసి వేధించద్దని వేడుకొంటున్నా
నా మది ముంగిట నిలచిన ప్రతి తలంపుని....
ఆ మౌనంతోనే యుద్ధం చేసెయ్యమని పురమాయించేస్తున్నా ... !!

కంట పడ్డ జంటలనన్నిటినీ..  
మన ఇద్దరిగా నేనూహించేసుకుంటున్నా
నిలచిపోయిన ఈ కాలాన్ని....
ఆ జంటల చిలిపి చేష్టలతో జతే చేసి పరిగెత్తించేస్తున్నా ... !!   

ఎడబాటే ఎదురుగ……….నే నిలచేను, ఈ క్షణం  
తడబాటే తోడుగా………..నువ్వై పిలచేను నన్ను, ఆ క్షణం,

నువ్వే లేని ఈ క్షణం .
నాకొద్దొద్దంటూనే నీ కోసమే నే జీవించేస్తున్నా
అలా నీచెంత నే లేకుండా....
అదే ఒంటరి క్షణం నీతోటే నేను పంచేసుకుంటున్నా ... !! 

ఎగిరొచ్చిన సీతాకోక చిలుకే ...
ఎగతాళిగా వెక్కిరించేస్తున్నదనుకుంటున్నా
తన ప్రియ సఖికై వెతుకులాట అని తెలిసి ....
చిరునామా నీదగ్గరున్నదని  నీ వద్దకే తనని పంపించేసా ... !!

ఎడబాటే ఎదురుగ……….నే నిలచేను, ఈ క్షణం  
తడబాటే తోడుగా………..నువ్వై పిలచేను నన్ను, ఆ క్షణం,
మరుక్షణం .... నా నిరీక్షణం,
చేస్తున్నది నీ ఊహల చుట్టూ ప్రదక్షిణం
క్షణ క్షణం.... అనుక్షణం,
నువ్వే నేనుగా జీవించేస్తున్నా నీ క్షణం ... !!

April 8, 2013

అందంగా లేనా ?


కవిత రచన : సాత్విక 
'ముక్కుసూటి' మంచిగుండదంటారు,
'లౌక్యం'తో ఉన్నా అవహేళన చేస్తారు,
వీళ్ళందరూ, నాకు పెట్టిన పేరే 'వంకర',
ఇంక వీళ్ళ బాధలు నే తాళలేను శంకరా !!

నడవడిక బాలేకున్నా నేనే విశేషణమా, ( వంకర ప్రవర్తన )
భాష సరిగా రాకున్నా నేనే భూషణమా,  ( వంకర భాష )
బుద్ది మందగించినా నా మీదనే హైడ్రామా, (వంకర బుద్ధి)
ఇంక, వలదు వలదు ఈ చిన్నచూపు అయ్యో రామా! 

మీరానందించే ప్రతి అందమైన జీవిత ఆకృతులే..
ఆణువణువూ మెలితిరిగిన సోయగాల సొంపులే,
అక్షరమాల అందాలన్నీ సుడి తిరిగిన వంపులే,
అదృష్టాన్ని కలిగించే హస్తరేఖలు ఉండును నావలే,
ఇంతకుమించి వినిపించిన అందురు మీరు భలే భలే !!

ఇప్పుడు చెప్పండి నేను అందంగా లేనా ? ? 


April 7, 2013

ఎంజాయ్ అండ్ దెన్ బ్రేక్...


కవిత రచన : సాత్విక

మాయ అనే కొలనులో నీవున్నావు,
వాస్తవం అనే సమాధిలో నేనున్నాను,
నీకెలా వినిపిస్తుంది నా మానసిక ఆక్రందన,
నాకెలా అర్ధమవుతుంది నీ ఆ  ప్రేలాపన,

నీ ఎడబాటే నిలిచేను నాలుగు గోడలై సరిహద్దులుగా,
నా తడబాటే నీకు అనిపించేను ముద్దు మురిపెంగా,
నా ఈ అచేతనావస్థ చూడలేవు నా కన్నులు సైతం నన్నే జాలిగా,
నీకు మాత్రము అగుపించెను ఒక అందమైన గోపుర ప్రాకారంగా,

మాయా పొరలు వేగిరంగా కమ్ముకుంటున్నాయి నీ తట్టు,
వాస్తవ ఉచ్చు పట్టు బిగిసి పోతోంది నెమ్మదిగా నా చుట్టూ,
మాయలోని నీకు వాస్తవము కనపడుట సాధ్యమగునా ?
వాస్తవాన్ని మాయకు వివరించి చెప్పుట నా తరమగునా !

ప్రతి ఒక్క జంటకి ఎదురగును మన ఈ పరిస్థితి,
నిబ్బరముగా తోడు నెరిగి ముందుకు నడిపేదే మౌనస్థితి,
మౌనం మౌనం మౌనం అదే నాకూ, నీకూ ఇప్పటికి ప్రాణం,
అందుకే నేను ప్రక్కకి తప్పుకొని చేస్తున్నా ఈ అర్ధాంగీకార స్తుతి !!

గమనిక : 'అర్ధాంగి స్తుతి' ఎంత లాభమో 'అర్ధాంగీకార స్తుతి' కూడా అంతే బలం చేకూరుస్తుంది.. కాకపోతే సమయానుకూలంగా అడుగులు వేయాలి అంతే !!

Maintain the silence only if needed,
Break the silence only if required...
                                                    ...Saatvika !!

ఫేసు బుక్కు ఫాంటసీ ...


 గీత రచన : సాత్విక

(నా మొదటి గీతం ..... భరించండి ...... హ హ హ )

ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో, 

హు హు హు ....హూ హూ హూ..... 

మామపిల్ల తల్లో కాస్త , మల్లెలుంచరొ,
కన్నెపిల్ల కన్ను గీట, జాగు యేలరో..  హూ హూ.
డే అండ్ నైట్ దమ్ము కొట్ట, ఫ్రెండ్స్ పిలవరో,
ఫాస్ట్ బీట్ పబ్బు లోన, పండగ ఎట్టరో . హు హు హు

హు హు హు .... హూ హూ హూ .

మొదటి సెమ్ము అప్పనంగా, గాలి కొదలరో
రెండో సెమ్ము మొత్తముగా, దుమ్ము దులపరో ..  హూ హూ.
ప్రేమ ల్యాబ్ లోన నువ్వు ప్రాక్టికల్స్ ……    చేసేసెయ్.య్ ,
టీన్ రాకెట్ లోన లవ్వు కెమికల్స్ …….    తగలెట్టేయ్ .య్

ఓ ఓ ఓ ...... ఓ ఓ ఓ ........

ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో, 

హు హు హు ....హూ హూ హూ ..

నేనే నువ్వు , నువ్వే నేను ....హో... హో... హో... 
ఈ ఓల్డ్ స్టైల్ ప్రేమాయణం పక్కనెట్టరో,
పార్కులోనే పందిరి వేసి తగల బెట్టరో ,

వై నాట్ టు డేట్, సై అంటూ ఫైట్.. హ.. హ.. హ...
ఆ సాఫ్ట్ వేర్ షార్ట్ కట్లో డౌన్లోడ్ చేసుకో, 
ప్రతి సెకను నీకు నువ్వే అప్ డేట్స్ ఇచ్చుకో....

హ హ హ హ హ ..... హ హ హ హ హ .....

ఫేసు బుక్కు ఫాంటసీల ఫాస్ట్ బీట్ పాపరో,
లవ్వు కేసు బుక్కు చేసి హార్ట్ బీట్ పెంచరో రో రో .... హు హు హు 

April 4, 2013

ఇంతేలే నీ యవ్వారం...


కవిత రచన : సాత్విక


లేతప్రాయంలొ నీ కోసం నే పరితపించిన వైనాలు,
అమితమైనవి నాకు ఈ ప్రాయమునా అవే పోకడలు,
'ఋతువుల పొడవు'గ సాగేను నా ఈ ఎదురు చూపులు,
తామరాకు పై నీటిచుక్క చందమాయే నీ పలకరింపులు,

నీ దరిచేరు క్షణం కలిగించును అందమైన అనుభూతి,
ఆసాంతము ఆస్వాదించాలన్నది ఎప్పటికీ తీరని నా అత్తి,
ఎన్నిమార్లు చవి చూచినా తగ్గట్లేదు కదా నీ పై నా ఆసక్తి,
ఇప్పటిదా? అప్పటిదా? మరెప్పటిదోలే మన ఈ అనురక్తి, 

ఆహ్వానించకనే వచ్చి, అలక తీర్చి సేద తీరమంటావు,
నా అనుమతి లేకున్నా నడిరేయి చల్లంగా జారుకుంటావు,
వేకువనే నీ చాటుతో ఒంటరియైన నన్ను అదను చూసి, 
నీ మొదటి తోటికోడలు నిదురలేపును కదా మాటు వేసి,

ప్రతిసారీ నువ్వు వీడిపోయే ఆ ఉత్కంఠ క్షణాలు,
వెల్లువై పారెను మదిలో నీవు మిగల్చిన జ్ఞాపకాలు,
వీడకుండెను తనువంతా నిండిన బద్దకపు సరాగాలు,
మళ్లీ మొదలు నీకై 'ఋతువుల పొడవు'గా నా ఎదురుచూపులు,
ఆది నుంచి ఇంతేలే నీ యవ్వారం, అందుకే ఐనావు -- "ఆదివారం" !!

ఋతువుల పొడవు = ఆరు (అనగా ఆరు రోజులు అని చెప్పాలని నా బాధ ...) 

April 3, 2013

ఎవ్వరు ఏమనుకున్నా...


కవిత రచన : సాత్విక


ఎవ్వరు ఏమనుకున్నా ...
నేను నువ్వై జీవిస్తున్నా !

సరిగా తయారే కాలేకున్నా,
అద్దములోనా నిన్నే చూస్తున్నా,
అందరినీ చూసి నవ్వేస్తున్నా,
వారిలోనా నిన్నే గుర్తిస్తున్నా!

గమ్యానికి చేరుకోలేకున్నా,
రహదారి పొడవునా నిన్నే కన్నా,
నువ్వే నా ప్రకనున్నావనుకున్నా,
చిన్నపిల్లలా చిందులువేసేస్తున్నా!

వానచుక్కని వారించలేకున్నా,  
నువ్వేననుకొని పొరబడుతున్నా,
చందమామని చూడలేకున్నా,
నీలాగున్నాడని సిగ్గుతో తల తిప్పుకున్నా!

ఎందుకో ? 
నా గుండె సవ్వడి నేనే వినేస్తున్నా,
అది నీ పేరే జపిస్తుంటే మురిసిపోతున్నా, 
నా మనస్సు నాతోనే మారాం చేస్తున్నా,
అంతలోనే అది నీదని గుర్తొచ్చి మెదలకున్నా! 

ఎవ్వరు ఏమనుకున్నా,
నేను నువ్వై జీవిస్తున్నా!

April 2, 2013

మది హృల్లాసము !!

కవిత రచన : సాత్వికసౌధంలా కనిపించానా ? స్థాణువై నిలచావు ,
స్వప్నంలా అనిపించానా ? జ్ఞాపకంగా మిగిలావు ,
వేణువై కనిపించానా ? గాలి తెమ్మరలా సాగిపోయావు ,
వెలుగై ప్రతిబింబించానా ?  నీడలాగ నిజం కాకున్నావు ,
నీ దానిగా కాకున్నానా ? నడిసంద్రములో విడిచేసావు ,

సంధ్యలా అనిపించానా ?  అస్తమయం గావించావు  ,
నాటకమనిపించానా ?  ప్రేక్షక పాత్ర పోషిస్తున్నావు ,
ఇంద్రధనస్సులా ఉన్నానా  ఛాయ మారుతున్నావా..
నిప్పుగుళిక ననిపించానా ?  అందులో ఖననమైపోతావా.. ,
పారే నదిననిపించానా ?  కడకు సాగరంలో కలిసిపోతావా ...

(హృల్లాసము = శోకము)

April 1, 2013

మ్యాజిక్కు లోని లాజిక్కు !!


కవిత రచన : సాత్విక 
నివేదిక,
చూడకనే చూసుకునే ఆ చూపులలో,
చెప్పకనే చెప్పుకునే ఆ ఊసులలో,
జనియించు క్రొంగొత్త హావభావాలలో,
ఒకరికొకరుగా తపించే సన్నివేశాలలో,
ఇది సాధ్యం అపరిపక్వతా వలయంలో,
ఇదే అందరికీ అందము యవ్వన ప్రాయంలో,

కుర్ర ప్రశ్న,
వాస్తవం అంత అందంగానుండని యెడల,
ప్రేమ పై మీ కల్పనా కవిత్వ హోరు ఏల ?
మా కెందుకీ అనవసర ప్రేరేపిత భావజాల లీల?
ఆకర్షణ చాలా అందముగా అగుపించు అంతే, అననేలా?

సమాధాన వివరణ,
'యువత'ని సులువుగా మభ్యపెట్టు బలమే ఆకర్షణ లోని వలపు,
కళ్యాణము పిమ్మట 'ఆకర్షణ'.. నిన్ను వాస్తవం ముంగిట నిలుపు,
'వర్తమాన వాస్తవిక లోని అలుపు' కలిగించును ప్రేమ పైనే మతిమరపు,
ఆ సమయంలో ఎంతటివారికయినా కావాలోయ్ చిన్న మేలుకొలుపు,

చుట్టూరా..  'ప్రేమ' మరచి పట్టు కోల్పోతున్నాయి ఎన్నెన్నో కాపురాలు,
కవిత్వములోని అభూత కల్పిత వర్ణనా సోయగాలు.............,
కొంతయినా తట్టి లేపును వారి గత ఆకర్షణ జ్ఞాపకాలు,
వెరసి నిలుప చూడ ఎన్నెన్నో వసి వాడిపోతున్న జీవితాలు,
అంతేనోయి ప్రేమ యందు కవిత్వమునకు గల ఈప్సితాలు ...

అపరిపక్వతలో కొంత మేర పరిపక్వత అవసరం 
యవ్వనము సజావుగా, మజాగా గడపటానికి ...
పరిపక్వతలో కొంత మేర అపరిపక్వత అవసరం 
వాస్తవికతలోని  యాంత్రికతను పారద్రోలడానికి ...

మ్యాజిక్కు లోని ఈ లాజిక్కు ,  తెలుసుకోకుంటే చిక్కే మరి  !!