September 21, 2013

మోక్షము అంటే ? (2)

వ్యాస రచన : హృది


సంపూర్ణత్వము అనే ఒక భావన/స్థితి యొక్క అంతిమ ఘట్టం భావనారహిత్యము (రాగాబంధనకు అతీతమగు స్థితి). మోక్ష మార్గమునకి సూచించిన ఏ మార్గము అయినను పరిపూర్ణత్వము సాదించటానికి సూచించిన ప్రక్రియలు మాత్రమే అని నేను ప్రగాఢముగా నమ్ముతాను. 

అయితే సంపూర్ణత్వము ఏమిటి స్పందనారాహిత్యము కలుగజేయుట ఏమిటి ? అన్న సందేహము మొట్టమొదటగా జనియించు స్పృహ.  (స్పృహ అని ఎందుకు అన్నాను అంటే ? వాస్తవాన మనము మనకు తెలియకుండానే మన మనస్సులో కొన్నిటిని జీర్ణించుకొనియుంటాము అందువల్ల సంపూర్ణత్వము అంటే ఒక 'తారాస్థాయి స్థితి' అని మనం అర్ధం చేసుకొనియుండే అవకాశము మెండు. ఆ భావన మనల్ని తట్టి లేపి ఒక సందేహం రూపంలో మన మదియందు నిలుచొని ఉండి ఉండవచ్చు, అందుకే స్పృహ అని నేను పలక దలచినాను)

సరే అసలు విషయానికి వస్తే సంపూర్ణత్వమునకు  స్పందనారాహిత్యమునకు గల సంబంధం ఏమిటి ? దీనిని అర్ధం చేసుకొనే ముందు " కామిగాని వాడు మోక్షగామి కాలేడు ? " అన్న వాక్యముని పరిశీలిద్దాము ::

ఒక చెట్టుకి ఆకు పూయును. ఆ ఆకు యొక్క జీవిత చక్రము పరిశీలిస్తే, 'అంతము' అనునది రెండు విధములగా కనిపించును. 
1. త్రుంచివేయబడుట
2. రాలిపోవుట

త్రుంచివేయబడుట అను ప్రక్రియ ఆ చెట్టుకి బాధను మిగుల్చును, రాలిపోవుట అను ప్రక్రియలో బాధ  వుండదు. త్రుంచివేయబడుట అనేది ఒక అసంపూర్ణమైన ప్రక్రియ ( ఆకు ప్రాకృతిక జీవనచక్రములొ / natural life cycle), రాలిపోవుట అనేది పరిపూర్ణత్వము వనకూర్చుకున్న ప్రక్రియ అని అర్ధం చేసుకోగలము కదా. అయితే ఆకు అనేది చెట్టునుండి వేరు చేయబడటానికి 'అసంపూర్ణత్వము' 'సంపూర్ణత్వము' అనే ఈ రెండూ దోహద పడతాయి. కాకపోతే సంపూర్ణత్వము వలన సంక్రమించినచో స్పందన (బాధ) అనునది జనియించదు. అయితే ఈ ఉదాహరణ అనేది ఎందుకు ప్రస్తావించాను అంటే చెట్టుని మనస్సుగా పరిగణించగలిగితే ఆకు అన్నది మనయొక్క కోరిక అని ఊహించుకుంటే, మనలోని కోరిక అనేదానికి పరిపూర్ణత్వము ప్రసాదించిన యెడల అది తిరిగి మన మనస్సుని బాధించక తొలగిపోవును అన్న ఒక ప్రాధమిక సూత్రాన్ని గ్రహించాలి. అంటే సంగ్రాహకముగా నాకు అర్ధం అయిన విధానము ఏమిటంటే "నీవు అనబడే మనస్సుకి ఉన్న ఇష్టాలకి సంపూర్ణత్వముని ఆపాదించు, అదే నిన్ను ఆ యొక్క కోరిక నుండి విముక్తి కలిగిస్తుంది" అంటే "కామిగానివాడు మోక్షగామి కాలేడు" అని ఉవాచ.

ఆకు త్రుంపి వేయబడుటని (అసంపూర్ణత్వము) మనం విధి అని అంటుంటాము. నాకేమనిపిస్తుందంటే ఇదొక చిత్రమైన స్థితి దాని మూలార్ధము పోయి పెడ అర్ధము మన మనసులలో తాండవం చేస్తున్నదేమో అనుకొంటూ వుంటాను (మరియొక మారు తప్పక పంచుకుంటాను నా భావనల్ని).

అయితే పై చర్చలో "సంపూర్ణత్వమునకు  స్పందనారాహిత్యమునకు గల సంబంధం" అన్నదానికి "కామిగాని వాడు మోక్షగామి కాలేడు" అనేటువంటి వాటికి విశ్లేషించ ప్రయత్నిస్తూ ఇక్కడ ఇంకొక సందేహం నిద్ర లేపుకున్నాము. అంటే "మనస్సులో నిలచి ఉన్న అన్ని కోరికలకి సంపూర్ణత్వము పొందితేగాని వాటి నుండి విముక్తి లబించదా ?" అని. దీనిని మనము పరిశీలించేముందు త్యజించుట/విసర్జించుట , విముక్తి/విమోచనము అనే వాటి గురించి మాట్లాడుకోవాలి.

విముక్తి/విమోచనం అనునవి సంపూర్ణత్వము వలన సంక్రమించేటువంటి విడుదల. మనకు తేలికగా అర్ధం అవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇలా: నా మనస్సులోని కోరికను సంతృప్తి పరచటానికి నేనే  చేసే ప్రయత్నమే ఒక పరీక్ష అయితే సంపూర్ణత్వము అనగా ఆ కోరిక 100 మార్కులతో అది పాస్ అవ్వడం. (100 మార్కులు అన్నది ఒక్కొక్కరి ప్రామాణికం ఒక్కోలా వుంటాయి, దీనిని వేరోకమారు చర్చించుకోవచ్చు). అదే కోరికని ఆ పరీక్ష రాయవలసిన పని లేకుండా చేయడమే త్యజించుట/విసర్జించుటగా చెప్పుకోవచ్చు. అంటే మన మనస్సులోని కోరికలని రెండు విధములగా మనం పారద్రోలవచ్చు. పరిపూర్ణత్వం వనకూర్చుట లేక కోరికని విసర్జించుట అనే విదానములలో (అణుచుకొనుట అనునది బూస్తాపితము చేయునటువంటి విధానము, దీనివల్ల లాభము/నష్టము సమానముగా యున్నవి in simple terms postponing the exam, may be you can get a chance to get 100marks later or you may get exemption from this exam... who knows..).

మరి కోరికలని ఎందుకు పారద్రోలాలి ? అంటే 'కోరిక' స్పందనల్ని కలిగించునటువంటిది కాని మనము కోరుకుంటున్న స్థితి మోక్షము (స్పందనలకి అతీతమగునటువంటి స్థితి) గావున.

అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయము ఏమిటంటే కోరికని పారద్రోలే (పైన అనుకొన్న ఏ విధములోనైనాను) క్రమములో ఇంకొక దాని కోరిక/తపన మీదకి మనస్సుని మళ్ళించే ప్రక్రియ అధికముగా గోచరిమ్చుచున్నది. ఉదాహరణకి పరిపక్వత పొందిన నాస్తికుడు చూచు కోణం ఏమనిన " భక్తి మార్గము నన్ను వశము చేసుకోనును అందువల్ల నేను ఆ మార్గమున ప్రయాణింజాలను అని " బాగుంది,  కాని అదే సమయములో తన మనస్సుని లగ్నం గావించుటకు ఏ అంశం లేకుండా యుండుట లేక "భక్తి" అనే భావన పై ద్వేషం పెంచుకొనుట జరుగుటకు ఆస్కారం మెండు. అదే విధముగా భక్తి తత్పరులు తము నమ్మిన భక్తి మార్గము/లేక తమ నమ్మకము పై (అమితమైన) "ప్రేమ" అనే ఒక స్పందనకి తావిచ్చు విధానము మనము చూస్తూ ఉంటాము.  అయితే వీటికి అతీతముగా నున్న మహానుభావులు (భక్తులలోను/నాస్తికులలోను) మనకు అక్కడక్కడా కనిపించెదరు.

మరి వేదాలు , ఉపనిషత్తులు , సన్యాసం, ఆసనాలు, యోగా ....ఇంతమంది మహనీయులు చెప్పినవన్నీ హాస్యాస్పదమా ? అని మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే పైన చెప్పినవన్నీ పలు రకములైన మార్గములు "సంపూర్ణత్వము"ని  మనస్సుకి ఆకళింపు చేసుకొవడానికి అని నేను నమ్ముతాను. మార్గములని ప్రేమించువారి మధ్యనే మనమందరమూ కాలం గడుపుచున్నాము. ఎందుకంటే మనము వింటూ ఉంటాము కదా " ఫలానా దేవుడు మహిమ గల దేముడట " అని. అయితే ఈ వాక్యాన్ని అపహాస్యము చేయజాలను ఎందుకంటే కొంతమంది మానసిక పరిపక్వత పొందుటకు అవలంబించిన విధానములో వారు ఎంచుకున్న మార్గములో వచ్చు ఒక చిన్న అభ్యాసము అది అని నేను అర్ధం చేసుకొన్న విధానము.
మోక్ష సాధనకి "సులువుగా కనిపించే మరియొక  క్లిష్టమైన మార్గము" ఏమిటంటే "మోక్షము అంటే ఏమిటో అర్ధం చేసుకొని మనస్సుకి ఆకళింపు చేసుకోనుటే". మార్గములని ప్రేమించుటకన్నా, మార్గముల విశిష్టతలని ఎంచుకొనే కన్ననూ  గమ్యం చేరుటే ప్రధానము అన్నది గ్రహిమ్చుటే మిన్న.

ఎలాగు ఇంత మాట్లాడుకోన్నాము కాబట్టి ఆఖరుగా మరియొక మాట ఏమిటంటే ఆత్మహత్య అనునది ఆకుని త్రుంపి వేయుట వంటిది "జీవశక్తికి వేదన రగుల్చును" మరణం దానంతట అది సంబవించుట అనునది మరణచక్రములోని సంపూర్ణత్వము. కావున ఐహిక బాధలు త్రుంచి వెయదలచి జీవశక్తికి వేదన మిగుల్చువారు ఎందరో, ఒక్క క్షణం ఆలోచిస్తే వారికి వారి కళ్ళ ముందున్నవి బాధలుగా కాక సాధారణమైన అంశముగా గుర్తించగలుగుతారు. అందుకే భక్తి/నాస్తికత ఏ మార్గమైనను మానసిక స్తైర్యముని పెంపొందించుటకు వినియోగించి గమ్యము యొక్క అంతరార్ధము తెలుసుకొనుట ఉత్తమము. మరల కలిసినప్పుడు త్యజించుట/విసర్జించుట సన్యాసము/నన్/బోధకుడు/ వగైరా వగైరా మార్గముల గురించి నా భావములు పంచు కొనుటకు ప్రయత్నిస్తాను.

మరిన్ని భావములు పంచుకోనవలెను అని ఉన్ననూ (Thanks for bearing me until this point) ఈ వ్యాసము సుదీర్ఘతని దృష్టిలోనుంచుకొని  పైన  పలు సందర్భములలో లోతుగా కాక పై పైన మాత్రమే కొన్ని భావాలు వ్యక్తపరచాను (I know some of my friends are happy about it). వీలు కుదిరినప్పుడు వ్యక్తీకరణ చేయుటకు ప్రయత్నిస్తాను (sorry for this). నా భావమును పంచుకొనుటకు నేను చేసిన ప్రయత్నమే ఇది. నాకు అవగాహన లోపము ఉండి ఉండవచ్చు క్షంతవ్యుడను , విజ్ఞులు మన్నించగలరు (Thanks alot for this).

2 comments:

 1. మీ వ్యాసాన్ని అర్దం చేసుకొనే స్థాయి నాకుందో లేదో కానీ అద్భుతంగా గొప్పగా చెప్పారు

  ReplyDelete
  Replies
  1. ఎంత మాటా... ఇది కేవలం నా భావన పంచుకోదలిచి చేసిన ప్రయత్నమే ...

   మీరు చదివి మీ భావన పంచుకొన్నందుకు ...ధన్యవాదములు...

   Delete

మీ అమూల్యమయిన అభిప్రాయము/సలహాలు/సూచనలు